చిన్నపుడు మా చదువుల కోసం, ఉన్న ఊరిని వదిలి టౌన్ పక్కకి వెళ్ళే సాహసం చేసారు అమ్మానాన్న. నాకు ఏడేళ్ళ వయసపుడు కొక్కిరపాడులోని విశాలమైన ఇల్లు, తోట వదిలి, ఏలూరు చేరాము. అక్కడ పత్తేబాద సెంటర్లో మూడు ఇరుకు గదుల చిన్న ఇంట్లో నలుగురు అక్కా చెల్లెళ్ళం, అమ్మానాన్న, మా మేనత్తగారబ్బాయి, మా సహాయకురాలు తాయారు కలిసి ఎనిమిది మంది ఉండేవాళ్ళం. కాపురం మార్చాక స్కూళ్ళ వెతుకులాట మొదలయింది. మా పెద్దక్కని కెపిడిటిలోనూ మా చిన్నక్కని డాన్ బాస్కో లోనూ చేర్చారు. ఇక మిగిలింది నేనూ మా మూడో అక్క విజ్జి. నన్ను ఒక ఏడాది ముందుగా బళ్ళో వేసి ఉండటాన మేమిద్దరం ఒకే తరగతిలో ఉండేవాళ్ళం. మా ఇద్దరినీ మంచి స్కూల్లో చేర్చాలని గట్టిగా అనుకున్నారు. అప్పటికి ఏలూరులో ‘సెయింట్ థెరిస్సా కాన్వెంట్’ చదువుల నిలయం. అప్లికేషన్ పెట్టడం లాంటి తతంగాలు ముగిసాక ఒకరోజు మా ఇద్దరికీ పరీక్ష పెట్టడానికి పిలిచారు. పరీక్ష కోసం మా చేతికి నోటుబుక్కులు, పెన్సిళ్ళు ఇచ్చింది పొదుపరి అయిన అమ్మ. అప్పటివరకూ మేము పలకా బలపం బాచీ కనుక అవి పట్టుకోగానే కసింత డాంబికంగా అనిపించింది. సంబరంగా మా ఇద్దరినీ పరీక్షకి తీసుకుని వెళ్ళారు నాన్న. మేరీమాత అందమైన విగ్రహం, ఎత్తైన ప్రహరీ లోపల కంచుకోటలా కనిపిస్తున్న కట్టడాలు – అటువంటి స్కూలుని చూడటం ఆ వయసుని అబ్బురపరిచే విషయం. నాన్నని బైటే ఆపేసి, మమ్మల్ని లోపలికి తీసుకు వెళ్లి ఒక గదిలో ప్రవేశ పెట్టారు. అక్కడ ఇంకెవరూ లేరు, గదంతా ఖాళీగా ఉంది. ఒక కుర్చీ మాత్రం ఉంది. తీసుకు వెళ్ళిన ఆయా విజ్జిని నన్నూ గదికి చెరో మూలా నేల మీద కూచో బెట్టింది. ఈ ఆవరణం చిన్న మనసులో ఎంతలా మిగిలి పోయిందంటే చాలా సూక్షమైన విషయం ఒకటి గట్టి ముద్ర వేసింది – కరెంటు పోయిందో ఏమో అక్కడ లైట్లు లేవు, అన్నివైపులా మూసి ఉన్నగదిలో ఒక కిటికీ రెక్క ఓరగా తెరిచినపుడు ఎంత వెలుగు, గదిలో ఉంటుందో అంతే మసక వెలుగు. ఈ విషయం గుర్తు వచ్చినపుడల్లా ఆ మసక వెలుతురే ముందు పలకరిస్తుంది. కాసేపటికి ఒక టీచరమ్మ వచ్చింది. వెంటనే నేనూ విజ్జి, చిట్టిముత్యాల్లా లేచి నిలబడ్డాం. అప్పటికే డాన్ బాస్కోలో చేరిన చిన్నక్క బోధించినట్లు ‘గూడ్ మోణింగ్ టీచ’ అని కూడా ఆమెని పలకరించాం. రాగానే ఆమె మాకు పరీక్ష పెట్టారు. తప్పులు లేకుండా వరుస క్రమంలో ఎబిసిడి లు రాయాలి. కొక్కిరపాడు స్కూల్లో అప్పటికి ఇంగ్లీష్ చెప్పేవారు కాదు. కానీ సెలవల్లో ఇంటి దగ్గర నేర్చుకున్నాం. మాకు పరీక్ష ఇచ్చేసి, టీచరమ్మ హడావిడిగా బైటకి వెళ్ళిపోయింది. కాగితం గడుల లోపల పెన్సిల్ తో విన్యాసాలు మొదలు పెట్టి పరపరా రాసేసి విజ్జివైపు మిటుకూ మిటుకూ చూస్తూ కూచున్నాను. కాసేపటికి టీచరమ్మ వచ్చింది. ‘రాసేసారా?’ అంది. ‘ఓ’ అన్నాం. మా నోట్సులు ఇవ్వబోతే తీసుకోలేదామె. ‘మీ ఇద్దరిలో ఎవరు తప్పులు లేకుండా బాగా రాసారు?’ అనడిగింది. ఆ ప్రశ్నకి గుడ్లప్పగించి చూసాను. తొందరగా ఇంటికి వెళ్లిపోవచ్చనో, ఎగురుతూ తుళ్ళుతూ ఉండటం అలవాటు కావడం వల్లనో – ‘నేనే బాగా రాసా నేనే రాసా’ నోట్సు గాల్లో ఆడించి గెంతుతూ చెప్పింది విజ్జి. అయిపోయింది పరీక్ష. బైటకి వచ్చి నాన్నగారిని కలిసిన టీచరమ్మ, మా విజ్జికి సీటు ఇస్తున్నామని చెప్పింది. నాన్న ఆశ్చర్యపోయి ‘మా జాజి తెలివైనది, తనకి సీటు రాకపోవడం ఏంటని’ ఆశ్చర్యంతో అడిగారట. ‘ప్రశ్న అడిగితే గుడ్లప్పగించి చూసింది తప్ప ఆ పిల్ల మాట్లాడలేదు, పిల్లలన్నాక దబాయించి చెప్పడం నేర్చుకోవాలి, అందుకే ఫెయిల్ చేసాం’ అందట. ఇంటికి వచ్చాక మా ఇద్దరి నోట్సులూ పరిశీలించారు నాన్న. నా నోట్సులో ఒక్క తప్పు కూడా లేదు. విజ్జి నోట్సులో రెండు తప్పులు ఉన్నాయి. ‘నువ్వు బాగా రాసానని ఎందుకు చెప్పలేదని’ నాన్న అమ్మ అడిగారు. అప్పటికి చిన్నదాన్ని కనుక ఎలాంటి మాటల్లో వ్యక్తం చేసానో గుర్తు రావడం లేదు కానీ టీచరమ్మ ముందు గుడ్లప్పగించి చూసిన ఆ క్షణంలో నా మనసులో మెదిలిన ఒక నొచ్చుకోలు, ఒక ప్రశ్న, ఇప్పటికీ గుర్తు ఉన్నాయి. ఎలాంటి ఉపద్రవం నుంచయినా మా అక్కల్నీ నన్నూ ఒంటి చేత్తో దాటించే మా విజ్జితో నాకు పోటీ పెట్టారన్నది ఒకటి, ‘దూరదూరంగా కూచుని విడివిడిగా రాసాక ఎవరి దాంట్లో తప్పు ఉందీ ఎవరి దాంట్లో తప్పు లేదూ అన్నది మా ఇద్దరికీ ఎలా తెలుస్తుంది?’ అన్న ప్రశ్న ఒకటి నా ఆలోచనల్లోకి వచ్చాయి. మౌనంతో వేసుకునే ప్రశ్నల కన్నా దబాయింపే పరమ సత్యంగా, నీతి వాక్యంగా, విజయ సూత్రంగా నమ్మించే, బోధించే ఈ టీచరమ్మ లాంటిది మెజార్టీ లోకం. ఒక్క తప్పు లేకుండా రాసిన నా నోట్సు కూడా పరమ సత్యమో, గొప్ప జ్ఞానమో కాదని తెలుస్తూ వచ్చాక ఈ విద్యార్థిని పరాజయం సంపూర్ణమయింది. నలుపు, చీకటి, పశుత్వం, అనైతికం, దరిద్రం, కురూపత్వం, తక్కువతనం, చెడ్డతనం, అపజయాల గుట్టుమట్ల కోసం వాటితో చెలాంతికాలాడే నా మనసు, అందులో పడి నలిగే సవాలక్ష ఆలోచనలూ ప్రశ్నలే నేను కోరుకున్న విజయం.దబాయింపులన్నీ పరమ సత్యాలు కానట్లే అన్ని మౌనాలూ అంగీకారాలు కావు. - జాజి మల్లి జాజి


కామెంట్‌లు