తెలుగు(బాల) సాహిత్యం-దసరా పండుగ-- బెహరా ఉమామహేశ్వరరావు.-- సెల్ నెంబర్ 9290061336.

 ముందు రోజు పాఠశాలలో సరస్వతీ పూజ జరిగితే,మరుసటి రోజు అనగా ఆశ్వయుజ శుద్ధ విదియ నాడు, బాలలంతా మంచి దుస్తులు ధరించి రంగుల బాణాలు చేత పట్టుకొని ముందుగా పాఠశాలకు ఉత్సాహంగా చేరేవారు. ఎవరి తరగతిలో వారు కూర్చునేవారు. ఉపాధ్యాయులు పిల్లలందరినీ ఉద్దేశించి; రోడ్లపై నడిచేటప్పుడు 'క్యూ' పాటించాలని అల్లరి చేయకూడదని ఎవరింటికి వెళ్లినా క్రమశిక్షణ పాటించాలని, చెబుతూ 
 అలాగే పాఠశాల గొప్పతనం చాటేటట్లు ప్రవర్తన ఉండాలని హెచ్చరించి బయలుదేరే వారు.
          బాలలంతా ఆనందోత్సాహాలతో గంతులు వేస్తూ వాడవాడలా తిరిగేవారు. బాలలు  పాడే దసరా గీతాలు ముందుగ పాఠశాలలో శిక్షణ ఇవ్వడం జరిగేది, అంటే ఒక నెల రోజుల ముందు నుండి ప్రాథమిక పాఠశాలలో చివరి పీరియడ్ దసరా గీతాలు రాగ భావ యుక్తంగా ఉపాధ్యాయులు పిల్లలచే బృంద గీతం పాడిస్తూ శిక్షణ ఇవ్వడం
జరిగేది. ఎటువంటి వాగ్దోషాలకు తావు లేకుండా
అభ్యాసం చేయిస్తూ, పాడించేవారు.
     ప్రతి గ్రామంలోను పట్టణంలోను బాలల దసరా గీతాలతో మారుమ్రోగి పోయేది. గీతాలలో సంస్కృత పదాలు కూడా చోటు చేసుకున్నాయి. ఈ గీతాలతో
పాటు సంస్కృత శ్లోకాలు కూడా బాలలు వినసొంపుగా పాడేవారు.ఈ శ్లోకాలు ముందుగ ఉపాధ్యాయులు భావయుక్తంగా దోష రహితంగా  చక్కగా బాలలు పాడేందుకు తగిన శిక్షణ ఇచ్చేవారు. అదే ఆనాటి  గురువులు అంటే ఉపాధ్యాయుల  ప్రత్యేకత.
                    ఈనాడు బాలసాహిత్యం అని మనం  చెప్పుకునే సరళ గీతాలు చిన్నారుల మనస్తత్వానికి అనుగుణమైన దసరా పాటలు నేర్పే వారు. ఒకటి రెండు తరగతుల బాలలచే అతి సరళమైన పాటలు 
సులభంగా పాడించేవారు.
అందుకు ఉదాహరణగా ఈ గీతం చెప్పుకోవచ్చు
    "సీతమ్మ తోటలో సిరిమల్లె చెట్టు/ ఆ చెట్టు పూసింది; అది వింతగాను/కొమ్మ కదలకుండా కొయ్యండి పూలు/కోసిన పూలన్ని కొట్లొ పోయండి/
రాలిన పూలన్ని రాశి పోయండి/ఆ పూలు ఈ పూలు
దండ కూర్చండి/ఆ దండ ఈ దండ సీతకివ్వండీ/
సీతమ్మ సీతమ్మ తలుపు తియ్యమ్మా,/నీ పేరు చెబితేనే తలుపు తీస్తాను/నా పేరు హనుమంత
"రాజకుమార"//జయ జయా! జయ జయా!జయ మహా విజయ"
       ఈ గీతాన్ని 1, 2 తరగతుల బాలలు అనగా ఐదు లేక ఆరు సంవత్సరాల వయస్సు గల పిల్లలు,
ఇంట ముంగిట పాడుతుంటే,  తల్లితండ్రులే కాక తాతయ్యలు, నాయనమ్మ, అమ్మమ్మలే గాక కుటుంబ సభ్యులందరూ మురిసిపోతూ, ముచ్చట పడేవారు. అదొక సంతోషకరమైన వాతావరణం. చిన్నపిల్లలు తొణకు బెణుకు లేకుండా నిర్భయముగా వాచా దోషాలు లేకుండా పాడుతుంటే వెనుక పెద్ద పిల్లలు బృంద గానం చేస్తుంటే,  మనస్సుకు ఆనందం కలిగించే నిజమైన దసరా పండగ, ఆహ్లాదకరమైన వాతావరణం. అది మాటలతో  వర్ణించనలవి కానిది.
అదే ఆ నాటి పండుగ సరద, సంతోషాల మరియు 
తెలుగు బాల సాహిత్య ఔన్నత్యం చాటి చెప్పే గొప్ప వాతావరణం. ఇంతకంటే ఘనత ఏముంది? శ్రీకృష్ణదేవరాయల భువన విజయంతో సాటిగ తులతూగ గలదని చెప్పుట, అతిశయోక్తి కాదేమోననిపిస్తుంది.  
 ఆ వెనువెంటనే 4, 5, తరగతుల బాలల చేత దసరా గీతాలు పాడించడం కూడా జరిగేది.
      విశేషమేమిటంటే  బాలలు, చివరి చరణంలో "జయ జయా!, జయ జయా! జయ మహా విజయ"అని విన సొంపుగా ముగింపుగా పాడడంలో, కూడా ప్రత్యేకత కనిపించేది.దసరా పాటలతో ఇంటి ముందు బాలలు  చేరితే  ముచ్చటపడే రోజులవి.
అలాగే శ్రీకృష్ణుని బాల్య లీలల పై కూడా అనేక గీతాలు ఉన్నాయి.(రేపు మరో గీతం).