పట్రాయనివారు ---------------------- రచన - యామిజాల జగదీశ్ ------------------------------------ యామిజాల కుల పయోబ్ధి సుధాంశువు/ చెళ్ళపిళ్ళ వారి శిష్యవరుడు/ భవ్య కవన శోభ పద్మనాభస్వామి/ నాదు శిష్యుడౌట నాకు గొప్ప/ ఓమారు ఓ నిండు సభలో పట్రాయని సీతారామశాస్త్రిగారు మా నాన్నగారి గురించి చెప్పిన పద్యమిది. ఇంతకూ ఈ సీతారామ శాస్త్రిగారెవరో తెలుసుకోవాలని అనిపించి మా నాన్నగారిని అడిగాను. అప్పుడు కొన్ని విషయాలు చెప్తూ వారి కుమారులైన సంగీతరావుగారి గురించి తెలిపారు. మద్రాసులో సంగీతరావుగారు మా నాన్నగారి దగ్గరకు రావడం నేను ఎరుగుదును. ఆయనతో నాకూ పరిచయమూ ఉంది. ఆదిభట్ల నారాయణదాసుగారి గురించి, సంగీతం గురించి మాట్లాడుకునేవారు మా నాన్నగారూ, సంగీతరావుగారూ. ఆయన గొంతు చాలా బాగుండేది. ఆయన కుమార్తెలు రమణమ్మ, పద్మ మా నాన్నగారి శిష్యులే. ఆయన కొడుకులు నాకు తెలుసు. ఒకబ్బాయి పేరు గోపి. మా ఇంటికి దగ్గర్లోనే ఘంటసాలవారిల్లు ఉండేది. ఆ ఆవరణలోనే పెరట్లో ఉన్న వాటాలో సంగీతరావుగారి కుటుంబం ఉండేది. సంగీతరావు గారికి చలంగారి కుటుంబంతోనే మంచి పరిచయమే ఉండేది. చలంగారి అల్లుడైన వజీర్ రహ్మాన్ గారు తమ కవితల పుస్తకంలో ఓ చోట సంగీతరావుగారి ప్రస్తావించారుకూడా. సంగీతరావుగారిని ఓమారు కలిసినప్పుడు ఆయన తమ తండ్రిగారి గురించి అనేక విషయాలు చెప్పారు. సంగీతరావుగారి తండ్రి సీతారామశాస్త్రిగారు మరెవరో కాదు, గాయకులు ఘంటసాల వేంకటేశ్వరరావుగారికి సాక్షాత్తు గురువుగారు. సీతారామశాస్త్రిగారిని చిన్నగురువుగారంటేనే సాలూరు, ఆ చుట్టుపక్కలవారికి తెలుస్తుంది. ఆయన తండ్రి నరసింహ శాస్త్రిగారు. ఈయనను పెద్దగురువుగారూ అంటారు. ఆయన ఓరోజు బొబ్బిలి రాజాగారి దర్శనం చేసుకుని సాలూరి రాజా వారి సమక్షంలో కచేరీ చేయాలని సాలూరు వచ్చారు. అలా వచ్చిన తండ్రీకొడుకులు సాలూరులోనే ఉండిపోయారు. సాలూరు రాజావారికి నాటకాల సరదా ఎక్కువగా ఉండేది. ఆ నాటకాల రిహార్సల్స్ కి ఓ వేళాపాళా లేదు. ఒకప్పుడైతే తెల్లవార్లూ రిహార్సల్ సాగేది. ఆ నాటకాలలో చిన్నగురువుగారు హార్మోనియం వాయించేవారు. అక్కడే నివాసమేర్పరచుకున్నారు. చిన్నగురువుగారిని చిన్నప్ఫుడు చిట్టిబాబు అనేవారు. వీరి ఇంటిపేరు పట్రాయని. విజయనగరం సమీపంలోని చామలాపల్లి అగ్రహారం ప్రతిగ్రహీతలే పట్రాయనివారు. వీరి తొలి ఇంటిపేరు సన్నిధివారు. సాలూరు వచ్చిన ఒకటి రెండు సంవత్సరాలకు చిన్నగురువుగారికి పెళ్ళయింది. వీరి అత్తవారింటి పేరు అయపిళ్ళ. అయపిళ్ళ లక్ష్మీనారాయణ గారి కుమార్తె మంగమ్మగారిని చిన్నగురువుగారు మనువాడారు. ఈయన 1936 లో విజయనగర మహారాజా సంగీత కళాశాలలో గాత్ర పండితులుగా చేరారు. ఈయన సంతకం చేసేటప్పుడు సీతారామ శాస్త్రి అని కాకుండా శీతారామశాస్త్రి అని రాసేవారు. తమ గురువుగారైన చిన్నగురువుగారి గురించి ఘంటసాలగారు ఇలా అనేవారు - "గురువుగారు ఎప్పుడు తలపుకి వచ్చినా హరిగుణ మణిమయ స్వరములు గళమున శోభిల్ల భక్తకోటు లిలలో తెలివితో చెలిమితో కరుణ గల్గి జగమెల్లను సుధాదృష్టితో జూచు వారలెందరో మహానుభావులు" అనే శ్రీ త్యాగరాజస్వామి వారి వాక్యానికి లక్ష్యప్రాయంగా కనబడుతారు అని. గురువుగారిని దర్శించిన ఆ క్షణమే వారి మూర్తిమంతం, ప్రియభాషణ తనను పరవశుణ్ణి చేసాయన్నారు ఘంటసాలవారు. వారి గురుత్వం ఆజన్మ సిద్ధమైనదనిపించిందని ఘంటసాల వారి అభిప్రాయం.


కామెంట్‌లు