స్వామి వివేకానంద:-- యామిజాల జగదీశ్
 అది కలకత్తాలో ఓ నాటక మందిరంలో ఓ నాటకాన్ని ప్రదర్శిస్తున్న వేళ. ప్రేక్షకులు 
నాటకం చూడటంలో మునిగిపోయారు. 
ఇంతలో ఉన్నట్టుండి వేదికపై 
ఓ సన్నివేశం. 
ఆ సన్నివేశం ఏమిటంటే... 
నాటకంతో ఏ మాత్రం సంబంధం లేని కొన్ని పాత్రలు వేదికపై ప్రత్యక్షమయ్యాయి.... 
దీంతో ప్రేక్షకులలో గందరగోళం. 
అప్పటివరకూ సాగిన నాటకంలో ఓ ముఖ్యపాత్రధారి ఎవరి దగ్గరో కొంత డబ్బు అప్పుగా తీసుకున్నారు. 
ఆ కారణంగా అప్పు తీసుకున్న నటుడిని అరెస్టు చేయడానికి బ్రిటీష్ పోలీసులు అరెస్టు వారెంటుతో వేదికపైకి రంగప్రవేశం చేశారు. 
ఈ విషయం క్షణాల్లో ప్రేక్షకులకు తెలిసింది. కానీ వారందరూ వేదికపై జరుగు తున్నదంతా మౌనంగా చూస్తున్నారు.
అప్పుడు ఓ కుర్రాడు పోలీసులను చూసి గట్టిగా మాట్లాడాడు. ఆ గొంతు పోలీసులపై పిడుగుపడ్డట్టుగా ఉంది. 
ఆ కుర్రాడు ఏం చెప్పాడంటే
"పోలీసులారా! వేదికపై నుంచి తక్షణమే వెళ్ళిపోండి...మీరు ఎవరినైతే అరెస్టు చేయాలనుకున్నారో అతనిని నాటకం ముగిసిన తర్వాత ఆ వ్యవహారం కానిచ్చుకోండి. నాటకం రసవత్తరంగా సాగుతుంటే వేదికపైకి వచ్చి ఇలా గందరగోళం సృష్టించడం సబబు కాదు. కనుక వేదిక దిగండి..."
కుర్రాడి గొంతు సింహగర్జనలా ఉండి పోలీసులకు హెచ్చరికలా అనిపించింది. 
కుర్రాడి గొంతులో రవ్వంత భయం లేదు. మాటల్లో తడబాటు లేదు. 
ఆ మాటలు విని పోలీసులు 
విస్తుపోయి ఆ కుర్రాడి వంక చూస్తున్నారు. 
ఇంతలో ప్రేక్షకులు కూడా కుర్రాడితో తమ గొంతు కలిపి "పోలీసులారా! వేదిక దిగండి! నాటకం అయిపోయేంత వరకూ ఆగండి! ఆ తర్వాత మీరొచ్చిన పని కానివ్వండి!" అని గట్టిగా అరిచారు.
దాంతో పోలీసులు చేసేదేమీ లేక వేదిక మీద నుంచి కిందకు దిగారు.
 సరైన సమయంలో ధైర్యంగా మాట్లాడిన కుర్రాడిని ప్రశంసించారు. 
ఈ సంఘటన జరిగేనాటికి ఆ కుర్రాడి వయస్సు పద్నాలుగేళ్ళు. 
తర్వాతి కాలంలో ఆ కుర్రాడు పెరిగిపెద్దవాడై "అనవసర భయాలు వద్దు!" అంటూ జాతికి పిలుపునిచ్చారు.  ప్రజలను తమ ప్రసంగాలతో చైతన్యవంతులను చేశారు. చికాగో సభలో సోదరసోదరీమణులారా అంటూ తమ ప్రసంగాన్ని మొదలుపెట్టి యావత్ ప్రపంచ దృష్టినీ ఆకట్టుకున్న ఆయన ఎవరో కాదు, స్వామి వివేకానంద!