అర్థంపర్థం లేని కల:--నిజంగా అర్థం లేని కలే. అయినా అంతకుముందెప్పుడైనా నాకొచ్చిన కలలు జరిగేయా ఏమిటి? నాకెప్పుడూ కలలు కార్యరూపం దాల్చలేదు. ఎవరో ఓ మహామనీషి చెప్పాడట...."కలలు కంటే సరిపోదు. కలలను ఆచరణలో పెట్టి సాధించాలని" నాకొచ్చిన కలలేవీ అనుసరించవలసినవి కావు. ఆచరించవలసినవి అంతకన్నా కాదు. అందుకే అప్పుడప్పుడూ అనిపిస్తుంటుంది నిజంగానే నిజజీవితంలో కలలు జరుగుతాయాని.నిన్న రాత్రి మామూలుగానే పడుకున్నాను. ఎప్పట్లాగే తమిళంలో ఒక హాస్య నాటిక యూ ట్యూబ్ లో చూసి పడుకున్నాను. ఎప్పుడు నిద్ర పట్టిందో గానీ బాగానే పట్టింది నిద్ర. ఎన్ని గంటలకు కలొచ్చిందో కానీ వచ్చిందో కల. అది మద్రాసులో నేను చదువుకున్న రామకృష్ణామిషన్ (మెయిన్) స్కూలు భవనం. కానీ అక్కడ క్లాసులకు బదులు సాక్షి దినపత్రిక తాలూకు ఎడిటోరియల్ గదిలో నేనున్నాను. నాకేదో ఒక ఇంగ్లీష్ వార్త ఇచ్చారు అనువదించమని. అందులో ఒక్క ముక్క అర్థమైతే ఒట్టు. ఎంతసేపటికీ బోధ పడకపోవడంతో అయోమయంలో పడింది మనసు. ఇన్ చార్జేమో రాయడమైందాని ఒకటికి రెండు సార్లు అడిగేసరికి నాకు మీరిచ్చిన వార్త మూలం కొరుకుడుపడటం లేదని చెప్పి నా వల్ల రాయడం కుదరదు అని తిరిగిచ్చేశాను. అప్పుడాయన నన్ను అందరిముందూ నానా మాటలూ అంటుంటే ఆవేశం పొంగుకొస్తోంది. కానీ ఏమీ చెయ్యలేని స్థితి. రాయలేనప్పుడు తప్పదు, మాటలు పడాల్సిందేగా. ఇంతకూ ఇన్ చార్జ్ ఎవరో తెలీలేదు. కానీ అందరిలోనూ నవ్వులపాలయ్యానన్న బాధతో ఉద్యోగం మానేసొచ్చేశాను. తీరా గేటు వరకూ వచ్చేసిన వాడిని ఎటెళ్ళాలో తెలీక మనసంతా నలిగింది. ఎందుకిలా అయిపోయిందని నామీద నాకే కోపం. తిట్టుకుంటున్నాను. ఎవరో ఒకరిద్దరు వచ్చి నచ్చజెపుతున్నా ససేమిరా అంటున్నా. ఇక ఈ మీడియాలో అడుగుపెట్టకూడదని గట్టిగా నిర్ణయించుకున్నా. ఇదంతా కలలో సంగతి. ఇంతలో తెలివొచ్చి చూస్తే నేనున్నది హైదరాబాద్ మౌలాలీలో మా ఇంట పడగ్గదిలో మంచంమీదున్నా. చీకటి. ఛ‌, ఇదంతా కలేనా అనుకుని మంచం దిగి మొహం కడుకున్నా. ఇంతకూ ఏమిటీ అర్థం లేని కల. నేనసలు మీడియాను వదిలేసి ఎనిమిదేళ్ళవుతోంది. అప్పుడప్పుడూ ఎవరైనా అవకాశమిస్తే రాయడం తప్ప. కానీ ఇలాంటి పిచ్చికలలతో కళ్ళు తెరవాలంటే భయమేస్తుంది. కలలో సన్నివేశాలు తలాతోకాలేనివని తెలిసినా ఎందుకొస్తాయో ఇలాంటి కలలు. అప్పుడప్పుడూ విద్యార్థిలా పరీక్ష రాస్తున్నట్లు కలలొస్తుంటాయి. కొలేజీ మానేసి నలభై అయిదేళ్ళయింది. కానీ డిగ్రీ పరీక్షలు రాస్తున్నట్లు కలలు రావడమేంటీ? ఒక్కసారైనా నాకిష్టమైన వాళ్ళు కలలోకొచ్చిన దాఖలాలు లేవు. కానీ కవితల్లో మాత్రం అబద్ధం రాస్తుంటాను "నంవ్వు నా కలలోకొచ్చి నిద్రపోనివ్వలేదని" నా కవితలన్నీ అబద్ధాలే. ఎవరో చెప్పారుగా, కవికి అబద్ధాలెంతో అవసరమని. ఎవరు చెప్పారో తెలీదు గానీ నిజమే నావరకైతే. - యామిజాల జగదీశ్


కామెంట్‌లు