సామెత కథ : - బిందు మాధవి

 ఆవు చేలో మేస్తే, దూడ గట్టున మేస్తుందా?

‘ఉమ’ ఆదివారం కదా అని కాస్త ఆలస్యంగా లేచి బద్ధకంగా కాఫీ కప్ పుచ్చుకుని బాల్కనీ లో కూర్చుని రోడ్ మీద వచ్చి పోయే వాళ్ళని చూస్తూ కాఫీ తాగుతున్నది. ఇంతలో బెల్ మోగింది, పని మనిషి వచ్చి ఉంటుంది అని లేచి వెళ్ళి తలుపు తీసింది.
పనిమనిషి ‘లక్ష్మి’ దిగాలు మొహం వేసుకు వచ్చింది. ఉమ ఏం జరిగిందని అడిగింది.
‘మా పిల్లగాడు, మా ఇళ్ళదగ్గరే ఉన్న అమ్మాయి వెంట పడి రోజూ వేధించి ప్రేమించు, ప్రేమించమంటూ గొడవ చేస్తున్నాడమ్మా. నిన్నటి రోజున ఆ పిల్ల పని చేసే చోట్నించి తిరిగి వస్తుంటే, దారి కాచి మీద యాసిడ్ పోసేటప్పటికి చుట్టుపక్కల వాళ్ళూ చూసి పట్టుకుని నాలుగు తగిలించి పోలీస్‌లకి అప్పగించారమ్మా’ అని ఏడుస్తూ చెప్పింది.
‘ఇవ్వాళ్ళేమో ఆదివారం, ఎవరి కాళ్ళైనా పట్టుకుని విడిపించు కుందామంటే వీలవదమ్మా’ అన్నది. అదీ కాక ‘నా మగడేమో తాగి ఒళ్ళు తెలియని స్థితిలో పడున్నాడు. ఈ స్థితిలో పోలీస్ ల దగ్గరకి వెళితే వాళ్ళు వీడిని కూడా నాలుగు తగిలిస్తారమ్మా’ అని చెప్పింది.
‘నా మొగుడు సరైనవాడైతే ఇంత బాధలెందుకుంటాయమ్మా, వాడు ఇంట్లో ఉంటే ఒంటరిగా నా కూతుర్ని వదిలివెళ్ళాలంటేనే భయమమ్మ. రోజులు బాగా లేవు, ఈ మగ వెధవలకి బుద్ధులు సరిగ ఉంటం లేదమ్మా, వావి వరస లేకుండా చిత్త కార్తె కుక్కల్లాగా ప్రవర్తిస్తున్నారు, కూతురని కూడా చూట్టం లేదమ్మా. తండ్రే అట్టా ఉంటే ఇంక కొడుక్కి బుద్ధి ఏం చెప్తాడమ్మా’ అని తన ఘోష వెళ్ళపోసుకుంది.
‘ఈ తాగుడు మూలాన ఇల్లు గుల్ల అవటం కాక పెయ్య మీద, బుద్ధిమీద ఏ మాత్రం సోయ ఉండట్లేదమ్మా’ అన్నది.
“ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా” అనుకున్నది ఉమ.