మానేరు ముచ్చట్లు--నిన్న మన ముచ్చట్లలో వేములవాడ చాళుక్యులలో అగ్రగణ్యుడైన రెండవ అరికేసరి గురించి ప్రస్తావించుకున్నాం. కొంత మందికి సందేహం కలుగ వచ్చు.ఎలగందుల చరిత్రలో వేముల వాడ ఎందుకు వచ్చింది అని.ఎలగందులకు వేములవాడ రెండు ఆమడలు లేదా ఎనిమిది క్రోసులు అంటే పదహారు మైళ్లు ఇప్పటి లెక్కన ఇరవై అయిదు కిలో మీటర్లు(ఇది ఈ తరం వారి కోసం) దూరం లో ఉంది. హైదరా బాదులో ఇంటి నుంచి ఆఫీసుకు పోయినంత దూరం.అంత దగ్గరలో ఉన్న రాజ్యవ్యవస్థకు ఈ గ్రామానికి సంబంధం ఉండక పోవడం అంటూ ఉండదు.కనుక మనకు ఏ విధమైన శాసనాధారాలు లేకపోయినా కాకతీయుల అధీనంలోని వచ్చేదాకా తప్పక ఎలగందుల /బహుధాన్యపురం వేములవాడ చాళుక్యుల అధీనం లో ఉన్నట్టు భావించ వచ్చు.అదీ కాకుండా దక్షిణ కాశిగా అభివర్ణించబడిన వేములవాడ ప్రశస్తి నాటి ఎలగందుల జిల్లాది కూడా అవుతుంది. ఇక అరికేసరి ఆస్థానంలోని పంపకవి, అతని తమ్ముడు జినవల్లభుడు ఈ ప్రాంతానికి ఎనలేని కీర్తి ప్రతిష్టలను తెచ్చి పెట్టిన వారు.పంపకవి తండ్రి భీమప్పయ్యది వేంగినాడులోని వంగిపర్రు గ్రామం.శ్రీవత్స గోత్రీకుడు.పుట్టింది వైదిక బ్రాహ్మణ వంశమైనా యజ్ఞయాగాది క్రతువులు నచ్చక జైన మతం స్వీకరించి జైనమతావలంబులైన సబ్బినాటి పాలకులు వేములవాడ చాళుక్యులుం డటంతో 1910 లో అక్కడికి చేరుకున్నా డు. అప్పటికి పంపనికి పదేళ్లు.అప్పటికే ధార్వాడ ప్రాంతం నుంచి వచ్చి స్థిరపడ్డ జైనబ్రాహ్మణుడు సింగన జోస్యులు తన కూతురు వబ్బెణబ్బె ను భీమప్పయ్యకిచ్చి పెళ్లి చేసాడు.ఆమెకు జన్మించిన వాడు జినవల్లభుడు.అన్నదమ్ములిద్దరు నాటి రాజభాష కన్నడం,మతభాష సంస్కృ తం, మాతృభాష తెలుగును బాగా అధ్యయనం చేసి కవిత్వం చెప్పి పేరుతెచ్చుకున్నారు. పంపడు కన్నడంలో విక్రమార్జున విజయ,ఆదిపురాణం రాసి కన్నడకవిత్ర యంలో కన్న,పొన్నలతో పాటు పేరు తెచ్చుకున్నాడు.ఈయన తెలుగులో తన గురువు జినేంద్రునికి సంబంధించిన గాథను జినేంద్ర పురాణంగా రచించాడు కాని అది అలభ్యము.ఉంటే తెలుగులో అదే ఆదికావ్యమయ్యేది. జినవల్లభుడు గంగాధర సమీపంలోని వృషభాద్రి గా పిలువబడే గుట్టపై గండశిలపై కన్నడ, సంస్కృత,తెలుగు భాషలలో శ్లోకాలు పద్యాలు చెక్కించాడు.ఈ శాసనం తొలి తెలుగు పద్యానికి ఆనవాలుగా నిలిచియున్నది.ఇందులో అరికేసరి గురించి,పంపకవి పుట్టు పూర్వోత్తరాల గురించి లిఖించడమే గాక జినభవనములెత్తించుట జినపూజల్సేయుచున్కి జినమునులకు న త్తిన యన్నదానంబీవుట జినప్రభువును బోలగలరె జినధర్మ ప్రభుల్ దినకరు సరి వెల్గుదుమని జినవల్లభు నొట్టనెత్తు జితకవి నననుం మనుజులు గలరే ధాత్రిం వినితిచ్చిదు ననియ వృత్త విబుధ కవీన్ద్రుల్ అని జైనమతాభి వృద్దికి వారు చేసిన సేవలను కొనియాడారు.మూడవ పద్యం నిన్న చెప్పబడింది.ఇలా అరికేసరి కాలంలో వీరిరువురే గాక కవిజనాశ్రయ కర్త మల్లియ రేచన,సోమదేవ సూరి మొదలగు వారి గురించి తరువాత తెలుసుకుందాం.- రామ్మోహన్ రావు తుమ్మూరి


కామెంట్‌లు