నేనంటే ...---జీవితంలో అనేక ఆశలతో కలలతో ఏదో ఒకరోజు విలాసవంతమైన జీవితం జీవించాలని కష్టపడి చదువుతున్నాడు. మంచి మార్కులతో ప్యాసై మంచి ఉద్యోగం పొందాలని ఆశ. అయితే అలాగే కష్టపడి చదివాడు. మంచి ఉద్యోగమూ వచ్చింది. కానీ అనుకోని సమస్యలతో ఒత్తిడికి లోనవుతున్నాడు. అతను అనుకున్న చాలా ఆశలు నెరవేరలేదు ఏవో ఒకటి రెండుతప్ప. మనసులో రోదనే. ఏంటిలా అయిపోయింది బతుకూ అని నీరసించిపోయాడు.అతనికెవరో చెప్పగా తిరువణ్ణామలైలో ఉన్న రమణాశ్రమాన్ని చూసిరావాలనిపించింది. సరే అనుకుని ఓమారు వెళ్ళాడు.అక్కడ భగవాన్ రమణ మహర్షి సమాధి చూశాడు. రమణ మహర్షి ధ్యానం చేసిన గదిని చూశాడు.అక్కడ అనుకున్నాడు..."భగవాన్ నాలో ఏవేవో ఆశలు. నాకవేవీ నెరవేరడంలేదు. దాంతో నాకు జీవితంమీద విరక్తి పుడుతోంది. నా మిత్రులందరూ మంచి మంచి హోదాల్లో ఉన్నారు. ఉన్నవాటితో తృప్తిపడలేకపోతున్నాను. నేనేం చెయ్యాలి. నేను మాత్రం ఎందుకిలా ఉన్నాను స్వామీ అని అన్నాడు. అప్పుడతనికి ఓ మృదువైన గొంతు వినిపించింది.అవును అన్నిసార్లు నేనూ నేనూ అని అంటున్నావు. ఇంతకూ ఈ నేను ఎవరు? నీ దేహాన్ని చెప్తున్నావా? లేక నీ మనసుని చెప్తున్నావా? నాకొక్కసారి ఆ "నేను"ని చూపవా? ఆ నేనులోనే కొంతసేపు ఉండి చూడు. నాకు నాకూ అంటున్నావు కదా. నాకు బాధగా ఉందంటున్నావు. ఇంతకూ ఆ నేను అనేది ఎరుపా? నలుపా? లేక అదేమన్నా వస్తువా? లేక నీ మెదడా? నీ మనసా? లేక నీ కళ్ళా? లేక నీ చెవులా? నేను అనే దాని స్వభావమేంటీ? అని భగవాన్ ప్రశ్నిస్తున్నట్లు వినిపించింది. యువకుడు తనకేమీ అర్థంకాలేదన్నాడు.మళ్ళీ భగవాన్ మాటలు వినిపించాయి..."నాకు అర్థంకాలేదంటున్నావు. మళ్ళీ నాకూ నేనూ అంటున్నావు. ఏమిటవి? నేనూ అనే భావన నిన్ను వదిలిపెట్టలేనంత గట్టిగా పట్టుకుందా? ఉదాహరణకు...నీకు ఉక్కగా ఉందనుకో. చెమటపడుతుంది. ఒంట్లో వేడిగా ఉందంటావు. అలాగే చలి ఎక్కువైనప్పుడు చల్లగా ఉందంటావు. అంటే ఇంతకూ ఈ అనుభూతులు అనుభవిస్తున్నవన్నీ నేనూ నాకూ అనుకున్నవేనా? లేక నీ దేహానిదా? ఏది అనుభవిస్తోంది? ఏదలా చెప్పిస్తోంది? నువ్వు అనేదేంటో తెలుసుకో. అది తెలుసుకోగలిగితే నీలోని మానసిక సంఘర్షణకు తావుండదు. నిలకడగా ఉంటుంది. నువ్వేం చేసినా ఈ అరుణాచలంమీద భారంమోపి చెయ్యి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడైతే నాదీ నీదీ నేనూ నువ్వూ అనేవి లేకుండాపోతాయో అప్పుడు ఈ గొడవలుండవు...." అని భగవాన్ చెప్తున్నట్టే అనిపించిందా యువకుడికి అంతే, అప్పటి నుంచి అతనిలో క్రమేపీ మార్పు వచ్చింది.ఇటువంటివి చదువుతున్నప్పుడో విన్నప్పుడో చలంగారి మాటలు గుర్తుకొస్తాయి.... "నీకు నేనత్యంత అవసరమని, నా రాకకై చీకటిని చీల్చి నువ్వు నిరీక్షిస్తున్నావని, చివరికి ఎట్లాగో నన్ను నీ సమక్షాననిలుపుకుంటావని ఎందుకో నమ్మకం. చాలా స్పష్టమైన అసందర్భపు విశ్వాసం కాకపోతే ఈ ఇసికలో పడుకుని నిద్రపోవాలనిపిస్తోంది. నీలో తప్ప నాకు లోకంలో చోటు లేదు. నీ ఆలింగనంలో తప్ప నాకు శాంతి లేదు. భగవాన్ నువ్వే గతి. నాకింక శక్తి చాలదు...." - యామిజాల జగదీశ్


కామెంట్‌లు