మా ఊరి సంక్రాంతి.: - వసుధారాణి

 భక్తి ప్రపత్తులతో జరుపుకునే పండగల మాట అటుంచితే ,కేవలం వినోద ప్రధానమైన పండుగలు కూడా ఉన్నాయికదా మనకి.సంక్రాంతి ఆ కోవలోకి వచ్చే పండుగ.
ఇప్పుడంటే గాలి పటాలు కొనుక్కుని ఎగరేసుకుంటున్నారు కానీ,సంక్రాంతి వస్తే మేము ఇంటిని ఓ చిన్నసైజు గాలి పటాల వర్క్ షాప్ చేసే వాళ్ళం.సాధారణంగా సంక్రాంతికి మిగిలిన  నా వయసు ఆడపిల్లలు ముగ్గులు గట్రా నేర్చుకుంటూ అచ్చన గిల్లాలు ఆడుకుంటుంటే. నేను,మా చిన్నారి, కిషోర్ కలిసి గాలిపటాలు కట్టే వాళ్ళం.
పటమంతా కట్టిన తరవాత సూత్రం వేయటానికి కొన్ని లెక్కలుంటాయి మనకున్న తిక్కకి ఆలెక్కలు అర్ధం కాక ,పటాన్ని పూర్తిగా తయారు చేసి మా బావగారి చేత సూత్రం కట్టించుకునే వాళ్ళం.తోకలేని గాలిపటంలా ,దారం లేని గాలిపటం ఉంటే బాగుండు కదా ఈ సూత్రం గోలలేకుండా అనుకునేదాన్ని.
గాలిపటం తయారయ్యాక కాలేజీ గ్రౌండుకు వెళితే అక్కడ, వేరే వేరే పిల్లలతో ఎగరేసే పోటీ .మన గాలిపటం దారంతో వేరే వాడి గాలి పటాన్ని గాల్లోనే కోసేయాలి.అందుకని స్పెషల్ దారం తయారు చేసుకునే వాళ్ళం.దారానికి అన్నం,గాజుపెంకులు మెత్తగా నూరి పూస్తే గట్టిగా ఉంది పక్క వాళ్ళ దారాన్ని పుటుక్కున తెంచేస్తుంది.
ఎత్తులో స్టడీగా ఎగిరే గాలిపటానికి ఉత్తరాలు పంపటం ఒక ఆట.రౌండ్ పేపర్ ముక్కకి చిన్న హోల్ పెట్టి గాలిపటం దారం తెంపి జాగర్తగా ఈపేపర్ ముక్కని,సిగరెట్ పెట్టె ని ఎక్కిస్తే అవి పైన ఎగిరే గాలిపటం దగ్గరికి వెళ్లాలి..ఉత్తరం దేవుడికి వెళ్తుంది అని, కోరికలు రాసి పంపచ్చని దానికి పావలా టికెట్ కూడా పెట్టాం ఒకసారి .మొత్తానికి ఆ సంవత్సరం మా దారం ఖర్చులు వెళ్లిపోయాయి.
కోడి పందాలు లేవుకాని, రైతులు పెట్టుకునే ఎడ్ల పందాలు, బండి లాగుడు పందేలు చూచే వాళ్ళం.పశువులకి శుభ్రంగా స్నానం చేయించి వాటిని అలంకరించి కొమ్ములకి రంగులు పూసి భలేగా తయారు చేసేవాళ్ళు.
భోగి రోజు చేసే పులగం ,గోంగూర పులుసుకూర,రేగుపళ్ల పచ్చడి, కాంబినేషన్ మా గుంటూరు మార్క్.మార్చి పోలేని రుచి.