మానేరు ముచ్చట్లు---నిన్న మిత్రుడు చారిత్రక పరిశోధ కుడు శ్రీరామోజు హరగోపాలన్న తన టైం లైన్ లో నా ప్రస్తావన తేవటం చాలా ఆనందం కలిగించింది. సోద రుడు నా లాగానే విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు. ఆయన తన పదవీ విరమణానంతరం తలపెట్టుకున్న పెద్ద లక్ష్యం తెలంగాణా చారిత్రక పరిశోధన.పల్లె పల్లెకు తిరిగీ రాయినీ రప్పనూ పరిశీలించి,అనేక శిలాకృతులనూ,శిల్పాలనూ విశ్లేషించి కొత్త తెలంగాణా చరిత్ర పేరుతో ఫేస్బుక్ లోని టైం లైన్ లో పలు చారిత్రకాంశా లను వివరిస్తూ వస్తున్నారు.నేను చింతామణి చెరువుకట్ట క్రింది ఎలగందుల శాసనం నీడబొమ్మను పంపిస్తే దానిని చదివి నాకు శాసన పాఠాన్ని పంపించారు.అలాగే ఇటీవల రామాలయంలోని మూల విరాట్టుల నీడ బొమ్మలను పంపిస్తే వాటిని బాగా పరిశీ లించి వివరాలుతెలియజేశారు.వివరాల గురించి చెప్పే ముందు రాములవారి గుడి గురించి కొన్ని వివరాలు తెలుసు కుందాం. నిన్నటి ముచ్చట్లలో కొంత ప్రస్తావన వచ్చినా మరికొంత తెలియ జేయాల్సి ఉంది.నాకు ఊహ తెలిసే సరికి అష్ట గ్రహకూటమి కంటే ముందు గుళ్లు రెండూ మట్టి గోడలతో చీకటి గుయ్యారాల వలె ఉండేవి.అంతే గాక గుడి చుట్టూ ఉన్న ఆవరణమంతా మట్టితో కట్టిన ప్రహరీ గోడ ఉండేది.రామాలయం వెనుకవైపు నైఋతి దశలో రామాలయ పూజారి సాతాని వైష్ణవులైన పురుషోత్తం అయ్యవార్ల ఇల్లుండేది.చాత్తాద పదమే సాతాని పదంగా రూపాంతరం చెందిందని నాకు తెలియడానికి చాలా కాలమే పట్టింది.చాత్తాద వైష్ణవులను అయ్యవార్లని పిలువటం తెలంగాణాలో వాడుకలో ఉన్నది. పురుషోత్తమాచారి భార్య యశోదమ్మ సాధారణంగా గుడి శుభ్రపరచడం దేవునిక దీపం పెట్టడం నేను ఎక్కువసార్లు చూశాను.ఆయన యాయవారానికి వెళ్లేవాడు. గుడికంటే మాకు వాళ్లింటికి వెళ్లే అవసరం ఎక్కువ కలిగేది. ఎందు కంటే యశోదమ్మ తీరిక వేళల్లో పచ్చి మోత్కాకు (మోదుగ ఆకు) విస్తర్లు కుట్టి అమ్మేది.ఇంట్లో ఏ చిన్న కార్యం పడ్డా అయ్యోరోళ్లింటికి విస్తార్ల కోసం వెళ్లాల్సిందే.అయితే పురుడు లేదా ఇరవై యొక్కటి,మాసికం లేదా తద్దినం అదీ కాకపోతే పండుగ పబ్బం ,చుట్టాలు పక్కాలు,పనిపాటల వాళ్లు ఎవరు వచ్చినా విస్తరి భోజనమే.ఆమె విస్తర్లు చాలా అందంగా కుట్టేది. సందర్భాలను బట్టి పెద్దవి చిన్నవి కుట్టి ఇచ్చేది. సాధారణంగా విస్తరణలు తెచ్చే పని నాకే పడేది. అదేదో సామెత ’బావండ్లలో చిన్నోడు బెస్తోళ్లలో పెద్దోడు అయి పుట్టగూడ దనే ‘ది చాలాకాలం దాకా అర్థం కాలేదు.రెండూ చాకిరీ తప్పనివే.నేను వాళ్లింటికి వెళ్లాలంటే అప్పుడు గుడికి శివాలయానికి ఎదురుగా ఉన్నచిన్న ద్వారం గుండా వెళ్లాల్సి వచ్చేది. ఎన్ని సార్లు ఆ ద్వారం దాటానో అన్ని సార్లు అనుకున్నాను.ఈ ద్వారం మారితే బాగుండునని.దానికి కారణం ఆ ద్వారం మధ్యలో రాతి దూలం అడ్డంగా ఉండేది.పెద్దవాళ్లు ఆ దూలం దాటి లోపలికి వెళితే చిన్న వాళ్లు దాని కిందినుండి ఈగి వెళ్లే వాళ్లు.అది జంతువులు లోపలికి ప్రవేశించ కుండీ ఏర్పాటనే విషయం కూడా ఈ మట్టిబుర్రకు తట్టడానికిచాలా కాలమే పట్టింది.సరే నా అదృష్టం కొద్దీ అష్టగ్రహకూటమి సందర్భంగా రామాలయానికి ఎదురుగా ఇప్పుడున్న గేటు కట్టారు పాత ద్వారం అలాగే ఉంచి.సరే ఇక రామాలయంలో యశోదమ్మ గానీ పురుషోత్తమాచారిగానీ గర్భగుడికి ముందు ఉన్న గదిలోని మూరెడెత్తు పంచలోహ రామలక్ష్మణ ఉత్సవ విగ్రహాలకే పూజచేయడం చూశాను. గర్భగుడిలో చిన్న ప్రమిద వెలుగులో అరుగు మీద రాతి విగ్రహాలు కనిపించేవి కాని అవి ఏ విగ్రహాలనేది తెలిసేది కాదు.అరవై ఏళ్ల తరువాత గాని వాటి ఆరా తీయడం మొదలుకాలేదు. ఇప్పుడు గుడి ఉంది కానీ పూజారు లేరు.ఉత్సవ విగ్రహాలు లేవు .కేవలం గర్భగుడిలోని మూల విరాట్టులు తప్ప.ఎడమ తొడమీద లక్ష్మీ దేవిని కూచోబెట్టుకున్న విష్ణువు విగ్రహాలు ఒకటి పెద్దది,ఒకటి చిన్నది ఉన్నాయి. హరగోపాలన్న చెప్పేదాకా అవి వామాంక స్థిత సీతాసహిత రామచంద్రుని విగ్రహాలనుకున్నాను రామాలయం కదా !అందుకని.అలాఅజ్ఞానంతో ఫేస్బుక్ పోస్టింగు కూడాపెట్టినట్టున్నాను. నిజం నిలకడమీదతెలుస్తుందన్నట్టు ఆయన పుణ్యమాఅని ఆ విగ్రహాల సంగతి తెలిసింది.దానితో పాటు అన్న మరో కొత్త విషయం చెప్పారు.అవన్నీ మధ్వసంప్రదా యానికి సంబంధించినవి.ఆ మాట చెప్పిన తరువాత నేను ఒక్కసారి నా చిన్న తనంలో నాకు తెలిసిన బ్రాహ్మ ణులందరినీ తలుచుకున్నాను. అప్పట్లో గుడికి ఎడమ పక్క అంతా బ్రాహ్మల ఇళ్లే.మధ్య మధ్యలో కొన్ని ఇతరులవి ఉన్నా అవి కూడా వారికి అన్యాపదేశంగా సంబంధంఉన్న ఇళ్లే. నాకు తెలిసి కరణాలవి రెండు ఇండ్లు వాళ్ల ఇంటిపేరు కస్బా లేదా కసుబ.వాళ్లు మధ్వ సంప్రదాయంకలవారు. ఉడుతల వెంకట్రామయ్యతాతవాళ్లు మధ్వలే. మా బాపమ్మ ఉడతల వారింటి ఆడపడుచు.కాసర్ల మురహరి వాళ్లు మధ్వలే. మూగు ఆగయ్య వాళ్లు మాధ్వులే. అల్లాడి హరిరామయ్య,పీతాంబరం ఇద్దరూ అన్నదమ్ములు.వాళ్లను భాగవత సంప్రదాయులనే వాళ్లు. అదే సాత్వతమనేది హరగోపాల అన్న ద్వారా తెలిసింది. ఇక మేము వైదికులము మా తాత తుమ్మూరి మురహరి జోషి అప్పట్లో పరగణా మొత్తానికి అపరకర్మలు చేయించటంలో పేరుమోసిన వ్యక్తి. ఆయన సవ్యసాచి వివాహాది శుభ కార్యాలు కూడా చేయించేవారు.అప్పట్లో ఊళ్లో ఆయనొక్కరే వేద పండితుడు.అందుకే ఆయన ఎప్పుడూ ఏదో ఓ ఊరికి వెళ్తండేవారు.మా ఇంటి ఎదురుగాచెరకు మురళయ్యగారు వల్లంపట్ల నుంచి ఇల్లింటం(ఇల్లరికం) వచ్చారు.వాళ్లు వైదికులే.మా బాపు చెప్పిన ప్రకారం మేం స్థానికులం కాదు.మాకు మూలపురుషుడు తుమ్మూరి శంకరభట్టు పదితరాల కింద ఇక్కడికి వచ్చారు. తరువాత గూగుల్ లో చూస్తే గోదావరికి ఈశాన్యంలో రంపచోడవరం దగ్గర తుమ్మూరు ఉన్నది. బతుకు దెరువు కోసం అప్పుడైనా ఇప్పుడైనా వలసలు తప్పవు. ఇంతకీ నేను గమనించిన విషయం ఏమిటంటేఎలగందులలో ఒకప్పుడు మధ్వ సంప్రదాయం బాగా ప్రచలితంలో ఉండేదని. రామాలయం ప్రక్కనే శివాలయం కూడా ఉన్నది కాని దానిని అప్పుడూ పట్టించు కోలేదు ఎవరూ.శివాలయం ఎప్పటిదో కాని అందులో నంది విగ్రహం ఎంత అందంగా ఉంటుందో చెప్పలేను.ఎప్పుడైనా పూజచెయ్యా ల్సివస్తే మా ఇంటివారే ఎందుకు చేశారో అప్పటి అభంశుభం తెలియని రాంబాబుకు అర్థమయ్యేది కాదు. కానయితే ఊళ్లో బ్రాహ్మల మధ్య ఎలాంటి పొరపొచ్చాలుండేవి కావు. ఇచ్చిపుచ్చుకోవడాలు మిగతావి అన్నీ మామూలే.సందర్భం వచ్చింది గనుక తాత గురించి రెండు మాటలు. నాకు పదమూడేళ్లు వచ్చే దాకా ఆయన బతికి ఉన్నారు.నియమ నిష్ఠలకుపెట్టింది పేరు.ఆయన ఊళ్లో ఉంటే మసీదులో అజాకంటే (ఉదయం నాలుగు గంటల ప్రాంతం) ముందేలేచిచలికాలంలో కూడా బావిదగ్గర చన్నీళ్ల స్నానం చేసి మడిగట్టుకుని పూజకు కూచుంటే,ముందు శైవ పూజ.అప్పుడు అడ్డంగా విబూది పూసుకుని వంటింట్లో పడమటి గోడకు ఉన్న దేవుని గూటి ముందు గద్దె పీటమీద కూర్చుని పూజ చేసేవారు.అది దాదాపు రెండు మూడు గంటలు సాగేది. ఆ తరువాత దస్తీ వంటి సైను గుడ్డ (ముఖవస్త్రం) ముఖం మీద వేసుకుని జపం చేసేవారు. ఆ తరు వాత విబూది తుడుచుకుని అరటి పువ్వు తో చేసిన నిలువు బొట్టు ఆంగ్లఅక్షరం U ఆకారపు బొట్టు పెట్టుకుని వైష్ణవం చేసేవారు.చివరకు సాలిగ్రామ ప జ ఉండేది.ఆయన తెల్లవారి దేవుని పూజకోసం సాయంత్రం సమయంలో మసీదు లోకి వెళ్లి మసీదు తలుపు తెరిచి మసీదలో ఉన్న నందివర్ధనం పూలు కెంపుకు రావడానికి నేను ఆయనతో చాలసార్లు వెళ్లాను.నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం.ఇంతటి నిష్ఠాపరుడు నిస్సంకోచంగా మసీదులో పలికి వెళ్లి పూలు తెంపుకు వచ్చాడే ఎంత సంయమనం. ఎప్పుడైనా మహమ్మదీయు లెవరైనా ఉన్నా వారు ఎంతో వినయంగా ఆదాబ్ చెయ్యడం నా చిన్న హృదయం మీద పెద్ద ముద్ర. మా ఊరి హిందూ ముస్లిముల మైత్రీ భావం గురించి తరువాత వివరంగా చెబుతాను.సాయంత్రంపూట ఆయన చేసే మరోపని ఇంట్లో ఉన్న ఎక్కాలు, కందిళ్లు అన్ని శుభ్రం చేసి బూడిదతో బుగ్గలు తుడిచి అన్నింటిలో గ్యాసునూనె (కిరోసిన్) నింపేది.ఆయన ఊళ్లో ఉంటే మాత్రంఅది ఆయనదే డ్యూటీ. ఎప్పుడైనా బండిలో మైలారం పోతే తోవలోచూచేచోలా అశ్విని,లీలూలేలో భరణి చెప్పేవారు, డెబ్భయ్యారేళ్ల వయసు లో బాపు ఆవు పాలు పిండుతుంటే తాత ల్యాగదూడను పట్టుకునే వారు. ఒకసారి అది చెంగున ఎగిరితే పట్టుదప్పి పడిపోయారు. కాలువిరిగింది.కరీంనగర్ సర్కారు దవాఖానాలో నెలరోజులు బెడ్ మీదఉన్నారు.నా అదృష్టం కొద్దీ ఆయ నకు సేవ చేయడానికి నన్ను ఆయన దగ్గర ఉంచారు.ఆయనకు సకలోప చారాలు చేసి మా చిన్నత్త వాళ్లింటినుంచి తెచ్చిన తిండి తినిపించ వాణ్ని. స్నానం చేయడానికి వీలు లేదు కనుక ఒళ్లంతా తడిబట్టతో తుడిచేవాణ్ని.తరువాత విబూది రాచే వాణ్ని.అది భస్మ స్నానం అని నాకు అప్పుడు తెలియదు. తరువాత మానసిక సంధ్యావందనం చేసుకునే వారు.అది ఆయన నాకు ఇచ్చిన వరతుల్య స్మృతి. నాకోసం ముత్యాల వంటి అక్షరాలతో సంధ్యా వందనం రాసిపెట్టారు. నా వడుగు వరకు ఆయన బతికి లేకపోయినా ఆయన రాసిపెట్టిన ఆ కుట్టిన కమ్మల పుస్తకం నాకు ఒక అమూల్య కానుక. మురారి అంటేముక్కోపి అనేవారు కాని నాకు మాత్రంమధ్యాహ్నం పూట మహాభక్త విజయం చదివే ఆధ్యాత్మిక చింతనుడు.ఇప్పటికీ నాపెదవులను వీడని సంధ్యావందన మంత్రాలన్నీ ఆయన భిక్షే,”ఓమిత్యేకాక్షరం బ్రహ్మా”- రామ్మోహన్ రావు తుమ్మూరి


కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం