మైసూరు గోల్డ్ లీఫ్ పెయింటింగ్ : -- డా.. కందేపి రాణీప్రసాద్.


 పూర్వం జానపద కళలు ఒక తరం నుంచి మరొక తరానికి మౌఖికంగానే అందేవి. ఈ మధ్య కాలంలో మేధావులు, రచయితలు వాటిని గ్రంధస్తం చేయాలని సంకల్పించారు. ఈనాటి తరం ఎక్కువగా చదువుపై దృష్టి పెట్టడంతో కొత్తతరాలకు ఈ విద్యలు అందుబాటులో లేకుండా పోతున్నవి. అందువలన విశ్వవిద్యాలయాలు ప్రాచీన కలల్ని కాపాడటంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. అలాగే మైసూరు విశ్వవిద్యాలయం జానపద కళల యొక్క ప్రాముఖ్యతను గమనించి వాటినన్నింటిని ఒకచోటికి చేర్చి మ్యూజియంను ఏర్పాటు చేసింది. అంతేకాక స్నాతకొత్తర స్థాయిలో మాస్టర్స్ డిగ్రీని జానపద కళల్లో ప్రవేశపెట్టింది.

చిత్రకళ 17, 18వ శతాబ్దాలలో ఒక ప్రత్యేకమైన రీతిగా స్భివృద్ధి చెందింది/ మైసూరు మహారాజు మూడవ కృష్ణరాజ వడయార్ హయాంలో ఆ ప్రాంతపు కళలన్నిటిని మైసూరు స్కూలు ఆఫ్ ఆర్ట్ పేరుతో అభివృద్ధి చేశాడు. ప్రసిద్దమైన మైసూరు గోల్డ్ లీఫ్ పెయింటింగ్స్ ను జయచామరాజేంద్ర ఆర్ట్ గ్యాలరీలో చూడవచ్చు. ఇంకా ఈ చిత్రాలను మైసూరులోని మహారాజ ప్యాలెస్ లోనూ, శ్రీరంగపట్నం లోని దరియా దౌలత్ బాగ్ లోనూ, బెంగుళూరులోని వెంకటప్ప ఆర్ట్ గ్యాలరీలోను చూడవచ్చు.

ఒక చెక్కముక్కపై గాని వస్త్రంపై గాని పేపర్ను అతికించి సంప్రదాయ మైసూరు పెయింటింగ్ లనువేస్తారు. స్కెచ్ వేసిన తరువాత ఆ బొమ్మలో ఆభరణాలు ఉన్నచోట జెస్సోను వేస్తారు. ఆ తరువాత ఇరవైనాలుగు కారెట్ల బంగారపు రేకును కత్తిరించి ఆభరణాలు ఉన్న ప్రదేశంలో అతికించి చిట్టచివరగా రంగులతో ఫైనల్ టచప్ ఇస్తారు. రంగులన్నీ అద్దాక అరదనికి బాగా ఎండబెడతారు. ఇప్పుడు పేపర్ అతికించిన స్థానాన్ని గుండ్రని రాళ్ళతో రుద్ది పేపర్ ను తొలగిస్తారు. చిత్రానికి ఇంకా మంచి నాణ్యతా రావడానికి తీసేసిన పేపర్ స్థానంలో బంగారు రేకులను అతికిస్తారు. ఇదే మైసూరు గోల్డ్ లీఫ్ పెయింటింగ్ పద్దతి. ఈ చిత్రాల్లో ఉపయోగించడానికి కావలసిన కూరగాయలు.ఖనిజాల రంగులు, అన్నీ చిత్రకారులే సొంతంగా తయారు చేసుకునేవారు. కర్నాటక రాష్ట్రంలోని దేవాలయాల్లోనూ, ఇంకా వివిధ ప్రదేశాల్లోను మ్యూరల్ పెయింటింగ్స్ లెక్కకు మిక్కుటంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా కర్నాటక రాష్ట్ర ప్రజలకు కళల పట్ల ఉన్న మక్కువను తెలియజేస్తున్నాయి. మైసూరు కర్నాటక రాష్ట్రనికి సాంస్కృతిక రాజధాని అనడంలో అతిశయోక్తి ఎంతమాత్రం లేదు.