కమ్మని పాయసం తింటున్నప్పుడు అక్కడక్కడ వేయించిన జీడిపప్పు, కిస్మిస్ లాంటివి పంటి కింద పడుతుంటే మాధుర్యం ఎలా ఉంటుంది? అద్భుతం కదా? అటువంటి జీడిపప్పు, కిస్మిస్లతో అచ్చంగా ఒక వంటకం చేస్తే ఎట్లా ఉంటుంది? అద్భుతం కదా... సరిగ్గా ఇలాంటి ఆలోచనే మెదిలిందో ఏమో కథా రచయత కాశీ విశ్వనాథం పట్రాయుడు గారికి. 'అయితే ఉగాది లేకుంటే శివరాత్రి' కథల సంకలనం చదివిన తర్వాత ఎవరికైనా అదే అనిపిస్తుంది. ఒక చక్కని రచన లేదా ప్రసంగం సాగుతున్నప్పుడు మధ్య మధ్యలో సామెతలు, పిట్టకథలు చెప్తే ఆ ప్రసంగం, రచన మరింత రక్తి కడుతుంది. బలం చేకూరుతుంది. పాయసంలో జీడిపప్పు, కిస్మిస్ లాగా అన్నమాట. అంతటి ప్రాధాన్యం కలిగిన అచ్చమైన సామెతలతోనే కథలు రాశారు కాశీ విశ్వనాథం పట్రాయుడు గారు. ప్రతి సామెతకు ఒక కథను అల్లారు. పుస్తకం చదువుతున్నంత సేపు.. కిసామెతకు కథ అల్లారా లేకుంటే ఈ కథనుంచే సామెత పుట్టిందా' అన్నంత గొప్పగా అనిపించింది. బొమ్మలతో కూడిన 50 కథలను కేవలం 110 పేజీలోనే అందంగా పుస్తకాన్ని డిజైన్ చేశారు. వెండితెరపై షార్ట్ ఫిలిం చూసిన అనుభూతి కలుగుతుంది.
ఏ కథ కూడా 2 పేజీలకు మించలేదు. కథలు చెప్పమని అమ్మ దగ్గర మారం చేసే పిల్లాడి దగ్గరనుంచి కాలక్షేపం కోసం దేవులాడే పండు ముసలి వరకు ప్రతి ఒక్కరూ చదవాల్సిన పుస్తకం.
ఈ పుస్తకం విశిష్టత నేను చెప్పే దానికంటే ముందుమాటలు రాసిన కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కార గ్రహీత, బాలసాహిత్య పరిషత్ అధ్యక్షులు చొక్కాపు వెంకటరమణ, కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కార గ్రహీత నారం శెట్టి ఉమామహేశ్వరరావు, బాల సాహితీవేత్త, చందమామ రచయిత అయిన మాచిరాజు కామేశ్వరరావు మాటలలో వింటే పుస్తకం గొప్పతనం అర్థమవుతుంది.
కాలక్షేపం, విజ్ఞానం, వినోదం, అన్నిటికంటే ముఖ్యంగా భాషా పరిజ్ఞానం ఇలా ఏది కావాలన్నా ఈ పుస్తకంలో దొరుకుతుంది. ఈ కథల్లో ఉత్తరాంధ్ర పల్లెల్లోని సంస్కృతి, సాంప్రదాయాలు, కట్టుబాట్లు కట్టొచ్చినట్టు కనిపిస్తాయి. ఒక ఆంగ్ల ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న కాశీ విశ్వనాథం మాస్టారికి మారుమూల పల్లె భాష ఇంతలా ఎలా వంట పట్టిందా అన్న ప్రశ్న తలెత్తింది. ఒక సామెతను కథాంశంగా తీసుకుని ఆ కథ నడిపే క్రమంలో పాత్రలతో నాలుగైదు సామెతలు మాట్లాడించారు. ఈ పుస్తకంలోని 50 కథలలో కనీసం 150కి తగ్గకుండా సామెతలను పరిచయం చేశారు.
చాలా లోతైన అర్ధాలు ఉన్న సామెతలను కథా అంశాలుగా ఎంచుకున్నారు రచయిత.
'ఇంటికి గుట్టు మడికి గట్టు' అన్న సామెత చూసుకుంటే ప్రతి ఒక్కరి ఇంట్లో ఏం జరుగుతుంది అనేది బయట వాళ్లకు తెలియకుండా గుట్టుగా జరగాలి లేకపోతే ఆ కుటుంబం అభాసు పాలయి వీధిలో పడుతుంది. ఇక మడి అంటే పొలం. పొలానికి చుట్టూ గట్టు ఉండాలి లేకపోతే ఆ పొలంలో నీరు నిలబడదు. వ్యవసాయానికి పనికిరాకుండా పోతుంది. అంతటి లోతయిన అర్థం ఉంది ఈ సామెతలో. ఆకలి రుచి ఎరగదు నిద్ర సుఖమెరగదు అనే సామెత ఎంచుకున్నారు. మంచి ఆకలి మీద ఉన్నప్పుడు రుచి చూడం అర్జెంట్‌గా కడుపు నిండిపోయే అంతలాగా తినేయాల్సిందే. బాగా అలసిపోయినప్పుడు మంచి పరుపు, ఏసీ ఇవేవీ కావాలనుకోము, ఎక్కడైనా హాయిగా నిద్ర పట్టేస్తుంది. అనుమానం పెనుభూతం కథలో అనుమానం అనే జబ్బు చేస్తే దానికి మందు లేదు అది పెనుభూతమయ్యి అనుమానం కలిగిన వ్యక్తినే మింగేస్తుంది అనే ఒక చక్కని సందేశాన్ని ఇచ్చారు. పట్టుచీర ఎరువిచ్చి పీట పట్టుకుని తిరిగినట్లు, ఎంత చెట్టుకు అంత గాలి, కుక్క తోక పట్టి గోదారి ఈదినట్లు, తల్లిని బట్టి బిడ్డ నూలును బట్టి గుడ్డ, అన్నం పెట్టిన ఇంటికే కన్నం, తా దూర సందు లేదు మెడకో డోలు, దీపముండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి లాంటి లోతైన అర్ధాలు ఉన్న అంశాలను తీసుకొని ఆసక్తికరంగా కథలుగా మలిచారు. ఇది ప్రతి ఒక్కరు చదవాల్సిన పుస్తకం.
పుస్తకం : ఉంటే ఉగాది లేకుంటే శివరాత్రి
రచయిత : కాశీ విశ్వనాథం పట్రాయుడు
ధర : 250 రూ.
ఫోన్: 9494524445




addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి