పుట్టుమచ్చ :-కె ఎస్ అనంతాచార్య

 ఏదో  ఆశ్చర్యం
ఎందుకు వెతుకుతున్నారో
తెలియని అమాయకత
నీ కేం కాదులే అమ్మ భరోసా
  పట్టి పట్టి పరిశీలన
  సంతలో వెతికి పట్టుకున్న  వస్తువులా అడ్మిషన్ ఫారం
 మీద అతికించే ఆనవాలు
అమ్మ దిష్టి తగలకుండా
చిన్నతనంలో పెట్టె చుక్క 
ఆమె ప్రేమాకాశపు
  మూల చుక్క 
తెల్లటి స్తరం మీద
నల్లగా గుండ్రంగా 
అమావాస్య  చీకట్లో
మిల మిల మెరిసే  చర్మ తారక
అమ్మ నాన్నల కానుక
పేరుకన్నా ఎక్కువ విశ్వాసం 
ఊరికన్నా మిన్న 
చిరునామా  అర్జీ పత్రం లోని ముఖ చిత్రం 
శాస్త్రం చెప్పే అదృష్టాల మాట పక్కనుంచి విధాత  మదిలో శాశ్వతంగా మరిచిపోకుండా కట్టుకున్న  ఆనవాలు మూట
పెళ్లినాటి బుగ్గ చుక్క యై
మెరిసే పెట్టు వన్నె
దిష్టిని తొలగిస్తుందనే సమాజం లో మొలిచిన నమ్మకం
మీసాల మీద కూచుండి
బెదిరించే దొంగ రాజు
గాట్లు గాట్లు గా బీభత్సం 
ప్రదర్శించే రంగాలంకరణ
ఎంత రాజసమో యోగ్యతా పత్రo లో
చిత్రం గా  రాయబడిన
దేహ దస్తూరి
తప్పి పోయిన  బాలుడిని పట్టుకోవడానికి చేసే పురాతన ప్రయత్నం  
మచ్చలేని మహత్యం
చిన్నదైనా ఎక్కడో మెరుస్తూ మురిపించే సొగసరి అందమైన గడసరి

కామెంట్‌లు