కృష్ణాలయం:--తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా కరుంగల్ సమీపాన గల తిప్పిరమలైలో కరుమాణిక్కత్తాళ్వార్ ఆలయముంది. ఈ ఆలయంలో కృష్ణుడి విగ్రహం ఎత్తు పదమూడు అడుగులు.అప్పట్లో వేనాడును పాలించిన రాజు తన భవంతిలో లెక్కలు చూసేవారి కోసం, యుద్ధ వీరులకోసం, ఆలయాలను సంరక్షించే నిర్వాహకులకోసం ప్రత్యేకించి డెబ్బయ్ రెండు గ్రామాలు కేటాయించాడు. అలాగే వారు ఆరాధించుకోవడానికిగాను అయిదు కృష్ణుడి ఆలయాలుకూడా ఏర్పాటు చేశాడు. వాటిలో ఒకటి ఈ తిప్పిరమలైలోని ఆలయం. దీనినే బాలకృష్ణ ఆలయమనికూడా అంటారు.తిరుపిరైమలై అనే పేరే కాలక్రమంలో తిప్పిరమలైగా మారింది.ఈ ఆలయాన్ని కేరళ వాస్తు శైలిలో నిర్మించారు.కృష్ణపరమాత్ముడికి వెన్నంటే మహాఇష్టం. బాల్యంలో ఇరుగుపొరుగు ఇళ్ళల్లో వెన్నను దొంగిలించి తినడం తెలిసి తల్లి యశోద కోప్పడింది. ఓరోజు కృష్ణుడిని నోరు తెరచి చూపమంటుంది. అలాగేనని కృష్ణుడు నోరు తెరవగా యావత్ ప్రపంచం కనిపిస్తుంది యశోదమ్మకు. ఈ కథనం ఆధారంగానే ఇక్కడి కృష్ణుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.ఈ పుణ్యక్షేత్రంలోని కృష్ణుడి విగ్రహం దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద విగ్రహమని అంటుంటారు. నిల్చున్న రూపంలో దర్శనమిచ్చే ఈ పదమూడు అడుగుల కృష్ణుడి విగ్రహం ఆసియాలో రెండవ అతి పెద్ద విగ్రహం.ఇక్కడి కృష్ణుడికి నాలుగు చేతులున్నాయి. ఒక చేతిలో శంఖం, ఇంకొక చేతిలో చక్రం, మరొక చేతిలో గద, ఇంకొక చేతిలో వెన్నతో కృష్ణుడు దర్శవమిస్తాడు. కృష్ణుడి కుడివైపున తల్లి యశోద విగ్రహాన్ని చూడవచ్చు. యశోద ఒక చేతిలో వెన్న, మరొక చేతిలో గరిట ఉన్నాయి. యశోద కృష్ణుల ఆలయాలు బహు అరుదు. అపూర్వమూ. ఇక్కడ కృష్ణుడు తానుగా ఎత్తు ఎదిగాడని భక్తుల నమ్మకం.కృష్ణుడి విగ్రహం ఎత్తు పెరుగుతోందని గ్రహించి ఇప్పటికే మూడుసార్లు ఇక్కడ పైకప్పును మార్చి నిర్మించారని అంటారు.తానుగా ఎత్తు పెరుగుతూ వస్తున్న ఈ విగ్రహాన్ని ఆరాధిస్తూ వచ్చిన ఒక ముని దానిని నియంత్రించిన కథనము ఈనోటా ఈనోటా వినవస్తోంది.బిడ్డలు లేని దంపతులు సంతానంకోసం ఈ క్షేత్రంలో కృష్ణపరమాత్మను కృష్ణజయంతి రోజున దర్శించుకుని ఆరాధిస్తే వారి కోరిక నెరవేరుతుందంటారు భక్తులు.భక్తులు వెన్న, జంతికలు, సీడై (తమిళులు కృష్ణాష్టమి రోజున చేసే ఒక పదార్థం) వంటివి కృష్ణుడికి నైవేద్యంగా సమర్పిస్తారు.ఈ తిప్పిరమలైలోనే స్వయంభువుడిగా వెలసిన పరమేశ్వరుడి కలికండ మహాదేవ ఆలయం, శాస్తావారి ఆలయం కూడా ఉన్నాయి.పరమేశ్వరుడిని పూజించి ఇక్కడ తొమ్మిది కొమ్మలతో ఉన్న రావి చెట్టుని ప్రదక్షిణ చేస్తే నవగ్రహ దోషాలు పోయి నివృత్తి పొందవచ్చన్నది భక్తుల నమ్మకం. ప్రస్తుతం ఈ ఆలయం దేవాదాయ శాఖ నియంత్రణలో ఉంది. ఇక్కడ స్థానిక భక్తులు పది రోజులపాటు కృష్ణ జయంతి వేడుకలు భారీ ఎత్తున జరుపుకుంటారు.భాద్రపద మాసంలో శనివారాలు, అమావాస్యనాడు వందల సంఖ్యలో భక్తులు ఇక్కడికొచ్చి బాలకృష్ణుడిని పూజిస్తారు. ఈ ఆలయం వేయి సంవత్సరాల పురాతనమైంది. - యామిజాల జగదీశ్


కామెంట్‌లు