ఆంగ్లేయుల దేశభక్తి -- నారంశెట్టి ఉమామహేశ్వరరావు -- రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో జర్మన్ సైన్యాలు బెల్జియం, హాలండ్ , ఫ్రాన్స్ దేశాలను పాదాక్రాంతం చేసుకుని డన్ కిర్క్ రేవు దగ్గర బ్రిటీష్ సైన్యాలను ఓడించి, రాత్రింబవళ్ళు బాంబుల వర్షం కురిపించి బ్రిటన్ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేసాయి. వారికి అదొక మహావిపత్తు. అప్పటి ప్రధాని విన్ స్టన్ చర్చిల్ తన మాటలతో, చేతలతో ప్రజలను చైతన్యవంతులను చేసారు. ఆ దేశ ప్రజలు అమోఘమైన ధైర్య సాహసాలు ప్రదర్శించారు.మరో వైపు పులి మీద పుట్రలా వారిని ఆహార కొరత పీడించింది. బయట నుండి వచ్చే ఆహార పదార్ధాలను దేశంలోకి చేరకుండా జలాంతర్గాముల ద్వారా అడ్డుకుంది జర్మని. అతితక్కువ ఆహారంతో సరిపెట్టుకుని మాతృదేశ రక్షణకై యుద్ధంలో పాల్గొన్నారు బ్రిటన్ ప్రజలు. అలా ఆరు సంవత్సరాలు జరిగిన యుద్ధంలో బ్రిటన్ ప్రజలు చూపించిన సహనం, తెగువ అమోఘం. వారు ప్రదర్శించిన ధైర్యసాహసాలు ప్రశంసనీయం. చివరికి మిత్ర దేశాల సహకారంతో ఘన విజయం సాధించింది బ్రిటన్. ప్రధాని విన్ స్టన్ చర్చిల్ పై ప్రశంసల వర్షం కురిసింది. ఆ అభినందనలను సున్నితంగా తిరస్కరించిన చర్చిల్ “నా జాతికి సింహానికున్నంత గుండె ఉంది. కేవలం గర్జించానంతే” అన్నారు. ఈ కథ మన దేశానికి ప్రస్తుత సందర్భానికి అన్వయించుకుందాం.మహమ్మారి కరోనా నిర్దాక్షిణ్యంగా ప్రపంచాన్ని వణికిస్తున్న సందర్భంలో ఇంగ్లండు ప్రజల్లా దేశభక్తి ప్రదర్శించాల్సిన సమయం వచ్చింది.బ్రిటన్ ప్రజలు సరిపడినంత ఆహారం లేకపోయినా దేశ రక్షణ కోసం ఓర్చుకున్నారు. అదీ ఆరు సంవత్సరాల కాలం.ఇప్పటి మన యుద్ధం ఇంగ్లండులా కాకుండా విచిత్రమైనది. మన శత్రువు కంటికి కనబడదు. అందుకే ఆత్మరక్షణ చేసుకోవాలి. అదీ కొన్ని నెలలే.కరోనా కట్టడికై దేశానికి లాక్ డౌన్ ప్రకటించిన ప్రధాని మోదీపై విశ్వాసంతో జాతి యావత్తూ ఏకత్రాటిపై నిలిచి స్వీయ నిర్బంధం, సామాజిక దూరం, పరిశుభ్రతలను పాటిస్తూ ఇంట్లోనే గడుపుతూ వ్యాధి వ్యాప్తిని అరికట్టి విజయం సొంతం చేసుకోవాలి.మన ప్రధాని చేత కూడా “భారత జాతికి సింహానికున్నంత గుండె ఉంది. కేవలం గర్జించానంతే” అని గర్వపడేలా చేయాలి. అది మనందరి బాధ్యత.ఇలాంటప్పుడే దేశభక్తి, ఐకమత్యం ప్రదర్శించాలి.


కామెంట్‌లు