బక్కపలుచన :--కె ఎస్ అనంతాచార్య

 కంటికి లోకువై
నోటికి ఆనని నక్క వినయపు
 భోజనాల వడ్డింపు

పిలుపులో ఏదో  తగ్గిపోయి అంచనాలో
ఆర్ద్రత మలకబడి ఏలికతో చేతులు కలిపి  వార్చేసిన  పరువు మాటలలో మిగలని మినరల్స్
పోలికల్లో గెలిచేస్తూ
బరువులో దూదిని దూస్తూ
ఆరవేసే అధికారం అందిపుచ్చుకున్న అహంకారం
అట్లా ఉండటమే నేరమై
బోనులో నిలబెట్టే అనధికార
 అమ్మలక్కల వీధి కోర్టు
హర్టవుతారని తెలిసీ కాగితం విమానం లాంటి  సెటైర్ తో
గీసుకు పోయే మనసు పొరలు
రూపు రేఖల లెక్కల కొలతలు
 విధాత కలం గీతలు తీరని వెతలు
తీరం దాటని
దుఃఖపు తుఫాను 
సృజించేఅనల్ప పీడనా లు
పలుచని రొట్టెమీద నాలుక కన్నులు ఎండ తాపాన్నీ హరించే దుస్తుల కొరకు
మేను వెతుకులాట ఇవన్నీ
బతుకు చిత్రం 
కోతి చేష్టల కు చేవలుడిగే  ప్రాణాలు
పరిపూర్ణత లేని  ప్రవర్తనలో చిక్కి 
విల విల లాటల అక్కు పక్షులు
ఒక్క మనిషి బ్రిటీష్ ను
గడ గడ లాడించి స్వాతంత్ర్య సిద్ధికి 
ఎదురొడ్డి  చూపిన ప్రతాపం స్ఫూర్తి రూపం
ఎట్లా ఉంటేనేo ? 
పది మంది లో పారిజాతమై పరిమళించి
నలుగురి హృదయాల ఓటయై
వందమందిలో 
వాణి  చెల్లితే చాలు 

కామెంట్‌లు