ముల్లా కథలు - 15 ------------------------------------ ఒకవేళ విందు నిజమైతే! ------------------------------------ ఓరోజు ముల్లా తన మిత్రుడితో మాట్లాడుకుంటూ బజారు వీధిలో వస్తున్నాడు. మార్గమధ్యంలో ఓ చోట అయిదుగురు సోమరులు నిద్రపోతున్నారు. మిత్రుడికి ఆ సోమరులను చూపిస్తూ ముల్లా "కాస్సేపట్లో వీళ్ళు కంగారుపడి లేచి పారిపోయేటట్లు చేస్తాను చూడు" అం టాడు. సోమరుల దగ్గరకు వెళ్ళి ముల్లా "ఏంటీ ఇక్కడిలా పడుకున్నారు? మీకీ విషయం తెలీదా? ఇక్కడికి మూడో వీధిలో ఓ ధనికుడి ఇంట విందు ఏర్పాటు చేశారు. ఊళ్ళోని వారందరూ వెళ్ళి విందులో రుచికరమైన వంటకాలను ఆస్వాదిస్తూ తింటున్నారు. తిన్నవాళ్ళందరూ పదార్థాల గురించి కథలు కథలుగా చెప్పుకుంటుంటే నోరూరుతోంది. కానీ మీరు ఏమీ పట్టనట్లు నిద్రపోతున్నారేంటీ...నేనూ అక్కడికే పోతున్నాను" అంటాడు. ఈ మాటలు విన్న సోమరులు ఒక్క ఉదుటున లేచి "మూడో వీధిలో విందా? మాకిప్పుడేగా తెలిసింది. ఇదిగో పోతున్నాం" అని పరుగులు తీశారు. వారి వెనుకే ముల్లా కూడా వెళ్ళాడు. వారి వెంట వెళ్ళిన మిత్రుడు దారిలో ముల్లాను ఆపి "నువ్వెందుకు పోతున్నావు ముల్లా?" అని అడిగాడు. "మూడో వీధిలో విందు అని అబద్ధం చెప్పాను. నిజమే. కానీ అక్కడ నిజంగానే విందు ఏర్పాటై ఉంటే నేను తినలేకపోయానే అని బాధపడాల్సి వస్తుంది. నిరాశపడటమెందుకు? అక్కడ నిజంగానే విందు జరుగుతోందా లేదా తెలుసుకోవటానికే పరిగెడుతున్నా" అని ముల్లా పరుగులు తీస్తాడు. - యామిజాల జగదీశ్


కామెంట్‌లు