రెండు రోజులుగా బద్ధకం గురించి రాద్దామని అనుకుంటుంటే యమ బద్ధకం ఆవురించిది నాకు .కనుక కాకమ్మకబురు కాస్త ఆలస్యం అయ్యింది.అసలు బద్ధకం విషయం మీద ఎవరికైనా phd ఇవ్వదలిస్తే వారెవరో మాఇంటికి వచ్చి ఇచ్చిపోవచ్చు.ఎందుకంటే అక్కడదాకా రావటానికి బద్ధకం మరి.చిన్నప్పటి నుంచి నాకో అలవాటు ఉంది అమావాస్యకో,పౌర్ణమికో నాకు ఉదయాన్నే ఇవాళ బద్దకంగా ఉందాం అని అనిపించేస్తుంది.ఇంక చూసుకోండి ఆ భావన నాకు కలిగిన తర్వాత ఇంక నా బద్ధకం నామాట కూడా వినేది కాదు.నిద్రలేవాల్సిన టైం చాలా మించిపోయి ఇంకా పడుకుని ఉంటే మా అమ్మకి అర్దం అయిపోయేది ఇంక ఆవాళ్టికి నామీద ఆశలు వదులుకోవచ్చని ఏపనికీ ఇంక పనికి రానని.పడుకోవటానికి విసుగువచ్చేంత సేపు మంచమీదపడుకుని పొర్లి .ఏ భోజనము టైం కో లేచి.దొడ్లో వేపపుల్లని తుంచి (రోజు పేస్టు వాడినా సరే బద్ధకానికి నోట్లో వేపపుల్ల సింబాలిజం భలే ఉంటుంది.)పెరటి గోడ మీద కూర్చుని పుల్లని మెల్లగా నమిలి పుల్లయక్కడ అరిగిపోతుందో అన్నంత మెల్లగా చెయ్యి కదిలించి పళ్ళు ఓ అరగంట పాటు తోమి. బద్ధంకం రోజు కాలకృత్యాలు తప్పించి స్నానం కి సెలవండోయి. తినాలి గాబట్టి ఏదో కొంచెం తిని మళ్ళీ మంచం ఎక్కి అలా పడుకోవడం . మెడదుకూడా వీలయింత వాడకుండా నిర్వికారంగా ఓ గొప్ప సమాధి స్థితిలో ఉండేదాన్ని.బద్ధకం అంటే విసుగు పుట్టేంతగా ఆరోజంతా రికామిగా గడిపేసే దాన్ని.అయితే ఒక్కరోజు పూర్తి స్థాయి బద్ధకం మర్నాటి నుంచి ఎంత హుషారు ఇచ్చేదంటే మరి కొన్ని రోజులు నా శక్తికి మించిన పనులు కూడా అవలీలగా చేసేసే శక్తి వచ్చినట్లు ఉండేది.పెద్దయ్యాక జిడ్డు కృష్ణమూర్తి గారి పుస్తకం చదువుతున్నప్పుడు.సోమరితనం గురించి ఆయన ఏమిచెప్పారంటే "నువ్వు సోమరిగా ఉండాలని నిర్ణయించుకున్నప్పుడు పూర్తి స్థాయి సోమరిగా ఉండు." అని.అంతే ఆమాట తెగనచ్చేసి కృష్ణమూర్తి గారి భావాలకి జిడ్డులా అతుక్కుపోయా.మొత్తం భూప్రపంచం అంతా మనభుజస్కందాల మీదనే నడుస్తోంది అన్న ఫీలింగ్ పక్కన పెట్టి అప్పుడప్పుడు ఓ రోజు బద్ధకాన్ని పిలిచి చూడండి.
మహాబద్ధకం.:- వసుధారాణి.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి