స్వయంకృతం-- తల్లి ఒడిలో చిరునవ్వులొలికిస్తూ ఒదిగిన చంటిపాపలా ప్రకృతి పచ్చచీర సింగారించుకొని ప్రశాంతంగా సేదతీరుతోంది. ప్రకృతిని శాశించే మనిషి జీవిత చిత్రం మాత్రం కరోనాతో చిద్రమై మనుగడకోసం పోరాటం మళ్ళీ మొదలైనట్టుంది "అయ్యవారికి దణ్ణంపెట్టు" అనగానే మాటరాని బసవడు తలాడిస్తూ తరతరాలుగా మన సంస్కృతిని బతికిస్తుంటే అడ్డగోలు కరచాలనాలతో అప్రాచ్యపు ఆలింగనాలతో మనిషి అపవిత్రమైపోయాడు. కడుపు బాగాలేని వీదికుక్క గడ్డితిని రోడ్డుపక్క కక్కుకుని ఆరోగ్య సూత్రాల్ని పాటిస్తుంటే అడ్డమైన నానా గడ్డికరిచి మనిషి రోగాలపాలయ్యాడు వసంత చివురులు తిన్న కోయిల తియ్యని తన గాత్రంతో కమ్మని పాట వినిపిస్తుంటే పరనిందలతో,పచ్చిచాడిలతో మనిషి మాటనే మలినం చేసుకున్నాడు క్రమశిక్షణకు మారుపేరైన పక్షులు ఐక్యతావర్ణాలు వెదజల్లుతుంటే ఏ ఎండకాజెండా పట్టుకోవడమే ఎజెండాగా పెట్టుకున్న మనిషి ఊసరవెల్లినే మించిపోయాడు కారడవుల్లో క్రూరమృగాలు సైతం పసికూనల్ని ప్రేమగా లాలిస్తుంటే జనారణ్యంలో నీతిగీత దాటిన మనిషి మానభంగాల మారణహోమంలో మానవతను మంటగలుపుతున్నాడు. ఇది దేవుడివరమో,ప్రకృతిశాపమో తెలియదుకానీ మనిషి మానిషిగా మారడానికి మనిషికి ఓ అవకాశం వచ్చింది మానకుంటే... మారనంటే పంచభూతాల మౌనరోధనకు మరో ప్రళయం పుడుతుంది. అప్పుడైనా ఆహుతికాక తప్పదు!!! -జ్యోతిరాజ్ భీశెట్టి


కామెంట్‌లు