పులి - గోవు :--- కడుపునిండా పాలిచ్చి, లాలించి, ఆడించి.. ఒడిలోనే నిద్రపుచ్చాల్సిన నెలల బిడ్డ ఒకరు.., వెన్నెల్లో గోరుముద్దలు తినిపించి.. కథ చెప్పిందే నిదరోని మరో రెండేళ్ళ బిడ్డ మరొకరు..! వారిని వదలి, కరోనా సోకిన వ్యాధి గ్రస్తులనే.. బిడ్డలుగా భావించి, సేవ చేయాల్సిన స్థితి..! .బాగా ప్రాచుర్యమున్న ఓ కథలో లాగా.. బిడ్డకు పాలిచ్చి వచ్చి, నీకు ఆహారాన్నవుతానని పులిని ఓ గోవు బ్రతిమలాడుకున్నట్లుగా.. ఇంటికి వెళ్లి రావడానికి, కరోనా పేషెంట్లకు చెప్పి వెళ్లాల్సొస్తోంది.. కొందరి డాక్టర్ల, నర్సుల పరిస్థితి. .గద్ద బారినుంచి కాపాడుకోవడానికి.. కోడి పెట్ట తన పిల్లలను రెక్కలకింద దాచుకొంటుంది. కానీ, కరోనా బారిన పడకుండా తన పిల్లలను.. కాపాడుకుందామంటే, రెక్కలు తెగిన పక్షి పరిస్థితి.. ఆసుపత్రి సిబ్బందిది..! .వీరిప్పుడు ఇంటికి వచ్చి వెళ్లే సమయంలో.. పిల్లల్ని కళ్లతోనే సంభాషించాల్సొస్తోంది..! మాతో ఎప్పుడు గడుపుతావని పిల్లలడిగితే వీరి దగ్గర ఏం సమాధానముంటుందని..? వీరి భవిష్యత్తు.. వీరు సేవ చేస్తున్న కరోనా పేషెంట్లు కోలుకునేదాన్ని బట్టీ ఉంటుంది..! ఎలాగంటే, మాటిచ్చినట్లుగా ఇంటికి వెళ్లొచ్చి తన ఎదురుగా నిల్చొన్న గోవుపై.. పులికున్న దయలాగా..! .గతంలో ఓ కవి చెప్పినట్లు.. వేటగాడు ఇంటికి పరిమితమైతేనే.. ఆకాశంలో పావురాల విన్యాసం చూడగలం..! అలాగే, మనందరం ఇంటికి పరిమితమైనప్పుడే.. గడపటి ప్రపంచాన్ని చూడగలం..!- శ్రీ రమణీయం


కామెంట్‌లు