మానేరు ముచ్చట్లు-కాకతి రుద్రదేవుడు కాకతీయ సామ్రాజ్యాన్ని స్వతంత్ర రాజ్యం చేయగా అతని తమ్ముడైన మహా దేవుని కుమారుడు గణపతి దేవ చక్రవర్తి దాదాపు ఆరు దశాబ్దాల పాటు పరిపాలించి దక్షిణ భారతదేశచక్రవర్తులలో అగ్రగణ్యుడిగా నిలచిన వాడు.చరిత్రకారులు శోధించి రచించిన చరిత్రననుసరించి ఇతడుయాదవరాజైన జైతుగి బందీగా కొంతకాలమున్నాడని,అంతవరకు కాకతీయులకు విశ్వాసపాత్రులుగా ఉన్న కొందరు మంత్రులు, యాదవ రాజు వద్దకు వెళ్లి తమ శక్తియుక్తులతో యాదవరాజును మెప్పించి,గణపతిదేవుని విడిపించుకుని వచ్చి సింహా సనం పై కూర్చోబెట్టడం జరిగింది.స్వ తహాగా ప్రతిభాశాలియైన గణపతి దేవుడు అచిరకాలంలోనే కాకతీయ సామ్రాజ్యాన్ని విస్తరింపజేసాడు. ఈయన అటు రాజ్యనిర్మాణంతో పాటు రుద్రదేవుడి కాలంలో మొదలైన దుర్గనిర్మాణం కూడా చేపట్టి ఓరుగల్లులో శత్రుదుర్భేద్యమైనకోటను నిర్మించి రాజధానిని అను మకొండ నుండి ఓరుగల్లుకు మార్చా డు.ఇక సబ్బిసాయిరానికి వస్తే ఈయన కాలానికి చెందిన ఎనిమిదిశాసనాలు మంథని, కటుకూరు, గొడి శాల,ధర్మపురి,కాళేశ్వరము, మేడారం,ఖంభంపెల్లి,ఎలగందులలో ఉన్నా యి.ఈ కాలానికే చెందిన రెండు తామ్రశాసనములు కూడా దొరికి నట్లు వాటి వల్ల అప్పటి ఈ ప్రాంతపాలకు డు అక్షయ చంద్రదేవుడని తెలియు చున్నది.ఓరుగల్లు కోట నిర్మాణ శైలిని గమనిస్తే ఎలగందుల కోట నిర్మాణ ములో దాని ప్రతిరూపములు అనేకం కనిపిస్తాయి.దీనిని బట్టి చూస్తే గంగాధరుని కాలములో ఇక్కడి దేవాలయ నిర్మాణము జరిగి ప్రాయికంగా ఈ ప్రాంత రాజధానికి అనువైన ప్రదేశ మని నిర్ణయింపబడి ఉంటుంది.ఎప్పుడైతే గణపతి దేవుడు చక్రవర్తి సింహాసనమధిష్టించాడో అప్పుడే రాజ్య సర్వతో ముఖాభివృద్ధికి గణనీయమైన కృషి జరిగి ఉంటుంది.ముఖ్యంగా గోదావరి,మానేరు పరీవా హక ప్రదేశము మంచి పంటలకు ఆలవాలమైంది కనుక ఈ ప్రాంత అభివృద్ధికై తగిన ఏర్పాట్లు కావించ డంలో ఆశ్చర్యపడవలసిన పనిలేదు.మరొక్క విషయము కూడా ఇక్కడ ప్రసితావించవలసిన అవసరం ఉన్నది.ఇది ఈ ప్రాంతములో నివ సించి ప్రత్యేక శ్రద్ధతో గమనించిన వారికే బోధపడుతుందన్నది నాకుఅనుభవం నేర్పిన పాఠం.స్థానికత పరిశోధకులకు ఒక అదనపు అర్హతఅని నేను భావిస్తాను.డా.సంగనభట్ల నర్సయ్య గారు స్థానికులు గావున, గోదావరి(తెలివాహ),కోటిలింగాల,బాదనకుర్తి,విశేషంగా ధర్మపురి గురించి ఎన్నో విషయాలు వెలుగులోకితెచ్చారు.అలాగే డా.జైశెట్టి రమణయ్యగారు ఈ జిల్లాకు చెందిన వారు గనుక అనేక చోట్లకు తిరిగి, విషయ సేకరణ చేసి ఎన్నో విషయాల ను వెలుగులోకి తెచ్చారు.అలాగే ఇంకా ఎందరో పరిశోధకులు కూడా ఉండిఉండవచ్చు.అనేక సాహిత్య చారిత్రకపరిశోధనలను చూస్తే నేను గమనిం చిన విషయం పరిశోధకుల స్థానికతవారి పరిశోధనలోని స్థానిక సమాచార విశేషాధిక్యతను చెప్పకనే చెప్పుతు న్నది.దీనిని నేను సమర్థిస్తాను కూడా.అంతే గాక అది చాలా అవసరమైన విషయం కూడా.ఎవరి కైనా వారి ఊరి గురించి కాని,ప్రాంతం గురించి కాని అవగాహన ఎక్కువగాఉండే అవకాశం ఉంది.కరీంనగరం నుండి హైదరాబాదు వెళ్లే మార్గంలో ,కరీంనగర్ నుండి నలభై కిలోమీటర్ల దూరంలో మానేరుకు అటువైపు దక్షిణదిశలో శనిగరం గ్రామం ఉంది.ఇక్కడి శాసనాలను పరిశీలిస్తే బేతరాజు కాలం నుంచే అనుమకొండ విషయం ఇక్కడి వరకు ఉన్నట్లు తెలుస్తుంది. తరువాతి కాలంలో వేములవాడ చాళుక్యుల అనంతరం మరికొంత దక్షిణ సబ్బిసాయిరప్రాంతం వీరి అధీనంలోనికి వచ్చిందని ఇంతకు ముందు అనుకున్నాం.అది ఏదై ఉంటుందనే విషయంపై ఎవరూ పట్టించుకున్నట్లు లేదు.మానేరుకు దక్షిణ తీరం లో శనిగరం గ్రామానికి పడమటి దిశలో ఉన్న గ్రామాలను పరిశీలిస్తే ఈ విషయం విశదమవు తుంది.బెజ్జంకి,రేపాక,ఇల్లంతకుంట, గాలిపెల్లి,గన్నేరువరం, మైలారం,హస్నాపురం,సంగెం,యాస్వాడ,వర్కోలు,కటుకూరు మొదలైన గ్రామాలన్నీ ఈ పరిధిలోకి వస్తాయి.ఇందులో కొన్ని గ్రామాలు అప్పటినుంచే ఉన్నాయి.అక్కడ లభించే విగ్రహాలు గాని ఆ గ్రామనామాలు గానీ కొన్ని నాటి కాకతీయుల కాలం ను చెలియ జెప్పేవిగా ఉన్నాయి.అందులో కొన్ని గ్రామాలు మానేరు జలాశయం ముంపుకు గురై ఆనవాళ్లు లేకుండా పోయాయి.వీటిని గురించి పరిశోధన చేయవలసిన అవసరం ఉంది.నాకు తెలిసిన ఒక ఉదాహరణం మాత్రమే చెబుతాను రేపటి ముచ్చట్లలో.- రామ్మోహన్ రావు తుమ్మూరి


కామెంట్‌లు