వానలో తడవకు, ఆడకుజలుబు చేస్తుందన్నా
తప్ప తడిసి ఇంటికొచ్చిన నా తలను
తన కొంగుతో తుడుస్తున్న అమ్మను
అడిగాను....
"మరి నీకు జలుబు రాదాని..."
రాళ్ళ దారమ్మట నడిస్తే
పాదాలకు నొప్పెడుతుందని
వీపుమీద మోస్తూ పోతున్న అమ్మను
అడిగాను....
"మరి నీ పాదాలకు నొప్పుండదాని"
గిన్నెలో పిడికెడు అన్నమే ఉన్నాసరే
నా పొట్ట ఆకలితో ఏడుస్తుందని
అంతన్నము నాకు పెట్టేసి
నీళ్ళు తాగి పడుకోబోతున్న అమ్మను
అడిగాను
"మరి నీకాకలి వేయదాని"
నాకేదన్నా బాధ కలిగి
నేను నిద్రపోలేక
కళ్ళు బరువెక్కుతాయని
పడుకోరా కన్నా నేనున్నాగా
నీకంటూ
తెల్లవార్లూ పడుకోని అమ్మను
అడిగాను
"మరి నీ కళ్ళు బరువెక్కవాని"
ఏదన్నా అల్లరి పనులు చేసి
నాన్న కొట్టడానికొచ్చినప్పుడు
ఏదో తెలీక చేసాడండి
పిల్లలు కాకపోతే
మనం చేస్తామా అంటూ
అడ్డుపడే అమ్మను
అడిగాను
"మరి నీకు కోప్పడటమే తెలీదాని"
ఆడాడి కాళ్ళ నొప్పులతో
ఇంటికొచ్చినప్పుడు
కాళ్ళొత్తుతూ
కాస్సేపు కూర్చోవచ్చు కదరా అనే అమ్మను
అడిగాను
"మరి రోజంతా మాకోసం పనులు చేసే నీ కాళ్ళెప్పుడూ నొప్పెట్టవాని"
ఎక్కిళ్ళొచ్చినప్పుడల్లా
తలిచేది నా కొడుకేగా అని
అనుకునే అమ్మతో
చెప్తానెప్పుడూనూ
"నాకు మరో జన్మంటూ ఉంటే
నువ్వే నాకు మళ్ళీ అమ్మవు కావాలమ్మాని..."
అమ్మతో...:-- యామిజాల జగదీశ్
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి