పొద్దెక్కింది. గుబురుగా ఉన్న చెట్ల మద్య నుంచి సూర్యుడు కాంతితో ఆకాశం మీద కొస్తున్నాడు. పక్షుల కిలకిలా రావాలు ఎక్కువైనాయి. కోయగూడెంలో కోలాహలం మొదలైంది. తెల్లారి వేట
కెళ్ళిన గూడెం కుర్రాడు తిప్పడు బాణం కర్రకు కుందేళ్ళు నక్కలు నీటి బాతులు ముళ్ళ పందుల్నీ వేల్లాడ తీసుకుని వచ్చాడు.
ఒక్కొక్కరు తిప్పడి చుట్టూ చేరుకున్నారు.
" ఒరే , తిప్పా ! నీటి బాతు మాంసం తిని శానా కాలమైనాది. ఒక బాతు
ఇటెయ్యరా." ముసిలి సింగడు దీనంగా అడిగాడు.
" అలాగే తాతా! ఇంద , ఈ తెల్ల బాతు తీసుకో "అంటూ తెల్లబాతు
తాత కిచ్చాడు. ఎయ్యేల్లు సల్ల గుండాలంటూ దీవించాడు ముసిలి సింగడు.
" నాకూ ఒక సెవుల పిల్లిని పడెయ్యరా, చంటోడా" చెయ్యి చాపింది అప్పిలి.
" ఇంద తీసుకో,బామ్మా ! "అప్పిలి చేతికి చెవుల పిల్లిని ఇచ్చాడు.
ఇలా కోయగూడెంలో వేటకు వెళ్లలేని ముసలి వాళ్లందరికీ వారు
అడిగిన జంతువుల్ని పంచి పెట్టాడు తిప్పడు.
తిప్పడు ఐదేళ్ల వయసు ఉన్నప్పుడు ఆడి అమ్మా నాన్న కట్టెలకోసం
అడవిలో కెళ్లినప్పుడు పులిగొడ్డు దాడి చేసి చంపేసింది.అప్పటి నుంచి
గూడెం ప్రజలే తిప్పడిని పెంచి పెద్ద చేసారు.
తిప్పడు పెరిగి పెద్దయినాక గూడెం నాయకుల కాడ గురి చూసి బాణం వెయ్యడం పిట్టల్నీ జంతువుల్నీ వేటాడటం నేర్చుకున్నాడు.చురుగ్గా తిరుగుతూ అందరికీ సహాయకారిగా ఉంటూ కోయగూడెంలో అందరి
అభిమాన పాతృ డయాడు.
ఒకరోజు ఎరుకల తిప్పడు వేటకోసం సమీప నీటి సరోవరం దగ్గర కెళ్లాడు.సరోవరం దగ్గర ఏదో కోలాహలం కనిపించింది.
ఒక మునీశ్వరుడు కొందరు రాజకుమారలను వెంట పెట్టుకుని
వచ్చాడు.సరోవరంలో ఈదుతు గాలిలో కెగురుతున్న నీటి బాతుల్ని
వేటకోసం రాకుమారులు బాణాలు వదులు తున్నారు. కాని ఒక్కబాణం
కూడా తగలకుండ గురి తప్పుతున్నాయి.
ఇంతలో ఒక బాణం రివ్వున వచ్చి గాలిలో ఎగురుతున్న నల్లబాతుకి
తగిలి కింద పడింది. అది చూసిన మునీశ్వరుడు కిందపడిన బాతుకు
తగిలిన బాణం తమది కాదని గుర్తించి పరిసర ప్రాంతాల్లో చూస్తూండగా
ధృఢకాయుడైన ఒక కోయ యువకుడు భుజాన విల్లంబులతో అక్కడికి
వచ్చాడు.
" ఏయ్, ఎవరు నువ్వు? నీకు ఎవరు నేర్పారు ఈ విలువిద్య ?"అని
గద్దించాడు మునీశ్వరుడి రూపంలో ఉన్న రాజగురువు.
" నా పేరు తిప్పడు సామీ ! నా కెవురు గురువులు లేరు.గూడెం దొర
నేర్పిన బాణం ఇద్దే మా బతుకు తెరువు. నాక్కూడా మీ రాజకుమారులతో పాటు బాణం ఇద్దె నేర్పండి.పెద్ద సివంగి గొడ్లను
పెద్ద పులుల్నీ సంపి తమకి కానుకగా సమర్పించు కుంటాను "అని
వేడుకున్నాడు.
" ఓరి ,మూర్ఖుడా ! కొండ కోనల్లో పుట్టిన బోయ వాడివి. నువ్వ రాజ
పుత్రులతో కలిసి విలువిద్య నేర్చుకుంటావురా, ఫో ! ఇంకెప్పుడూ
అటువంటి సాహసం చెయ్యకు ". గద్దించాడు రాజగురువు. రాజ
కుమారులు పకపకా నవ్వు కున్నారు.
దీన వదనంతో అక్కడి నుంచి కదలి పోయాడు తిప్పడు.
సరోవరం పరిసరాల్లో గుడారాలు ఏర్పాటు చేసి రాకుమారులకు
విలువిద్యలో మెలకువలు నేర్పుతున్నాడు రాజగురువు.
కోయ తిప్పడు రోజూ వచ్చి పొదల మాటున దాగి రాకుమారులతో
పాటు విలువిద్య అబ్యసించాడు.
విల్లంబుల నేర్పరితనం ఖడ్గ యుద్ద తంత్రాలు పూర్తయి రాజకుమారులు గురువుతో కలిసి రాజధానికి వెళిపోయారు.
కొద్ది సంవత్సరాల తర్వాత రాకుమారులు అడవి వెంబడి వెల్తుండగా
ఒక సింహం అకస్మాత్తుగా వారిపై దాడి చేసింది. రాజకుమారులపై
లంఘించిన సింహానికి ఎక్కడి నుంచో వచ్చిన బాణం తగిలి కిందపడింది.ఈ దట్టమైన అడవిలో తమని ఎవరు కాపాడారని ఆశ్చర్య
పోయారు రాకుమారులు.
బలిష్టమైన శరీర సౌస్టవం నార వస్త్రాలు ధరించి వీపున విల్లంబులు
శిఖముడి గెడ్డాలు మీసాలు తలపై నెమలి ఈకలతొ ఎరుకల తిప్పడు
ఎదురొచ్చాడు.
ఆజాను బాహుడైన కోయ దొరలాగున్న తిప్పడిని గుర్తించలేని రాజ
కుమారులు" ఎవరు నీకు బాణం విద్య నేర్పిన గురువు ?" అని గద్దించారు.
తిప్పడు వినయంగా చేతులు జోడించి "నా కెవురు గురువులు లేరు,
చూసి నేర్చుకున్నా నని కొద్ది సంవత్సరాల కితం అడవిలో రాజగురువు
రాకమారులకు విలువిద్య నేర్పిన విషయం "చెప్పాడు.
రాకుమారులు రాజధానికి తిరిగి వెళ్ళిన తర్వాత గురువు గారికి
జరిగిన సంఘటన వివరంగా చెప్పారు. విషయం తెలిసిన రాజగురువు
కోయ యువకుడి ఏకాగ్రతకు ఆశ్చర్యపోయారు.
ఆ యువకుడిని అణచపోతే విలువిద్యలో రాజకుమారుల్ని మించిపోతా
డని స్వార్ధబుధ్ధితో ఒక ఉపాయం ఆలోచించాడు.
వెంటనే రాజభటుల్ని అడవికి పంపి కోయ తిప్పడిని రాజధానికి రప్పించాడు.
" నువ్వు బాణం విద్య ప్రత్యక్షంగా నేర్చుకున్నా పరోక్షంగా నేర్చుకున్నా
నీకు గురువును నేనే , కాబట్టి నాకు గురుదక్షిణగా ఏమిస్తావని " అడిగారు రాజగురువు.
"సామీ , తమకి ఏం కావాలో సెలవియ్యండి.భేసుగ్గా ఇత్తాను." అన్నాడు
వినయంగా చేతులు కట్టుకుని.
" సరే, నీ కుడి చేతి ఐదు వేళ్ళు నాకు కానుకగా సమర్పించు" అన్నారు
రాజగురువు.
గురువు కోరిక విని స్థబ్దుడయాడు కోయ తిప్పడు.అడవిలో రాజ
కమారుల్ని సింహం బారి నుంచి రక్షించి నందుకు మెచ్చి కానుకలు
ఇత్తారనుకుని ఆనందంగా వచ్చిన తిప్పడికి శరాఘాతమైంది.తన బాణం
ఊస ముందుకు పోవాలంటే కుడి చేతివేళ్ళు ఉండాల్సిందే.
మరేం ఆలోచించకుండా తన నడుముకు వేలాడుతున్న కత్తి తీసి
ఎడమ చేత్తో కుడి చేతిని మణికట్టు వరకూ నరికి రాజగురువు పాదాల
వద్ద సమర్పించాడు వినయంగా.
కోయ యువకుడి గురుభక్తికి అక్కడి వారందరు ఆశ్చర్యపోయారు.
తన మనోవాంఛ నెరవేరి నందుకు ఆనందపడ్డాడు రాజగురువు.
* * *
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి