భారతీయుల ఆధ్యాత్మిక గుండె చప్పుడు అక్షరధామ్ ఆలయం
భారతీయ సంస్కృతి ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న ఈ సమయంలో, న్యూజర్సీలోని అక్షరధామ్ ఆలయం ఒక మహాశిలా స్థంభంలా నిలిచింది. ఇది కేవలం మర్మ శిలలతో నిర్మితమైన గుట్ట కాదు… ఇది ఒక గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా మారింది ఇందులో శిల్పం ఉంది, శాస్త్రం ఉంది, సేవ ఉంది, సంస్కృతి ఉంది. అందుకే ఇది అమెరికాలో భారతీయతకు ప్రతీకగా నిలుస్తోంది.
భగవాన్ స్వామీ నారాయణ ఈ ఆలయంలో ప్రధాన దేవుడిగా కొలువైవున్నారు.హనుమాన్,శివుడు,వేంకటేశ్వరుడు,లక్ష్మీనారాయణులు,రామలక్ష్మణ సీతాతదితర విగ్రహాలనుకూడా ఈ ఆలయంలో ప్రతిష్టించారు. అక్షరధామ్ ఆలయం రూపుదిద్దుకోవడానికి దాదాపు 10 సంవత్సరాల కాలం, 2 లక్షల శిల్పకళాఖండాలు,వెయ్యి మందికి పైగా శిల్పకళాకారుల శ్రమ ఉంది.ఆలయ నిర్మాణంలో ఇటలీ, టర్కీ, భారతదేశం నుండి దిగుమతి చేసుకున్న రాళ్లు, శిలలతో ఆలయ అందాన్ని రెట్టింపు చేశారు.
భారతీయ శిల్పశాస్త్రానికి సజీవంగా నిలిచే శిలా ప్రబంధం ఇది. ప్రతి గోపురం వెనుక ఒక ఇతిహాసం ఉంది. ప్రతీ శిఖరం ఒక తత్త్వాన్ని ప్రభోదిస్తుంది, ప్రతిధ్వనిస్తుంది. ఈ ఆలయం కేవలం దర్శనీయ స్థలం కాదు.ఇది ఓ భక్తి యాత్ర. నిత్యం వేలాదిగా వస్తున్న భక్తుల కోసం ప్రతిరోజూ మంగళారతి, పూజలు, గీతాపాఠాలు, వేద పారాయణాలు జరుగుతుంటాయి. ఆలయ ప్రాంగణంలో పర్యటించే ప్రతిఒక్కరూ “భక్తి స్నానం” చేసినట్టే అనిపిస్తుంది.యువత కోసం ధార్మిక శిక్షణ శిబిరాలు, భజన వర్క్‌షాపులు, భవిష్యత్తు నాయకత్వాన్ని తీర్చిదిద్దే పాఠ్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ఇది భారతీయ ఆత్మను పాశ్చాత్య భూమిపై నాటే ప్రయత్నం అని చెప్పడంలో సందేహం లేదు. భారతీయ సంస్కృతిలోని తత్త్వాలు – ధర్మం, కర్మ, భక్తి, శాంతి – ఇవన్నీ ఈ ఆలయ నిర్మాణంలో శిలలుగా మారాయి.
ఇక్కడ వినిపించే సాంప్రదాయ సంగీత కీర్తనలతో భక్తులు తమకు తాము మైమరచిపోతారు.
ఆలయం పరిసరాల్లో నిర్మితమైన ఎగ్జిబిషన్ హాల్స్, హిందూ హిస్టరీ గ్యాలరీలు, స్మారక మండపాలు పర్యాటకులను, విద్యార్థులను, పరిశోధకులను ఆకట్టుకుంటున్నాయి ఈ ఆలయ నిర్మాణం పర్యావరణ హితంగా, టెక్నాలజీతో అనుసంధానంగా ఉంటుంది.సోలార్ పవర్,వర్షపు నీటి వాడకం,పచ్చదనం మధ్య మునిగిపోయే ఉద్యానవనాలు
ఇవి ఆలయ సౌందర్యానికి కొత్త శోభను జోడిస్తున్నాయి. అందులోనూ రాత్రిపూట వెలిగే దీపాలు, శాంతస్వరూప విగ్రహాల మీద పడే నీలి వెలుతురు.. ఒక ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది.ఇది భౌతికంగా కాక, ఆధ్యాత్మికంగా ఏదో తెలియని భావనాతరంగం లోకి వెళ్లి పోతాం.
BAPS సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ ఆలయం అమెరికాలో భారతీయులు చేసే సేవా ప్రణాళికలకు కేంద్రబిందువు.ఆహార పంపిణీ, వైద్య శిబిరాలు, విద్యాసహాయం వంటి సేవా కార్యక్రమాలు ఎన్నో ఈ ఆలయ ప్రేరణతో జరుగుతున్నాయి. గొప్ప విషయమేమిటంటే ఇది ఒక భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను అమెరికా సమాజానికి పరిచయం చేసే వేదికగా మారింది. ఒక్కసారి ఈ ఆలయం లోనికి అడుగుపెడితే, భారతీయఆత్మ మీ గుండెల్లో ప్రతిధ్వనిస్తోంటుంది. అక్షరధామ్ ఆలయం అమెరికాలో భారతీయ ఆధ్యాత్మికతకు ప్రతీక, హిందూ సంస్కృతికి ఓ దీపస్థంబం, విశ్వ శాంతికి మార్గదర్శి. ఇది పాలరాతి శిలలతో చెక్కిన చక్కని ఆలయమే కాదు…భారతీయుల గుండె చప్పుడు.ఈ ఆలయం ప్రస్తుతం ప్రపంచ అతిపెద్ద సం ప్రదాయ హిందూ దేవాలయంగా గిన్నిస్ వరల్డ్ రికార్డు లో ఉంది.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి