నువ్వే సర్వం మాకు--పాండవులు, కౌరవుల మధ్య జరగబోయే కురుక్షేత్ర యుద్ధంకోసం సన్నాహాలు జరుగుతున్నాయి కురుక్షేత్రంలో ఏనుగులతో భారీ వృక్షాలను వేళ్ళతోసహా నేలకూల్చి చదును చేస్తున్న వేళ.ఓ చెట్టుపై ఓ తల్లి పిచ్చుక తన నాలుగు పిల్లలతో నివసిస్తోంది. ఆ చెట్టును కూలుస్తున్న సమయంలో ఎగరడం చేతకాని తన పిల్లలతో సహా తల్లిపక్షీ నేలమీద పడిపోయింది.తల్లి పక్షి అటూ ఇటూ చూసింది. కాస్తంత దూరంలో కృష్ణార్జునులు కనిపించారు.తల్లి పక్షి ఎగురుకుంటూ పోయి కృష్ణుడి రథంమీద వాలింది. "కృష్ణా! రేపు యుద్ధం ప్రారంభమవుతే నా పిల్లలతోపాటు నేనూ చనిపోతాను. కనుక నువ్వే మమ్మల్ని కాపాడాలి" అని తల్లిపక్షి కోరింది. "నీ మొర నాకు వినిపిస్తోంది. కానీ ప్రకృతి విధులకు భిన్నంగా నేనేమీ చెయ్యలేను. యుద్ధాన్ని ఆపలేను" అంంటాడు కృష్ణుడు. "నాకు తెలిసిందల్లా నువ్వు మాత్రమే. మమ్మల్ని కాపాడు. మమ్మల్ని రక్షించడమో లేక నాశం చేయడం నీ చేతుల్లో పెడుతున్నాను. ఆపై నీ ఇష్టం" అన్నాది తల్లిపక్షి. కాలచక్రం గిర్రున తిరుగుతోంది. కృష్ణుడు చెప్పిన సమాధానం ఇదొక్కటే.తల్లిపక్షికీ, కృష్ణుడికీ మధ్య జరిగిన సంభాషణ అర్జునుడికి అర్థం కాలేదు.యుద్ధానికి ముందర కృష్ణుడు అర్జునుడితో తన విల్లంబులను ఒక్కమారు ఇమ్మన్నాడు. అర్జునుడికి ఆశ్చర్యమేసింది.యుద్ధంలో ఆయుధాలు ముట్టనని చెప్పి తనకు రథసారథిగా మారిన కృష్ణుడు దేనికోసం విల్లంబులు అడిగాడో అర్థం కాలేదు అర్జునుడికి.అయినా అడిగాడు కదాని అర్జునుడు వాటిని కృష్ణుడికి ఇచ్చాడు.కృష్ణుడు ఓ ఏనుగు మెడలో ఉన్న ఓ గంటపై బాణాన్ని సంధించి దానిని తెంపి దూరంగా విసిరాడు. విషయం అర్థంకాని అర్జునుడు ఏనుగుని నేలకూల్చలేకపోయాడే అని మనసులో అనుకుని కృష్ణుణ్ణి చూసి ఒకింత హేళనగా నవ్వాడు.కృష్ణుడికన్నా తానే విలువిద్యలో అన్ని విధాల సమర్థుడినని మనసులో గర్వపడ్డాడు అర్జునుడు.అర్జునుడు మనిషేగా."నేను కావాలంటే బాణం సంధించి ఏనుగుని నేలకూల్చనా" అని అడిగాడు అర్జునుడు.కృష్ణుడు ఓ చిన్న నవ్వు నవ్వి విల్లంబులను అర్జునుడికిచ్చి రథంలో పదిలంగా ఉంచు అన్నాడు."మరెందుకు ఏనుగుమీద బాణం ఎక్కుపెట్టావు?" అని అడిగాడు అర్జునుడు."అమాయకులైన పక్షుల గూటిని చెదరగొట్టిన ఏనుగుకి ఇదొక శిక్ష" అని మాత్రం చెప్పాడు కృష్ణుడు. అర్జునుడికి ఒక్కముక్కా అర్థంకాలేదు. యుద్ధం జరిగింది. పద్దెనిమిదో రోజు పాండవులు గెలిచారు.అర్జునుడితో పరంధాముడు యుద్ధరంగమంతటా చుట్టి వచ్చాడు! తాను పూర్వం విసిరేసిన గంట దగ్గరకొచ్చి నిల్చున్నాడు కృష్ణుడు."అర్జునా! ఈ గంటను తీయి" అన్నాడు కృష్ణుడు."ఎన్నో ముఖ్యమైన పనులుండగా తెగి కింద పడిపోయి ఉన్న ఈ గంటే కృష్ణుడికి ప్రధానంగా కనిపిస్తోందా?" అని అనుకుని అర్జునుడు చెప్పినట్లే ఆ గంటను తీశాడు. అప్పుడు ఆ గంట కింద ఉన్న తల్లి పక్షితోపాటు మిగిలిన నాలుగు పిట్టలూ రెక్కలు విదిల్చి సంతోషంగా ఎగిరాయి.తల్లిపక్షి కృష్ణుడి చుట్టూ ప్రదక్షిణం చేసి తమను ఓ గంట పదిలంగా కింద ఉంచి పద్దెనిమిది రోజుల యుద్ధంలో తమ ప్రాణాలు కాపాడినందుకు కృతజ్ఞతలు చెప్పుకుంది."భగవాన్! నన్ను మన్నించు. నిన్ను మానవరూపంలో మాత్రమే చూసిన నాకు నువ్వు నిజంగా ఎవరన్నది నా చిట్టిబుర్ర తెలుసుకోలేక పోయింది" అన్నాడు అర్జునుడు.పుట్టిన ప్రతి ప్రాణిని ఎప్పుడు ఎలా రక్షించాలో పరమాత్మకు బాగా తెలుసు.కనుక భగవంతుడే శరణు శరణు. మిగిలినదంతా అతనికే విడిచిపెట్టాలి. అప్పుడతనే చూసుకుంటాడు బాగోగులన్నీ.(తమిళంలో ఓ ప్రవచనకర్త చెప్పగా విని రాశానిది)- యామిజాల జగదీశ్


కామెంట్‌లు