స్కైల్యాబ్.:-- వసుధారాణి.

 ఈపదం చూడగానే మీకు సగం కబురు అర్ధం అయిపోయి వుంటుందనుకుంటాను.మా చెప్పొచ్చావులే అనుకోకండి.కాకమ్మ కబురుకు,మామూలు విషయానికి సహస్రం తేడాలుంటాయి మరి.
బడిలో ఉండగా ఓ రోజు మా అందరిలోకి కాస్తంత తెలివిగా ఉండే ప్రయాగ జ్యోతి అన్న పిల్ల ఓ కబురు చెప్పింది .స్కైల్యాబ్ అనేది ఒక ఉపగ్రహం అని అది దాని లైన్ తప్పిపోయి కూలిపోతుందని.మొత్తం భూగోళంలో ఎక్కడైనా పడచ్చోని.ఒకవేళ అది పడితే ఆటం బాంబుఅంత పేలుడు వచ్చి అందరం చచ్చిపోతామని. 
అదిమొదలు ఇంక ప్రతిరోజు బడి మొదలయ్యే ముందు టీచర్ క్లాసుకు వచ్చేవరకు,ఇంట్రవెల్లులో, లంచ్ బ్రేక్లో, ఇంటికి పోయేటప్పుడు పిల్లలందరికీ ఇవే మాటలు అక్కడ పడుతుంది,ఇక్కడ పడుతుంది .భూమి అంతమైపోయేదాకా పోయాయి  ఈ అనంతమైన పుకార్లు.
ప్రాణస్నేహితులైన పిల్లలు ప్రమాణాలు చేసుకోవటం జలమ జలమకి మనమే ఫ్రెండ్స్ లాగా పుట్టాలని, నచ్చిన రబ్బర్లు ,పెన్సిళ్ళు ఒకరికి ఒకరు ఇచ్చి పుచ్చుకోవడం.కొందరికి క్లాసులో నచ్చిన ప్లేసులు ఉంటాయి అంతకుముందు ఎంత బతిమాలినా  వేరేవాళ్ళని చచ్చినా  కూర్చోనివ్వని వాళ్ళు కూడా నువ్వు రొండ్రోజులు కూర్చోలే అని త్యాగాలు చెయ్యటం.మొత్తం స్కైలాబ్ ఫీవర్ నడిచేది క్లాసులో.
పిల్లలు  తమలో తాముగుడుగుడు లాడుకోవటమే కాదు, టీచర్లు కూడా మాట్లాడుకునే వాళ్ళు ఈవిషయాలు.ఒకరిద్దరు టీచరమ్మలు నచ్చిన చీరెలు కూడా ఎక్స్సేంజ్ చేసుకున్నారు కూడా పాపం మోజుతీర్చుకోవటం ఏమో.
ఇంత విషాదంలో పిల్లలు ఉండగా నాకు అసలు పెద్దవిషాదం ,ప్రిస్టేజ్ ప్రాబ్లమ్ వచ్చి పడింది. అదేంటంటే ఇంక ఎలాగూ పోతున్నాం అని ప్రజలు నానా రకాల ఇష్టమైన  వంటలు వండుకుని తినటం మొదలు పెట్టారు. బళ్ళో పిల్లలు రకరకాల పిండి వంటలు తెచ్చుకోవటం, స్కైల్యాబ్ పడుద్దని మా అమ్మే అరిసెలు సేసింది నాకిష్టమని. ఇలా తలా ఒకరకం చేసుకుని తినటం ఇళ్లల్లో. 
మరి మా అమ్మకూడా నాకు ఇష్టమైనవి చేసి పెట్టాలి కదా లేదే,పైగా అడిగితే ఒకవేళ నిజంగా అంత ప్రళయమే వచ్చి అంతా పోతుంటే బాధ పడాలికానీ పిండివంటలు వండుకుంటారా ? అని అరిచింది.మా ఇంట్లో స్కైల్యాబ్ సెలబ్రేషన్స్ లేకపోవటం నాకు చాలా అవమానంగా ఉండేది.అమ్మా దీపావళిదాకా మనం బతకమట ,టపాకాయల బదులు ఇప్పుడు మైసూర్ పాకు చెయ్యమని అడిగా ,అయినా ఎప్పుడు అసలు పండగలతో ఏమీ సంబంధం లేకుండానే పిండివంటలు, చిరుతిళ్ళు చేసి పెట్టే మా అమ్మ స్కైల్యాబ్ సీజన్ అంతా ఏమి చెయ్యలా అదేంటో.
అలా స్కైల్యాబ్ కాలం నాకు చాలా గడ్డుకాలంగా గడిచింది.ఈలోగా అది కూలిపోయే రోజు దగ్గరికి వచ్చింది .పాపం మా అమ్మమీద చాలా జాలికలిగింది నాకారోజు , సాయంత్రం బడి నుంచి వస్తామో రామో పిల్లకి ఒక్క మైసూర్ పాక్ ముక్కకూడా చేసి పెట్టికో లేదు ఈవిడ అని.
జనమంతా ప్రాణం గుప్పిట్లో పెట్టుకుని అది కూలిపోయే రోజున ఇళ్లల్లోనించి బయటకు రాకుండా కూర్చున్నట్లు గుర్తు నాకు.ఐనా ఒకవేళ స్కైలాబ్ కూలితే ఇంట్లో ఉన్న వాళ్ళ మీద,ఎగస్ట్రా బరువు ఇల్లు ఒకటి కాదా ?