నేలతో నా అనుబంధం. నాట్లు,కలుపులు,ఎరువులు (యూరియా)ఇవి మనం చేసే పని.పైరు పెరగటం అన్నది ప్రకృతి పని నారు మడి నుంచి ,నాటిన పైరు నిలబడి లేత పచ్చనుంచి క్రమంగా రంగు మారి ముదురు ఆకుపచ్చగా మారటం.రోజూ పొలం వెళ్లి చూసినా సరే రోజుకో రకంగా కనపడేది అదేమిటో.పొట్టమీదకి వచ్చిన పైరు పాల కంకి వెళ్ళినప్పటి నుంచి రైతు కళ్ళలో మెరుపు వస్తుంది. మా బుల్లెయ్య నువ్వెందుకు రాణెమ్మా ! బురదలో పెద్ద గనెం మీద కూర్చో అన్నా సరే లోపలి గట్ల మీద పొలం అంతా తిరిగేదాన్ని.మా కొత్త రైతు(మొగలి పూల) యమాహుషారుగా తన నాలుగు ఎకరాల పని అందరి కంటే ముందు ముందు చేసుకుని.మిగిలిన వాళ్ళకి సాయం వచ్చేవాడు.అందరికీ తలలో నాలికలా అయ్యాడు.నరసరావుపేట మా ఇంటికి వచ్చి ఆ ఏటికి వడ్ల పురి (గడ్డిఎంట్ల తో చేసే గాదె) తనే కట్టి పెట్టాడు. ఆ ఏడు కాలం కూడా బాగా అయి పంట కూడా బాగా పండింది.వెంకటరత్నం అని ఇంకో రైతు మొదట తన కుప్ప నూర్చాడు.అతను చేసే పొలం ఎకరం కనుక కుప్పనూర్చటం,తూరిపార పట్టటం, వడ్లు గోతాలకి ఎత్తడం ,కాటా వేయటం ,మా వంతు ఇంత అని నిర్ణయించడం అన్నీ సాయంత్రానికి అయిపోయాయి. మరునాడు మా మొగలితోపు రైతు వంతు రెండు కుప్పలుగా వెయ్యమంటే వినకుండా మొత్తం నాలుగెకరాలకి ఒకటే వరికుప్ప వేసాడు.సాయంత్రం వరకు కొట్టడమే సరిపోయింది.గాలి ఆగిపోయి తూర్పారపట్టటం అవ్వలేదు.బుల్లెయ్య మొత్తం వడ్ల కుప్ప మీద పెద్ద పట్టా కప్పించి.నన్ను,అమ్మమ్మని ఇంటికి వెళ్లమన్నాడు.తనుకూడా ఇంటికి వెళ్లి పెండలాడే అన్నం తిని వచ్చి చేలో పడుకుంటాను అని చెప్పి.సైకిల్ వేసుకుని ఊళ్ళోకి వెళ్ళాడు. మా మొగలితోపు రైతు రోడ్డు వరకూ వచ్చి నన్ను,అమ్మమ్మని బస్ ఎక్కించాడు.బస్ మా పొలం దాటి రూపెనగుంట్ల ఊళ్ళో కి వెళుతుంది.ఊళ్ళో స్టాప్ రాగానే నేను గబుక్కున బస్ దిగేశాను.వెనక్కి గబ గబా పొలం కేసి నడిచాను పరిగెత్తినట్లుగా.అమ్మమ్మా నేను ఎందుకు దిగానో అర్థం కాక తానూ కాస్త ముందుకు వెళ్లిన బస్ ఆపించుకుని దిగి నా వెనుక వస్తోంది. నేను ఇవేమీ గమనించే స్థితిలో లేను మా మొగలితోపు రైతు మమ్మల్ని బస్ ఎక్కించే టప్పుడు నవ్విన నవ్వే నాకు గుర్తుకు వస్తోంది.రోడ్డుదిగి పొలంలో కుప్ప దగ్గరికి వెళ్లి చూస్తే .అర్ధ చంద్రాకారంగా కుప్పనూర్చి వేసిన గడ్డి ,మధ్యలో వడ్లమీద మా బుల్లెయ్య కప్పించిన పట్ట తొలగించి బంగారు రంగులో వడ్ల కుప్ప.మా మొగలిరైతు,మరో ఇద్దరు మనుషులుగబగబా గోతాల్లోకి వడ్లు ఎక్కిస్తూ. ఒక్క క్షణం ఆవేశం,కోపం,కసి కలిగాయి , కానీ చాలా నిబ్బరంగా నిలబడి మొత్తం ఎన్ని గోతాలు ? అని మాత్రం అడిగా.అంతే అతను రాణెమ్మా అని తడబడ్డాడు.ఈలోగా అమ్మమ్మా,బుల్లెయ్య కూడా వచ్చారు.నా గంభీరమైన మొఖం చూసి అమ్మమ్మ కూడా ఏమీ మాట్లాడలేదు.చూసుకో బుల్లెయ్యా అని అమ్మమ్మ చేయి పట్టుకుని నేను రోడ్డు ఎక్కాను. నా నేల నాకు నేర్పిన మొదటి పాఠం క్షమ,ఉపేక్షించటం. -వసుధ రాణి


కామెంట్‌లు