ముల్లా కథలు - 11 అనుకున్నదైపోయింది ------------------------------ ఓ ధనవంతుడి ఇంటికి వెళ్ళాడు ముల్లా. "అప్పులతో బాధపడుతున్న ఓ పేదవాడికి సాయం చేయవచ్చు కదండీ.మీరు ఆదుకోకుంటే చచ్చిపోతాడండి" అంటాడు ముల్లా. వెంటనే ధనవంతుడు ఓ వెండి కాసు ముల్లాకిస్తూ ఎవరా పేదవాడు అని అడుగుతాడు. "నేనే" అంటాడు ముల్లా. దాంతో తాను మోసపోయానని కోపమొస్తుంది ధనవంతుడికి. మరో వారం తర్వాత ముల్లా మళ్ళీ ఆ ధనవంతుడి వద్దకు వస్తాడు. " ఎవరో ఒక పేదవాడు అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. డబ్బులు దొరక్కపోతే పోతాడు. అతనికిప్పుడు కావలసింది సాయం. అంతేగా" అంటాడు ముల్లాను చూడటంతోనే ధనవంతుడు. "మీరు చెప్పింది అక్షరాలా నిజం" చెప్పాడు ముల్లా. "ముల్లా! ఆ పేదవాడు నువ్వేనా?" అడిగాడు ధనవంతుడు. "నేను కాదండి. మరొకరికోసమే అడుగుతున్నాను సాయం" అన్నాడు ముల్లా. అలాగా అంటూ ధనవంతుడు రెండు వెండికాసులు ముల్లాకిచ్చి ఆ పేదవాడికిచ్చేసే అంటాడు ధనవంతుడు. వెండి కాసులు తీసుకున్న ముల్లా అక్కడి నుంచి వెళ్ళడానికి లేస్తాడు. అయినా ధనవంతుడికో సందేహం వస్తుంది. ఎవరా పేదవాడో తెలుసుకోవాలనుకుంటాడు. "ముల్లా! పోయినసారి నువ్వు నీ విషయం చెప్పి ఓ వెండికాసు తీసుకోవడంలో అర్థముంది. కానీ ఈసారి ఎవడో పేదవాడికోసం నీ మనసు జాలి పడి ఈ రెండు వెండి కాసులు తీసుకుంటోంది. నీకెలాగు ఇంతటి మంచి గుణమొచ్చింది" అని ప్రశ్నించాడు ధనవంతుడు. "ఆ పేదవాడికి అప్పు ఇచ్చింది నేనే. అతను ఆ అప్పు తిరిగివ్వడేమోనని అనిపించి నేనివాళ వచ్చాను. ఇచ్చాడు ఆ దయామయుడు. నేననుకున్నది జరిగింది..." అంటూ వేగంగా వెళ్ళిపోయాడు ముల్లా. - యామిజాల జగదీశ్


కామెంట్‌లు