మానేరు ముచ్చట్లు---నిన్నటి పోస్టుకి స్పందన అనూహ్యంగా ఉంది.ప్రత్యక్షంగా పరోక్షంగా ఊరితో అనుబంధం ఉన్నవారు కొందరైతే,సహృదయంతో స్పందించన మిత్రులు మరి కొందరు.ఇల్లు కాకుండా నేనెక్కువగా గడిపిన చోటు కరణాల ఇల్లు.దానికి కారణం వాళ్లింటికి వచ్చే పత్రికలు.మొదటి సారి ఎప్పుడు వెళ్లానో ఎవరితో వెళ్లానో గుర్తు లేదు కానీ,ఆ వెళ్లినప్పుడు వాళ్లింట్లో కనిపించిన చందమామ మాసపత్రికనన్నాకర్షించింది. మా ఇంటికి దగ్గరలోనే వాళ్ల ఇల్లు.సారు కొడుకుననే ఆదరం ఉండేది. ఎప్పుడు వెళ్లినా ఏమీ అనే వారు కాదు.కరణాల ఇండ్లు రెండు పక్కపక్కనే ఉండేవి.పెద్ద కరణాలు,చిన్న కరణాలు అని పిలిచే వాళ్లం.రెండు ఇండ్ల పెద్దర్వాజల మధ్య ఇంటి ముందు ఎత్తరుగుల పెద్ద చావడి ఉండేది.ఊరి పంచాయతులేవైనా అక్కడే జరిగేవి.చావడి ముందు విశాలమైన స్థలం.కుడి ప్రక్క చిన్న హనుమాండ్ల గుడి.అ ది పిల్లలకు సాయంత్రంపూట ముచ్చట్ల చావిడి.దానికి ముందు వైపు ఎత్తైన దిబ్బ ఉండేది.దాని మీద చిరుతల రామాయణం ఆడేవారు.పెద్ద కరణం గారి పేరు హనుమంత రావు పంతులు.నా చిన్న తనంలో చూచిన ఆయన స్ఫురద్రూపం కన్ను కెమెరాలో అలాగే ఉంది.ఆజాను బాహువు.గుండ్రని గంబీరమైన ముఖం. నుదుట మధ్వ సంప్రదాయపు నామం.ఆయన గంభీర స్వరం కూడా చెవుల్లోఇప్పటికీ గింగుర్లాడతుంది.పెద్ద దర్వాజ దాటగానే వాకిలి.వాకిట్లో ఎడమవైపు దఫ్తర్ కానా.అందులో చిన్న చిన్న డెస్కులు కూర్చుని రాసేవి,జమాబంది లెక్కల దఫ్తరాలు దౌతులు,కలాలు,సురుమాలు,రూళ్ల కర్రలు,ఉండేవి.మొత్తం ఈత చాపలు పరచి ఉండేవి.తహసీలుకు సంబంధించిన లెక్కలు ఎప్పుడూ రాస్తూ కనిపించేవారు గుమాస్తా ఖాజీపురం రామయ్య,భట్టువెంకటయ్య ఇంకా ఎవరో గుర్తు లేదు.మాలీ పటేలు మామిడి వెంకటయ్య అప్పుడప్పుడ లెక్కలు తనిఖీ చేయటం కళ్లబడు తుండేది.ఎప్పుడు వెళ్లినా వాళ్లున్న చావిడి దాటి ఇంటి ముఖ ద్వారం ప్రవే శించాలి.కరణాల ఇండ్లు రెండు జమిలి చతుశ్శాల భవంతులు.రెండిండ్ల మధ్య గోడ మధ్యలో ద్వారం ఉండి ఆ ఇంటికీ ఈ ఇంటికీ రాకపోకలకు వీలుగా ఉండేది.పెద్ద కరణాలింట్లో పైన డాబా ఇల్లుండేది.పైకి చెక్క మెట్లు.హనుమం తరావు పంతులుగారికి పుత్రసంతా నంలేక పోతే దౌహిత్రుణ్ని దత్తత తీసుకున్నారు.ఆయన నాకంటే స్కూల్లో సీనియరే అయినా మంచి మిత్రుడు. ఆయన మంచి ఆర్టిస్టు.ఇంట్లో వాటర్ కలర్స్ ఉండేవి ఎప్పుడూ బొమ్మలు వేస్తూండటం ఏవో రచనలు చేయటం ఇవన్నీ నాకు ఆసక్తిని రేపుతుండేవి. ఒకవైపు పుస్తకాలు చదవటం,మరో వైపు ఆయన బొమ్మలెలా గీస్తారో చూడటం,ఆయన చెప్పే కబుర్లు వినటం చిన్నప్పటి హాబీలు.ఆయన పేరు బాల్ కిషన్ రావు.తరువాత ఆయన ఎలక్ట్రికల్ ఇంజనీరింగు కోర్లు చదివి ఎలక్ట్రిసిటీ బోర్డులో ఉన్నత ఉద్యోగాలు నిర్వచించ ప్రస్తుతం విశ్రాంత జీవనం కరీంనగర్ లో గడుపుతున్నారు.వాళ్ల పెద్దన్న రాజేశ్వర రావు మంచి కవితా ప్రియుడు. వయసుల తేడా వల్ల అంతగా చనువు లేక పోయినా అపుడపుడూ పలుక రించేది.నాకు ముఖ్యంగ అనేక పత్రికలు చదివే అవకాశం వారి వల్లనే కలిగింది. చందమామతో మొదలై,ఆంధ్రపత్రిక, ఆంధ్ర ప్రభ,యువ,సినిమా రంగం, దీపావళి ప్రత్యేక సంచికలు ఇలా ఎన్నోనన్నే పాఠకుడిని చేసిన ఆ లోగిలి నా పాలిటి సరస్వతీ మహల్.నేనెప్పుడు వెళ్లినా ఏనాడూ విసుగు పడక నాకు పుస్తకాలు చదువటానికి అవకాశం కల్పించిన ఆ ఇంటి వారందరికీ నామనస్సు సదా కృతజ్ఞతా పూర్వకంగా ఉంటుంది. చిన్న కరణాల ఇంటికి అప్పుడప్పడూ పనిమీద వెళుతుండే వాడిని.కిషన్ రావు పంతులును నేను చూడలేదు.ఆయన భార్య లలితాబాయి ప్రేమగా చూచేద.ఆమె కూడా దౌహిత్రు డు హర్షవర్ధన్ రావును దత్తత తీసుకున్నది.ఆయనకు వ్యవసాయ మంటే చాలా మక్కువ.ఆ రెండు గృహాలు మా వీధికి ఒక పెద్ద ఆలంబనగా ఉండేవి.ఆ తరువాత బాంధవ్యం తో అది మరింత బలపడింది.ఇప్పటికీ ఆ రెండు కుటుంబాల ప్రేమాదరాలు అలాగే కొనసాగుతున్నాయి.నేను డిగ్రీచదువుకునే రోజుల్లో కొంతకాలం హర్షవర్ధన్ రావు గారింట్లో ఉన్నాను. వారి ప్రేమపూర్వక వితరణకు నేను సర్వదా కృతజ్ఞుణ్ని.కరణాల ఇంటి ఎదురుగా గడ్డ లాటిది ఉందని చెప్పాను గదా! అక్కడ చిరుతల రామాయణం వేసేవాళ్లు.చిన్నప్పుడు నా పై బాగా ప్రభావం చూపిన ప్రక్రియ అది.చాలా చిన్నవాడిగా ఉన్నప్పుడు అందులో చాలా కీర్తనలు పాడేవాణ్నట.మా ఇంటిని ఆనుకుని ఉన్న ధర్మశాలలో ఉండే అనాథ వితంతువు గోపాలకిష్టవాయి అనే శబరి లాంటి ముసలమ్మ నా చేత అవి పాడించుకుని మురిసిపోయేదని అమ్మ ఇప్పటికీ చెబుతుంది.ఆమె రూపం లీలగా గుర్తుంది.ఇప్పుడు టీవీలో వస్తున్న. రామానంద్ సాగర్ రామాయణ మెంత క్రేజో మా చిన్న తనంలో చిరుతల రామాయణ మంటే అంత క్రేజు.ఇప్పటికీ కొన్ని చరణాలు పెదవులపై ఆడుతుంటాయి. రామచంద్రుడనురా రాజీవనేత్రుడను శ్యామలవర్ణుడ అంటూ చిరుతల లయకు అనుగుణంగా చిరు నృత్యంతో పెట్రొమాక్స్ లైట్ల వెలుగులో ఆ పాత్ర ప్రవేశం లీలగా మెదులుతుంది. నరుడూ గాడన్నయ్యా నారాయణ మూర్తతడూ నారాయణ మూర్తతడూ అంటూ రావణుడికి విభీషణుడు హితవు చెప్పటం,వాలి సుగ్రీవుల పోరాటం,అంగద రాయబారం, హనుమంతుని కురిపిన గంతులు, వీటన్నిటి తోపాటుఅరె దేఖేతో చిత్రం లోక పవిత్రం మాకు సంబడం(సంబరం)అని ఒక ముస్లిం హాస్య పాత్ర(బుడ్డెన్ ఖాన్) ద్వారా చెప్పించటం నాటి మత సహిష్ణతకు,లోకజ్ఞతకు నిదర్శనం.ఇక నా కిప్పటికీ ఆ దిబ్బ కింద ఏ బౌద్ధ స్థూపమో ఉన్నదేమోనని అనుమానం.వెనుకటి పెద్దల కెందుకు రాలేదో నాకు తెలియదు.అది తవ్వితే తప్పక ఏదో పురాతన ఆధారం లభిస్తుందనేది ఇప్పటికీ నా విశ్వాసం.- రామ్మోహన్ రావు ,తుమ్మూరి.


కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం