సామెత కథ : -ఎం. బిందు మాధవి


 ఇనుముతో కూడిన అగ్ని కి సమ్మెట పోటు!


‘కామాక్షమ్మ’గారు మంచి హుషారైన వ్యక్తి. ఎప్పుడు మూర్తీభవించిన చైతన్యమల్లే కళ కళ లాడుతూ తిరుగుతూ ఉంటారు. ఇంట్లో కానీ, బయట కానీ అన్నీ తానే అయి అన్నిటా తానే అయి తిరుగుతూ ఉంటారు.

ఆవిడ పెద్దగా చదువుకోలేదు. భాష రాక పోయినా, ఆవిడకి చేతనైన ముఖ కవళికలు, హావభావాలతో తెలియని భాష వాళ్ళైనా ఎలాగోలా కాలక్షేపం చేసెయ్యగలరు. అది ఒక గొప్ప కళ కదూ మరి!

కొన్నిసార్లు, ఆవిడ ఎంత బాగా విషయ విశ్లేషణ చేస్తారంటే, చదువుకున్న వాళ్ళు కూడా అంతా బాగా లోతుగా ఆలోచించగలరని అనిపించదు.

ఆవిడకి ఒక కొడుకు, కూతురు ఉన్నారు. వాళ్ళకి చదువులు చెప్పించి పెళ్ళిళ్ళు కూడా చేశారు. వాళ్ళ అబ్బాయికి పిల్లనిచ్చిన వాళ్ళు, ఈవిడని ముందు నించీ ఎరుగుదురు కనుక తమ పిల్ల ఈవిడ కోడలుగా సుఖపడుతుంది, పెద్ద కష్టంఏమీ ఉండదని భావించారు.

అక్కడే వచ్చింది చిక్కు. ‘అత్తగారి స్థానం’ లోకి వెళ్ళేటప్పటికి ఆవిడ ‘ఆలోచనా విధానం’ భిన్నంగా ఉండేది. తను చాలా కష్టపడి, ఎన్నో ఇబ్బందులకి ఓర్చుకుని కొడుకుని పెంచి పెద్ద చేసి ఈ రోజు ఉన్న ‘స్థాయి’కి కొడుకు రావటానికి తన కృషే కారణమని ఒక విధమైన అతిశయంగా ఉండేది.

ఎవరో పెద్దలన్నట్లు, ‘మంచీ చెడు’లనేవి కుప్పలు కుప్పలు గా రాశులు పోసి ఉండవు. అలాగే ఎవరి మొహానా వీరు ఇలా ప్రవర్తిస్తారు, అలా మాట్లాడుతారు అని వ్రాసి ఉండదు కదా! 

“అవసరం రానంత వరకు చెడ్డవాడు మంచి వాడుగా మిగిలిపోతాడు, అవకాశం రాగానే మంచివాడు చెడ్డవాడు” గా మారి తన స్వస్వరూపం ప్రదర్శిస్తాడు.

అలాగే, ‘కోడలు’ పెద్ద చదువు చదువుకుని, కలిగిన ఇంటి నించి వచ్చినా ఏదో ఒక అసహనంగా ఉండేది, ‘కామాక్షమ్మ’ గారికి. కొడుకు ‘భార్య’తో సర్దాగా మాట్లాడినా, అవసరానికి మాట్లాడినా చూశారా ‘నిన్న కాక మొన్నవచ్చినపెళ్ళాం మా వాడిని కొంగున ముడేసుకుంది, ఎప్పుడూ దాని మాటే, దాని ధ్యాసే’ అని ఇరుగు పొరుగులతో అని అక్కసు వెళ్ళబోసు కుంటుండేది.

ఎన్నోసార్లు కొడుకు ఆవిడతో ‘అమ్మా ఎందుకు అలా ఆలోచిస్తావు, భార్య వచ్చినంత మాత్రాన నీ స్థానం ఎక్కడికి పోతుంది, నీ ప్రాధాన్యత ఇంట్లో ఏమీ తగ్గదు’, అనేవాడు. ‘ఎవరి పాత్ర వారిదే’ అని ఎంతో చెప్పటానికి ప్రయత్నం చేసేవాడు. మామూలుగా మాట్లాడినా కోడలు చదువుకున్నది కాబట్టి, తనని చులకన చేస్తున్నదని భావించేది.

కొడుక్కి పిల్లలు కూడా పుట్టారు. సాధారణ పరిస్థితుల్లో పిల్లల్ని దగ్గరకి తీసి లాలించే తత్వం ఉన్న మనిషే కామాక్షమ్మ గారు. కానీ పరాయి ఇంటి నించి వచ్చి, తన ఇంట్లో ముఖ్యమైన స్థానంలో ఉన్న కోడలిని బేషరతుగా ప్రేమించలేని ‘సగటు అత్తగారు’ అవటం వల్ల కోడలన్నా, ఆమె కన్న సంతానమన్నా ఒకడుగు దూరంలో పెట్టేది.

ఇది కొడుక్కి కొంచెం మింగుడు పడేది కాదు. ‘పరాయి వారు ఎవరినో ప్రేమ గా చూడ గలిగిన నువ్వు, చెల్లెలి పిల్లల్ని ఆత్మీయంగా దగ్గరకి తీసే నువ్వు ఇంత సంకుచితంగా ఎలా ఆలోచిస్తున్నావమ్మా’ అని కొడుకు అడిగే వాడు. ఆవిడ మౌనమే సమాధానం.

భార్యకి ఏమీ చెప్పి ఊరడించే పరిస్థితి కాదు. ‘ఈ కుటుంబ రాజకీయాల్లో పిల్లలు నలిగిపోతున్నారు’ అని బాధ పడేవాడు. ఒక్కోసారి ‘పెళ్ళి చేసుకుని, ఇంకొక ఆడపిల్ల జీవితం పాడుచేశానేమో’ అనుకునేవాడు.

నిజానికి ఇందులో కామాక్షమ్మ గారు అంత ద్వేష భావంతో ఉండవలసిన అవసరం లేదు. ‘కొడుక్కి పెళ్ళి చెయ్యాలంటే, ఎవరో ఒక పరాయి అమ్మ కన్న పిల్లని ఇంటికి ఆహ్వానించ వలసిందే కదా! మరి ఎందుకు కోడలు అనే వ్యక్తి అంటేనే అంత వ్యతిరేక భావంతో ఉంటారు అత్తలు’ అనుకుని, ‘తనకి చిన్నప్పటి నించీ తెలిసిన తల్లికీ ఈవిడకీ ఎంత తేడా’ అనుకున్నాడు.

‘కోడలు అనే వ్యక్తిపట్ల ఉండే వ్యతిరేక భావం వల్ల కొడుకు, వాడి పిల్లలూ కూడా పరాయి వారు అవుతారు కాబోలు’ అనుకుని ఇదే "ఇనుముతో కూడిన అగ్నికి సమ్మెట పోటంటే" అని నిట్టూర్చాడు.

* * *