మానేరు ముచ్చట్లు---62 లోనో 63 లోనో పెద్దబడి పునరుద్ధరణకోసం నిధిసేకరణ ప్రయత్నం జరిగినట్లుంది.నేనప్పటికి పదేళ్ల వాణ్ని.నాకు గుర్తున్నదల్లా హరిశ్చంద్ర టికెట్ షో ఏర్పాటు చేయడం.నైజాం కాలంలో కట్టిన పాత బిల్డింగులోని గదులు సరిపోక కొత్త గదులు నిర్మించాల్సిన అవసరం చాలా ఉండింది.అప్పట్లో చుట్టుపట్ల పది ఊర్లకు అదొక్కటే ఉన్నత పాఠశాల.దాదాపు అన్ని తరగతులు ఎ,బి సెక్షన్లుండేవి.ఉన్నవి ఆరు పెద్ద గదులు,రెండు చిన్న గదులు. అందు లో ఒకటి ప్రధానోపాధ్యాయుని గది, ఒకటి స్టాఫ్ రూం,ఒకటి క్రాఫ్ట్ రూం,ఒకటి,స్కౌట్,క్రీడా సామానుల గది పోగా నాలుగు మాత్రమే తరగతి గదులగా ఉండేవి.మిగతా తరగతు లకు ప్రాంగణంలోనే తాటికమ్మల గుడిసెలుండేవి.అప్పటి విద్యా వ్యవస్థ సంగతి నాకు తెలియదుగాని, పార్థసారథిగారు వస్తూనే సమస్యను గమనించి కొత్త గదుల నిర్మాణానికి ఊరి పెద్దలను సంప్రదించి నిధి సేకరణ ప్రయత్నం చేశారు.అదిగో అలా స్కూలు పిల్లలతో హరిశ్చంద్ర నాటకం వేయించి కొంత మొత్తం జమచేయడానికి నిర్ణయం జరిగింది. నాటకం బాధ్యత బాపుపై మరి కొందరు ఉపాధ్యాయుల పై పడింది. దర్శకులు బాపునే.పది పదకొండు తరగతుల విద్యార్థులను ఎంపిక చేశారు.మొత్తానికి నటీనటుల ఎంపిక జరిగి దాదాపు రెండుమూడు నెలలు రిహార్సల్స్ చేశారు.రిహార్సల్స్ జరిగినన్ని రోజులు సాయంత్రం బాపు చిటికెన వేలు నా గుప్పిట్లో.విశ్వామిత్రు డు హరిశ్చంద్రునితో ఎలాగైనా అబద్ధం ఆడిస్తానని దేవేంద్రుని సభలో ప్రతిజ్ఞ చేసే సన్నివేశం లో “హిమశైలంబున వాయుభక్షకుడినై “ అనే పద్యం మొదలు గుర్తుంది. నేనప్పటికింకా పెద్ద బడిలో చేరలేదు కాని నాకో బుల్లి హోదా ‘సారు కొడుకు’. చిన్నబడి,పెద్దబడి ‘నామ్ కే వాస్తే’బాపు పెద్ద బళ్ల ఉంటే పెద్ద బళ్ల.చిన్నబళ్ల ఉంటే చిన్నబళ్ల. అందుకే నా బాల్యంలో మిత్రుల కంటే ఎక్కువ సార్లతోనే గడిచేది,వాళ్ల ముచ్చట్లతోనే కడుపు నిండేది. నాటకానికి సంగీతం కోసం రామడుగు లో సంగీత విద్వాంసులు,హరి కథకులు కిష్టయ్యగారిని పిలిపించారు అప్పుడాయన ఎందుకో గాని గడ్డం పెంచుకుని ఉన్నారు అచ్చు భీష్మసిని మాలో ఎన్.టీ.ఆర్.లాగా.మంచి హార్మోనిస్టు.తబలా సింహాద్రి స్థానిక రామాలయం పూజారి పురుషో త్తమాచారి కొడుకు.బాపుకు ప్రియ శిష్యుడు.ఖవాలీ బాగా ప్రదర్శించే వాడు.బాపు మొదట్నుంచి శిష్యగత ప్రాణి.బాపు ఎక్కడ ఉంటే అక్కడ సందడి ఆనందాల పందిరయ్యేది. మొత్తానికి హరిశ్చంద్ర నాటకం బ్రహ్మండగా ప్రదర్శించారు.టికెట్ సేల్ కోసం బయటినుంచి మయసభ దుర్యోధన ఏకపాత్ర వేసే ఆయనను పిలిపించారు.అప్పుడు మా రెండో తమ్ముడు చాలా చిన్నవాడు. దుర్యోధనుని డైలాగ్ ‘ఆ స్తంభము వద్దనున్నదెవరు.పాంచాలియా.పాంచాలీ పంచభర్తృకా ‘అని నాటకం తరువాత చాలా రోజులు ముద్దు ముద్దుగా అంటుంటే మళ్లీ మళ్లీ అనిపించటం.ఇప్పటికీ గుర్తు చేసుకుంటాం.కాలకౌశికుడు కలహకంఠి దంపతుల యుగళగీతం “ముక్కుజూడు ముక్కందం జూడు ముక్కున ఉన్నా ముక్కెర జూడా మొగుడా నే మునపటి వలెనే ఉన్నానా” యమ హిట్టు. అలాగే వీరబాహుడి పాట “చిన్నకత్తి నాదేనయా చిందేయు వీరబాహు నేనేనయా “ అది కూడా బాగా పేలింది.అలా బాల్యంలో నా నాటక జీవితానికి పునాది వంటిది సత్య హరిశ్చంద్ర నాటకం.ఆనాటి సాయంత్రపు నాటకం హడావుడి యాభయ్యెనిమిదేళ్లు గడచినా ఇప్పటికీ కళ్లముందు కదలాడుతుంద నేది నిజం. ******** సోషల్ వర్క్ అనేది మాకు పార్థసారథి సారు వల్లనే తెలిసింది,అలవడింది కూడా.ఇప్పుడు మీరు స్వచ్ఛ భారత్ వింటున్నారు కాని మేము యాభయి ఏళ్ల క్రితమే ఆచరించాం.అట్లా ఇట్లా కాదు.ఆరు తరగది గదులనిర్మాణానికి ఇటుకలు మోసి,సున్నం డంగు కొట్టి కేవలం మేస్త్రీల ఖర్చు తప్ప మిగతా కూలీ పని మేమే చేశాం.ఒక్కో క్లాసు ఒక్కో పీరియడు.దాదాపు ఏడాది పాటు సాగింది ఆపని.మరుగుదొడ్లు మేమే కట్టుకున్నాం.మా గ్రౌండ్స్ అన్నీ మేమే చదును చేసుకున్నాం.ఏభై ఏళ్ల కింద మేం నిర్మించిన డ్రామా స్టేజి ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది.ఓపిక ఉంటే నిన్నటి ఫోటోలో చూడవచ్చు. బాస్కెట్ బాల్ గ్రౌండ్ చదును చేయడానికి రోలర్ లాగాం.అది స్టేజ్ ముందే ఉంది.నాటకాలు చూడటానికి అదే ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం.జవాహర్ లాల్ నెహ్రూ మరణించినప్పుడు ఆయన స్మారకచిహ్నంగా ఇల్లెత్తు మట్టి దిబ్బ శంకువు ఆకారంలో నిర్మించి దానిపై ఒక పోల్ పాతించి పోల్ చివర గాలిగిరక పెట్టించారు.దానిపైన స్థానిక సంగీతకారుని ఆహ్వానించి ఆయనచే గీతాలు పాడించారు.స్కూల్లో పర్ఫెక్ట్ పబ్లిక్ అడ్రస్ సిస్టం ఉండేది ఆ రోజుల్లోనే.నాకు బాగా గుర్తు.స్కూలు గంట చాలా చిన్నగా ఉండేది.బడి ఊరవతల ఉండేది.దాదాపు కిలోమీటరు దూరందాకా ఊరు విస్తరించి ఉండటం వల్ల గంట శబ్దం వినిపించకపోయేది. అప్పట్లో కాలికి చెప్పులే లేని పరిస్థితులు కనుక గడియారాలుండే ప్రసక్తే లేదు. పిల్లలు ఆలస్యంగా రావటం ఆయనకు ఇష్టముండేది కాదు. అందుకే ఊరంతా బడిగంట వినిపించేటట్లు దాదాపు పెద్దకంచమంత కంచుగంట కంచరి వాళ్లింట్లో చేయించారు.ఆ పని బాపు కప్పజెప్పారు.ఆయనెక్కడుణటే నేనక్కడ గనుక అది తయారయ్యే అన్ని దశలూ నాకు బాగా గుర్తున్నాయి.అది వచ్చిన తరువాత మా అంకూస్ మియా చెక్క సుత్తెతో బెల్ కొడితే ఊరి చివరి ఇండ్ల వరకూ వినిపించేది.ఊరంతా తరిగి వినిపిస్తుందో లేదోనని తణిఖీ చేసి వచ్చారు.ఎందుకంటే బెల్ వినపించ లేదనే సాకు చెప్పటానికి వీలు లేకుండా. ఆలస్యంగా వచ్చిన వారు ఒక పీరియడం తా సోషల్ వర్క్ చేయాల్సిందే.ప్రగతి విషయంలో ఎంత పట్టుదలో తప్పు చేస్తే శిక్షించటంలో అంత కఠినం కూడా. ప్రతిరోజూ ఫస్ట్ బెల్ కంటే ముందు రికార్డ్ ప్లేయర్లో పాటలు వేసేవారు.అది మా సైన్స్ సార్ డ్యూటీ.ఆయన వచ్చిన తరువాతే స్కూల్ వార్షిక సంచిక వాసంతి వెలువడింది.సంపాదక వర్గంలో ఒకరైన బాపు తొలి సంచికలో రాసిన ఓ కంద పద్యం నాకిప్పటికీ యాదికున్నది. క.వాసంతి యనెడు పేరుతొ భాసిల్లగ బాలకవుల భావపు లతలన్ బూసిన బూవుల కమ్మని వాసనలతొ ఛాత్రగణము వాసిన్ గాంచన్ మా ఊరి ప్రసిద్ధకవి అనువాదకులు శ్రీ నాగరాజు రామస్వామి గారు కొంతకాలం ఉపాధ్యాయునిగా పనిచేశారు ఆ సమయంలో.రెండవ అట్టమీద ఆయన కవిత ప్రత్యేకంగా ముద్రించిన విషయం నాకింకా మతికున్నది.అప్పుడు నా వయసు పదకొండు.ఆయన కవిత్వం అర్థం చేసుకోలేని పసితనం.ఆయన సోదరుడు మరో ప్రసద్ధకవి ‘ఎలనాగ’అప్పట్లో ప్రతి ఫంక్షన్ లో పాటలు పాడేవారు.ఆయన తరచుగా పాడే నీలిమేఘాలలలో ఇప్పటికీ నాచెవుల్లో వినిపిస్తూ ఉంటుంది.ఆయన కాలంలో బళ్లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ ఇన్నీకావు.వ్యాసరచన,వక్తృత్వపోటీలు,పెద్ద చెరువులో ఈతల పోటీలు,డ్రాయింగ్ పోటీలు, స్కౌట్& గైడ్స్,అన్ని రకాల ఆటల పోటీలు జరిగేవి. ప్రత్యేకంగా బుర్రకథలు,నృత్యాలు,నాటికలుఛబ్బీస్ జనవరికి,పంద్రాగస్టుకు ఉండేవి.ఎవరిని ఎలా ఉపయోగించుకోవాలో పార్థసారథి సారు గారికి బాగా తెలుసు.ఏ ఉపాధ్యాయుడు చిన్న బుచ్చుకోకుండా అతడు చేయగలపనిని పసిగట్టి పని అప్పగించేవారు. సైన్సుకు సంబంధించిన పని లక్ష్మిరాజం సారుకు,వ్యాసరచన,వక్తృత్వపోటీలు మొదలైన వాటిని తెలుగు పండితులు రాంమూర్తి సారుకు,మేకప్,పరదాలు గీయటం వంటి వాటిని చిత్రకారులైన ఐలయ్యసారుకు వాళ్ల వాళ్ల అభిరుచుల మేరకు బాధ్యత అప్పగించేవారు.నాగరాజు రామస్వామిగారు పనిచేసిన ఏడాది కాలంలో ఆయనను సభానిర్వహణ కార్యక్రమానికి వినియోగించు కోవటం,అలాగే కొత్త ఆట బాస్కెట్ బాల్ గురించి పిల్లలకు తెలియజేయడానికి,దాని ఏర్పాటులో ఆయన సహకారం తీసుకోవడం ఇలా ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే.అలాగని పాఠ్యాంశాల బోధనలో తక్కువా అంటే కాదు.దేనికదే.నా సహాధ్యాయి టి.వెంకట రాములు చాలా నాటికల్లో హీరోగా వేసారు.”అరిగర్భ బర్బరాయుత హృదగ్నికార్జియోత్సర్జన జేసి”అంటూ ఆయన చేసిన ఏకపాత్ర బహుశః,రావణబ్రహ్మ అనుకుంటాను నాకు గుర్తున్నంతవరకు.ఇంకానేను,విజయరావు,రాజమౌళి,వెంకట నర్సయ్య ,ఉమాశంకర్,ప్రకాశ్ రావు, మొదలైన మిత్రులుకూడా చిన్న చిన్న పాత్రలు వేశాం. మాకంటే సీనియర్లతో బాపు చాలా నాటికలు వేసించారు.లవకుశ ఆయన దర్శకత్వంలో రెండుమూడు సార్లు వేరు వేరు నటులతో ప్రదర్శించబడింది.మొదటి సారి వేసినప్పుడు శ్రీరాముడిగా బాల్ కిషన్ రావు,లవకుశులుగా రాజేశ్వరశర్మ,నాగయ్యాచారి అని గుర్తు.తరువాత వేసినప్పుడు తమ్ముడు విజయభాస్కర్,నాగరాజు రవీందర్ లవకుశులు వేసినట్టున్నారు.నేను లేను అప్పుడు. ఒకసారి జిల్లా స్థాయి నాటక పోటీలకు మధుసేవ నాటిక తీసుకు వెళితే దానికి ప్రథమ బహుమతి లభించింది.అందులో బాల కిషన్రావు, బందె అలి,నంబులాద్రి,వెంకట్రాములు, బావుపేట రాజమౌళి,వీరయ్య నటించారు.స్కూల్లో కూడా వేశారు.దశావతారాలు నృత్యం ఆడపిల్లలతో చేయించారు.ఖవాలీలు చేయించారు.తుపాకిరాముడు,వంటి హాస్య ఏకపాత్రలు ఆయన కళా దార్శనికతకు మచ్చు తునకలు. ఆ తరువాత బాలప్రసాద్ సారు వచ్చారు.వారు మంచి నటులు అచ్చం ఎన్టీయార్ లాగా ఉండే వారు.ఆయన మాతో త్యాగశీల నాటిక వేయించారు.నేను అందులో తొలిసారి ఆడవేషం వేయటం హీరోయిన్ గా నాటిక మొత్తం నా పాత్ర మీదుగా నడవటం, ఏడుస్తూ డైలాగులు చెప్పటం మరచిపోలేను. నాతోపాటు మోహన్,వెంకట్రాములు, డి.సత్యనా రాయణ,నటించారు.ఇవన్నీ పార్థసారథి సారు ప్రోత్సాహం వల్లనే జరిగాయి.నన మెయిన్ గేటు కెదురుగా పెద్ద నోటీస్ బోర్డు,రేడియో పాఠాలు వినడానికి అన్ని తరగతి గదుల్లో స్పీకర్లు,అనేక పుస్తకాలతో గ్రంథాలయం, పిక్ నిక్ లు, విహార యాత్రలు అన్నీ సమకూరిన సర్కారుబడి అది.అదంతా ఆయన చలవే.లెక్చరర్ గా ప్రమోషన్ వచ్చి ఆయన వెళ్లి పోయే రోజు ఆయనకు పంచాయితీ ఆఫీసు వద్ద జరిగిన వీడ్కోలు సభ నభూతో నభవి ష్యతి అన్నట్లుగా ఊరి ప్రజలందరూ ఇసుక వేస్తే రాలనంతగా చేరుకున్నా రు.అందరూ కంటికీ మంటికీ ధారగా ఒకటే ఏడుపు.మా బాపు మాట్లాడుతూ మధ్యలోనే దుఃఖం ఆపుకోలేక భోరుమని ఏడవటం మరచిపోలేని విషయం. మహాభారతం ఉదంకోపాఖ్యానంలో ఓ మంచి పద్యం ఉ.నిండుమనంబు నవ్యనవనీత సమానము పల్కు దారుణా ఖండల శస్త్రతుల్యము జగన్నుత విప్రులయందు నిక్కమీ రెండును రాజులందు విపరీతము గావున విప్రుడోపు నో పండతి శాంతుడయ్యు నరపాలుడు శాపము గ్రమ్మరింపగన్ ఇది మా పెద్దసారు పి.పార్థసారధి గారి వీడ్కోలు సభలో మా బాపు కన్నీటి పర్యంతమై గొంతు గద్గదమై చదివారు. ఆ సభ మామూలుగ బడిలో విద్యార్థులుఉపాధ్యాయుల తో జరిగిన సభ కాదు. అది అంగడి బజారులో పంచాయితీ ఆఫీసుముందు జరిగిన బహిరంగ సభ.ఆ రోజు ఊరు ఊరంతా అక్కడికి చేరింది.ఆరోజు ఎవరూ వ్యవసాయపు పనులకు పోలేదు.ఇసుక వేస్తే రాలనం త జనం.అలాంటి సభ నభూతో నభ విష్యతి అనే సామెతకు వందశాతం తార్కాణంగా నిలుస్తుంది.ఆయనది మా ఊరే.ఆయన మా బడికి వచ్చిన తరువాత ఆ బడి రూపురేఖలే మారిపోయాయి.ఒక బడి పరిపూర్ణంగా ఉంటే ఎలా ఉంటుందని మీరూహిస్తారో అలా మార్చారు. ఆటలు,పాటలు, రేడియో కార్యక్రమాలు, గ్రంధాలయం, విహారయాత్రలు,వనభోజనాలు,పాఠశాల వార్షిక పత్రిక,దీనికి తోడు విద్యార్థులతో సాంఘిక సేవ,ఎన్.సి.సి,స్కౌటు,మాస్ డ్రిల్లు,క్రాఫ్ట్ పని,డ్రాయింగ్,కుట్టుమిషన్లు ఇలా సకల సదుపాయాలతో బడిని తీర్చిన వ్యక్తి ఊరినుండి వెళ్లి పోతున్నా రంటే కదలిపోని వ్యక్తులుంటారా?ఆరోజు ఊరు శోక సంద్రమైంది.ఆ సభలో బాపు ఎందుకు ఈ పద్యం చదివాడని మీకు అనుమానం రావచ్చు.ఆయనను ఉపమించటానికి మొదటి రెండు పంక్తులు తీసుకున్నారు.నిండు మనంబు నవ్య నవనీత సమానము,పల్కు దారుణాఖండల శస్త్రతుల్యము. ఆయన విప్రుడు కాని విప్రవరుడు. ముక్కోపి.పాఠశాల నిర్వహణలో ఏ మాత్రం నిర్లక్ష్యం జరిగినా ఉగ్రనరసిం హుడయ్యే వాడు.ఎందరు విద్యార్థుల ఆయన బెత్తం దెబ్బలు తిన్నారో.ఎందరు ఉపాధ్యాయులు ఆయన చేత గట్టిగా మందలించబడ్డారో. అప్పుడు ఉపాధ్యాయునిగా ఉన్న మా నాగరాజు రామస్వామి గారికి, విద్యార్థులుగా ఉన్న ఎలనాగకు నాకు తెలుసు.ఛండ శాసనుడు కాని నిర్మల హృదయుడు.అప్పుడే తిట్టినా వెంటనే కరిగిపోయేవాడు.ఆయన పెద్దసారుగా ఉన్నసమయంలో మేం చదువుకునే అవకాశం కలగటం మా అదృష్టంగా భావిస్తాము.ఆయన బడి నడిపిన తీరు మొత్తం రాయగలిగితే ఒక అపూర్వమైన నవల అవుతుంది. ****** ఆయన కరీంనగర్ కాలేజీలో పనిచేసేరోజుల్లో నేను గ్రాడ్యుయేట్ అయిన తరువాత కలిస్తే కాలేజీలో డెమాన్ స్ట్రేటర్ గా చేరమన్నారు.అలా ఆయన వద్ద కొంత కాలం పనిచేసాను.ఆ తరువాత కాగజ్ నగర్ రావడం తో చాలాకాలం కలువ లేకపోయాను.రిటైరయిన తరువాత కూడా కొంత కాలం ప్రైవేటు కాలేజీల్లో పని చేశారు.ఆయన చనిపోవడానికి కొంచెం ముందు అనుకోకుండా వారి ఇంటికి వెళ్లి ఆయనను కలిసే అవకాశం కలిగింది. అదే చివరి చూపైనా ఆయన మా మన సుల్లో వేసిన ముద్ర మాత్రం చెక్కు చెదర నిది.- రామ్మోహన్ రావు తుమ్మూరి


కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం