ఒక అడవిలో కుందేళ్లు ఉండేవి. అడవిలో దొరికినవి తింటూ, క్రూరజంతువుల కంటపడకుండా, పొదల్లో దాక్కుంటూ జీవించేవి.వాటిలో చంటి అనే కుందేలుకు ఈ పద్దతి నచ్చలేదు. తనను చూసి జంతువులు భయపడాలని, గౌరవించాలనుకునేది. తన పంతం నెగ్గించుకోవటానికి పామును పొగడ్తలతో ముంచుతూ స్నేహం చేసింది. పాముతో కలిసి అడవిలో గర్వంగా తిరిగేది.కుందేలును గౌరవించకుంటే పాముతో చాడీలు చెప్పి, ఎక్కడ తమకు కాటువేసే ప్రమాదం తెస్తుందోనని జంతువులు భయపడేవి.కుందేళ్ళతో సహా చాలా జంతువులు ఆ కుందేలు పట్లభయభక్తులతోఉండేవి.ఒక రోజు ఒక ముసలి కోతి కుందేలుతో "పాము విష జంతువు. చెడ్డవారితో స్నేహం మంచిది కాదు. ఎప్పటికైనా చేటు చేస్తుంది"అంది.కుందేలు పొగరుగా తల ఎగరేసి" నువ్వు నా అభివృద్దిని, నాకు లభిస్తున్న గౌరవాన్ని చూసి ఓర్వలేకున్నావని అర్థమవుతూనే ఉంది.నీ కల్లబొల్లి నీతులు కట్టిపెట్టు"అని అరిచింది.కుందేళ్ళు చెప్పినా అది వినలేదు.ఒక రోజు పాము కడుపు నిండా కప్పలను తిని, ఓ చెట్టు క్రింద బడలికతో, అయాసంతో ముడుచుకుని పడుకుని ఉంది.ఆ సమయంలో కుందేలు వెళ్ళి, పామును గట్టిగా కదిపి లేపింది. పాము విసుగ్గా కోపంగా లేచి వెనుకా ముందూ ఆలోచించకుండా కుందేలును కాటువేసి, ముడుచుకుని పడుకుంది. చెట్టు మీదనున్న కోతి చూసి క్రిందకుదిగి వచ్చింది. కాటు వేసిన చోట గట్టిగా నొక్కి కొంత విషం బయటకు వచ్చేలా చేసింది. పాము కాటుతో విలవిలలాడుతున్న కుందేలును అక్కడ నుండి కొంతదూరం తీసుకెళ్ళింది. తనకు తెలిసిన ఆకులు తెచ్చి, నూరింది. ఆకు పసరును కుందేలు చెవుల్లో వేసింది.తాగించింది.కాటు వేసిన చోట పసరు రాసింది.కొంతసేపటి తర్వాత కుందేలు కోలుకుంది."చెడ్డవారితో తిరగడం ప్రమాదమని నేను ముందే చెప్పాను. వాళ్ళ నుండి ఎప్పుడు ఏసమస్య వస్తుందో చెప్పలేము. వాళ్ళతో తిరగటం వల్ల లభించే మర్యాదలు తాత్కాలికంగా భయంతో వచ్చేవే కాని అభిమానంతో వచ్చేవి కాదు. మంచి తనంతో, మంచి వారితో స్నేహంతో మనకు లభించే గౌరవం నిజమైనది. శాశ్వతమైనది."అంది కోతి.కుందేలుకు కనువిప్పు కలిగింది. తర్వాత ఎప్పుడూ కుందేలు పాము కంటపడలేదు.
గౌరవం: --డి.కె.చదువుల బాబు .3/528 వై.యం.ఆర్. కాలనీ.ప్రొద్దుటూరు.వై.యస్ ఆర్. కడపజిల్లా…516360
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి