"దానికేం, అవుదువుగానీ!"--స్వామి వివేకానంద జీవితంలో చిన్ననాటి ముచ్చట....నరేంద్రుడి (స్వామి వివేకానంద) స్కూల్లో చదువుకుంటున్న రోజులవి. ఓరోజు టీచర్ విద్యార్థులందరినీ అడుగుతుంది పెద్దయితే ఏమవాలనుకుంటున్నారు" అని. ఒక్కొక్కరూ ఒక్కొక్కటి చెప్తారు. నరేంద్రుడి వంతురాగానే "నాకు జట్కావాలా అవాలనుంది" అంటాడు.ఆ మాటకు సహవిద్యార్థులందరూ పెద్దగా నవ్వుతారు.దాంతో నరేంద్రుడు చిన్నబోతాడు. మొహం వేలాడేసుకుని ఇంటికి చేరుకుంటాడు. అతని ముఖాన ఉన్న విచారాన్ని తల్లి గ్రహించి దగ్గరకు తీసుకుని "ఏమైందిరా? స్కూల్లో ఏమైందిరా నాన్నా? ఎవరన్నా ఏదన్నా అన్నారా?" అని అడుగుతుంది. అప్పుడు నరేంద్రుడు స్కూల్లో జరిగిన విషయం చెప్తూ "జట్కావాలా అవడం తప్పామ్మా?" అని అమాయకంగా అడుగుతాడు. అందుకు తల్లి "ఇందుకా ఇలా బాధపడుతున్నావు. దానికేం, నువ్వనుకున్నట్టే అవుదువు. అదేం తక్కువో తప్పో కాదురా" అంటూ గదిలో మేకు తగిలించి ఉన్న గీతోపదేశం ఫోటో చూపించి మాట కొనసాగిస్తుంది "ఇదిగో, నువ్వు ఆ ఫోటోలో రథసారథిగా ఉన్న కృష్ణుడిలా అవాలి" అని చెప్తుంది. గీతార్థం చెప్తుంది.తల్లి మాట ఫలించిందిగా! స్వామి వివేకానందగా దేశ విదేశాలలో చేసిన ప్రసంగాలన్నీ యావత్ మానవాళికీ ఆణిముత్యాల్లాంటి ఉపదేశాలయ్యాయి. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఆయన మాటలు అనుసరణీయమేగా.- యామిజాల జగదీశ్


కామెంట్‌లు