తృప్తి, సంతృప్తి: --నా ఉద్యోగ జీవితం ఎప్పుడూ ఒక సరళరేఖలా సాగలేదు. ఎగుడుదిగుళ్ళ నేకం. ఎక్కిన మెట్లెన్నో దిగిని మెట్లూ అన్నున్నాయి. కష్టాలూ సుఖాలూ రెండూ చవిచూశాను. ఉదయం దినపత్రిక మూసేసిన తర్వాత తట్టాబుట్టా పట్టుకుని భార్య, కొడుకుతోసహా మళ్ళీ హైదరాబాద్ నుంచి మద్రాస్ చేరకతప్పలేదు. మళ్ళీ జీవితం మొదలు జీరో బ్యాలన్సుతో. పెళ్ళయిన 1983లోనూ అంతే చేతిలో పైసా లేదు. ఈనాడు పత్రికలో కంట్రిబ్యూటర్ ఉద్యోగం కోసం ప్రయత్నించాను. కానీ అది చేతికి రాలేదు. వచ్చినట్టే వచ్చి చేజారడంతో ఆంధ్రజ్యోతిలో చేరాను. అదీనూ సిఫార్సుతోనే. అలాగే అదే సమయంలో పార్ట్ టైమ్ జాబ్ శ్రీరామకృష్ణామిషన్ వారి శ్రీరామకృష్ణప్రభలో చేరాను. రామకృష్ణప్రభ సంపాదకులు సుకృతానంద స్వామీజీకి సహాయకుడిగా చేరాను. జీతం ఏడు వందల యాభై రూపాయలు. (ఉదయం సంస్థ మూసేనాటికి జీతం నాలుగు వేలు). ఇక్కడ ఉద్యోగం చేసింది నాలుగు నెలలే అయినా స్వామీజీతో దాదాపు పదేళ్ళ అనుఫంధముంది. ఇప్పుడాయన కడపలోని రామకృష్ణామిషన్ మఠానికి ఇన్ ఛార్జ్ గా ఉన్నారు. రామకృష్ణప్రభలో చేసిన నౌకరీని ఎప్పటికీ మరచిపోలేను. ఏమాత్రం రాజకీయాలకు తావులేని చోటది. కుళ్ళూ కుతంత్రాలకూ ఆస్కారమే లేదు. ప్రశాంతంగా ఉండేది. ఇక్కడ పని చేస్తున్న రోజుల్లోనే స్వామీజీ చలవతో ఓ మూడు పుస్తకాలు సమీక్షించే అవకాశం దక్కింది. ఆ మూడు పుస్తకాలలో వాల్మీకి రామాయణము : శాపములు - వరములు ఒకటి. ఇది అనువాద పుస్తకం. కరోనా లాక్ డౌన్ కారణంగా ఎటూ పోలేక పాత పుస్తకాలను తిరగేస్తున్నాను. ఇప్పుడీ రామాయణంలో శాపాలు - వరాలు పుస్తకం ఇరవై అయిదేళ్ళ క్రితంనాటిది. కానీ కొత్త పుస్తకం చదువుతున్నట్లే అనిపించింది. రామాయణం అసలు జరిగిందా లేదా వంటివన్నీ పక్కన పెట్టి పేజీలు తిరగేస్తుంటే తృప్తిగా సంతృప్తిగా ఉంది. శాపాలు, వరాలలో ఒదిగిన పూర్వాపరాల కథనాలతో ఎంతో రంజుగా ఉంది చదువుతుంటే. రామకథ వాల్మీకికి పూర్వమే ఉంది. నారదుడీ కథను వాల్మీకికి చెప్పాడు.ఆ విన్న దానిననుసరించి రామచరిత్రను రాయమని బ్రహ్మ ప్రేరేపించగా మనముందుందీ ఆదికావ్యం. రామాయణంలో శాపాలకు వరదానాలకు ఉన్న స్థానం విశిష్టమైనది. శాపాలు, వరాలకు సంబంధించి రామాయణ అధ్యయనానికి చేసిన ప్రయత్నమని, ఇదొక సంకలనమే తప్ప పరిశోధన రచన కాదని మూల రచయిత శ్రీపాద రఘునాథ భిడే (సంగన భసవేశ్వర మహావిద్యాలయం, బీజాపూర్, కర్ణాటక) చెప్పినప్పటికీ నావరకైతే ఇదొక పరిశోధిత గ్రంథంలాగే అనిపించింది. దీనిని తెలుగులోకి అనువదించినది డా. ముట్నూరు సంగమేశం. చలమచర్ల వేంకట శేషాచార్యులు సంపాదకత్వంలో శ్రీ జయలక్ష్మీ పబ్లికేషన్స్ (హైదరాబాద్) వారు దీనిని ప్రచురించారు.కేవలం శాపాలు, వరాలు మాత్రమే కాదు...శపథాలు, ఆశీస్సులు, మొక్కుబడులు, పాత్రల పరిచయాలు, స్థలపరిచయాలతో సాగిన ఈ రచన చదువుతుంటే మరొక్కసారి రామాయణ కథలోకి ప్రవేశం చేసిన అనుభూతి కలిగింది. వాల్మీకి రామాయణంలో రెండు మొక్కుబడుల వర్ణనలున్నాయి. ఈ రెండూ సీతాదేవి చేసిన మొక్కుబడులే. మూల శ్లోకాలను సైతం పేర్కొంటూ భావాన్ని సరళంగా చెప్పడంవల్ల చదవడానికి హాయిగా అనిపించింది. అనువాద రచయితకు మనసా ధన్యవాదాలు. - యామిజాల జగదీశ్


కామెంట్‌లు