సామెత కథ : బిందు మాధవి


 ఈన కాచి నక్కల పాలు చేసినట్లు!


రవి ఇంటర్మీడియెట్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. మంచి తెలివైనవాడు. ముందు నించీ అన్ని క్లాసుల్లోను ఫస్ట్ మార్కులతో పాస్ అవుతూ వస్తున్నాడు.

ఇప్పుడు కూడా సంవత్సరం మొదటి నించీ ఒక పద్ధతి ప్రకారం సిలబస్ అంతా చదవటం పూర్తి చేసి ‘పరీక్షలకి’ బాగా తయరయ్యాడు. ‘స్టేట్ ర్యాంక్’ కూడా వస్తుందని ఆశిస్తున్నాడు. ‘ఆల్ ఇండియా పరీక్షలకి’ కూడా కోచింగ్ తీసుకుని అవి కూడా రాస్తున్నాడు.

‘యాన్యుయల్ పరీక్షలు’ వచ్చాయి. తల్లిదండ్రులు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ముందుగానే వాళ్ళ ఉద్యోగాలకి సెలవలు పెట్టి, రవికి పరీక్షల సమయంలో ఏ విధమైన అనారోగ్య సమస్యలురాకుండా ఉండేందుకు తగుజాగ్రత్తలతో సహా సర్వ సన్నద్ధంగా ఉన్నారు.

పరీక్షల టైం టేబుల్ ఒకటికి రెండు సార్లు పై నించి కింద దాకా చూసి, అందులో ఏమైనా సెలవలు వస్తున్నాయా, వస్తే ఏ సబ్జెక్ట్ కి వస్తున్నది లాంటి వివరాలు క్యాలెండర్ లో నోట్ చేసి పెట్టుకున్నారు.

పరీక్షలు మొదలయ్యాయి. ఒక్క నిముషం ఆలస్యమైనా లోపలికి పంపరని, ముందుగానే పరీక్షహాల్ కి చేరుకునే ఏర్పాటు చేసుకున్నారు. నాలుగు పరీక్షల వరకు అంతా సవ్యంగానే జరిగింది.

అయిదో పరీక్ష రోజున చాలా ముందుగా తయారైన కారణాన, హాల్ కివెళ్ళే దారిలో ఉన్న దేవాలయఆనికి వెళ్ళి దైవదర్శనం చేసుకుని వెళ్దామని రవి అంటే వాళ్ళ నాన్న గారు, పోనీలే ఏదోసెంటిమేంట్ అని గుడికి తీసుకెళ్ళారు. దైవ దర్శనం అవగానే బయటికి వచ్చి గబ గబా స్కూటర్ తీసి రోడ్ ఎక్కుదామని అనుకుంటూ ఉండగా, అక్కడ పోలీసులు ట్రాఫిక్ మొత్తం ఆపేసి ఎవ్వరినీ వెళ్ళనివ్వటం లేదు.

‘ఏమి జరిగిందని’ వాకబు చేస్తే, ముఖ్యమంత్రి గారు వాళ్ళ మనవడి పరీక్ష నిమిత్తం అర్చన చేయిద్దామని అదే దేవాలయానికి వచ్చారు, అందువల్లా ట్రాఫిక్ ని ఆపారు అని తెలిసింది.

పాపంరవికి పరీక్ష టైం అయిపోతున్నది. రవి తండ్రి ఎంత చెప్పినా పోలీసులు వినిపించుకునే స్థితి లోలేరు. రవి హాల్ టికెట్ కూడా చూపించాడు. అయినా వీళ్ళని ‘పోలీసులు’ వదల లేదు. పైగా ఒక్క రెండు మూడు నిముషాల్లో ‘సీయెం’గారు వెళ్ళిపోతారు, పరీక్షకి ఇంకా ఉన్న టైం సరిపోతుందని ఉచిత సలహా ఇచ్చారు.

రవి తండ్రి కి బీపీ పెరిగిపోతున్నది. ఒక పది నిముషాల తరువాత ట్రాఫిక్ ని వదిలారు కానీ, అన్ని వాహనాలు ఒకేసారి వదలటం వల్ల ‘ట్రాఫిక్ జాం’ అయి రవి ‘టైం’ కి పరీక్ష హాల్ కిచేరలేక పోయాడు. అయిదు నిముషాలు ఆలస్యం అయింది. విషయం అంతా వివరం గా చెప్పినా వాళ్ళు కనికరించలేదు. కాళ్ళా వేళ్ళా పడ్డా రవిని పరీక్ష వ్రాయనివ్వలేదు.

దీనితో రవి, అతని తండ్రి కూడా తీవ్ర మానసిక ఒత్తిడి కి గురయ్యారు. ఉసూరుమంటూ ఇంటికి వచ్చేటప్పటికి, రవి తల్లి చూసి ‘ఇదేమిటి పరీక్ష కి వెళ్ళకుండా ఇంటికొచ్చారేమిటి’ అని కంగారు పడింది.

జరిగిందంతా చెప్పేటప్పటికి నిస్త్రాణతో చతికిలపడి అయ్యో "ఈన కాచి నక్కలపాలు చేసినట్టు" పరీక్షల మధ్యలో ఎన్నడు లేనిది, ‘ఈ గుడికి వెళ్ళటమేమిటి’, ‘అదేటైం కి ట్రాఫిక్ జాం ఏమిటి’ కర్మ కాకపోతే అని తలపట్టుక్కూర్చుంది. ఇప్పుడు ఇంటర్మీడియెట్ పరీక్ష ఇలా అయితే, సంవత్సరం వృధా అయి తరువాత స్థాయి పరీక్షల పరిస్థితి ఏమిటి’ అని కళ్ళ నీళ్ళు పెట్టుకుంది.

* * *