రెండు చేతులు..---ఎప్పుడూ కళ్ళు చెప్పే వాటికన్నా చేతులు మన మానసికస్థితిని తమ చేతలతో బయటపెడుతుంటాయి. ఆనందమో ఉత్సాహమో కోపమో ఆందోళనో బాధో ఏదైనా కావచ్చు, చేతులు ఆ సమయంలో చేసే పనులతో అర్థం చేసుకోవచ్చు. చేతులు భగవంతుడిని ప్రార్థిస్తాయి.పక్కవారిని కొడతాయి. బెదిరిస్తాయి. ప్రియమైన వారిని ప్రేమతో హత్తుకుంటాయి. అందమైన వస్తువులను తయారు చేస్తాయి. సంగీతవాయిద్యాలను వాయిస్తాయి. బొమ్మలు గీస్తాయి. వాహనాలు నడుపుతాయి. దారి చూపుతాయి. కాళ్ళు బలహీనపడినప్పుడు చేతులే కాళ్ళవుతాయి. ఐటువంటి చేతులకు సంబంధించి ఓ తమిళ రచయిత ఎప్పుడో చూసిన ఓ లఘుచిత్రం గురించి ఓ వ్యాసం రాశారు. అందులోని మాటలనే యిక్కడ క్లుప్తంగా ఇస్తున్నా.... మృదువైన చెయ్యి ఓ పువ్వుని గీస్తుంది. మొరటు చెయ్యి ఆ పువ్వుని పీకి పారేస్తుంది. మృదువైన చెయ్యి ఓ చేపబొమ్మను గీస్తుంది. మొరటు చెయ్యి గాలంవేసి ఆ చేపను పట్టుకెళ్ళిపోతుంది. మృదువైన చెయ్యి ఓ చెట్టుబొమ్మను గీస్తుంది. మొరటు చెయ్యి గొడ్డలితో ఆ చెట్టుని నేలకూల్చేస్తుంది. మృదంవైన చెయ్యి ఓ పక్షి బొమ్మను గీస్తుంది. మొరటు చెయ్యి ఆ పక్షిని చంపేస్తుంది. ఇలా మృదువైన చెయ్యి గీసే బొమ్మలన్నింటినీ మొరటు చెయ్యి నాశనం చేసేస్తుంది. చివరికి మృదువైన చెయ్యి ప్రార్థన చేస్తుంది.మొరటు చెయ్యి ప్రార్థించే చేతులను నరికేస్తుంది. చెయ్యి తెగి పడిన చోట కొత్తగా రెండు చేతులు పుట్టుకొచ్చి మళ్ళీ ప్రార్థిస్తాయి. మొరటు చెయ్యి ఆ చేతులను నరికేస్తుంది. ఎన్నిసార్లు మొరటు చెయ్యి నరికినా అన్నిసార్లూ ఆ మృదువైన చేతులు పుట్టుకొచ్చి ప్రార్థించడం మానదు. చివరికి మొరటు చేతులు తనకు తెలియకుండానే మృదువైన చేతులతో కలిసి ప్రార్థించడం మొదలుపెట్టడంతో ఆ లఘుచిత్రం ముగుస్తుంది. అద్భుతమైన లఘుచిత్రం. ఆలోచింపచేసే చిత్రం. ప్రపంచంలో ఆలోచించే రాసే తెలివితో వ్యవహరించే చేతులు తమ పనితనానికిబట్టి మర్యాదను పొందుతాయి. కానీ సామాన్యమైన చేతులు అందుకు నోచుకోవడం లేదు. - యామిజాల జగదీశ్


కామెంట్‌లు