ఎనిమిదో ఖండం;;;--భూగోళంపై ఎన్ని ఖండాలు ఉన్నాయంటే స్కూలు పిల్లలు కూడా టక్కున చెప్తారు ఏడు అని. కానీ 2017లో భూమిపై ఎనిమిదో ఖండాన్ని గుర్తించామని శాస్త్రవేత్తలు ప్రకటించగానే అందరూ ఆశ్చర్యపోయారు. న్యూజిలాండ్‌ సమీపంలో ఉన్న ఈ ఖండం సముద్రంలో మునిగి ఉంటుంది. ఈ ఖండం పేరు జీలాండియా. ఒకప్పుడు మామూలు ఖండాల్లాగే సముద్ర మట్టానికి పైనే ఇది ఉండేదని, తర్వాతికాలంలో మునిగిపోయిందని పరిశోధకులు గుర్తించారు. ఈ ఖండం పూర్తి వివరాలు కనిపెట్టామని న్యూజిలాండ్‌ శాస్త్రవేత్తలు తాజాగా ప్రకటించారు.కంటికి కనిపించకపోయినా జీలాండియా ఖండం చిన్నదేమీ కాదు. 20 లక్షల చదరపు మైళ్లు (50 లక్షల చదరపు కిలోమీటర్ల) విస్తీర్ణంలో ఉంటుంది. బాతీమెట్రీ విధానంలో ఈ ఖండం కొత్త మ్యాపులను న్యూజిలాండ్‌ భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు రూపొందించారు. ఈ ఖండం వెడల్పు, పొడవు, లోతు తదితర వివరాలను కచ్చితంగా గుర్తించినట్టు న్యూజిలాండ్‌ పరిశోధకుడు మార్టిమర్‌ వెల్లడించారు. మొత్తం విస్తీర్ణంలో ఇది కేవలం 6శాతం మాత్రమే సముద్రపైకి కనిపిస్తుంది. అవే న్యూజిలాండ్‌ ఉత్తర, దక్షిణ దీవులు.. న్యూ క్యాలడోనియా దీవి. అసలు భూమిపై ఎనిమిదో ఖండం ఉందని మొదట ప్రతిపాదించిన వ్యక్తి బ్రూస్‌ లుయెండిక్‌. భూభౌతిక శాస్త్రవేత్త అయిన ఆయన 1995లో ఈ ప్రతిపాదన చేశారు. దానికి జీలాండియా అని పేరు పెట్టింది కూడా ఆయనే. 8.5 కోట్ల ఏండ్ల క్రితం మహా ఖండంగా ఉన్న గోండ్వానా నుంచి ఇది విడిపోయిందని ఊహించారు. సముద్రంలో మునిగి ఉన్నప్పటికీ దీనిని ఒక ఖండానికి ఉండాల్సిన లక్షణాలన్నీ ఉన్నాయని పరిశోధకులు అంటున్నారు.(నమస్తే తెలంగాణ సౌజన్యంతో)


కామెంట్‌లు