పెళ్ళివారి బస్సు ఎక్కే ముందు మా ఉమక్క కొడుకు సమీర్ వాడికి ఎనిమిది ఏళ్ళుంటాయి అప్పుడు రాణీ పిన్నీ అంటూ వచ్చి నన్ను చుట్టేసుకుని ఓ అని ఏడుపు, అదిచూసి మిగిలిన పిల్లలంతా పిన్నీ అని పట్టుకుని ,వాళ్ళ వెనుక అక్కయ్యలు,చివరికి మా బావగార్లుకూడా .అప్పటి దాకా బిగబట్టిన నేను వీళ్ళందరికీ ఏడుపుకిఅమ్మని పట్టుకుని ఏడ్చేశాను.తరవాత మా బాలయ్యనగర్లో రాణెమ్మ పెళ్లి చేసుకుని పోతుంటే పాపం వాళ్ల అక్కయ్యలు, బావగార్లు కూడా ఏడ్చారంట అనిచెప్పుకున్నారట. అసలు ఏడవద్దు అనుకుంటే చివరికి ఏడుపు రికార్డ్ ఏర్పరిచాం అందరం కలిసి సమీర్ పుణ్యమా అని.పెళ్లివారి బస్ ఎక్కి చిలకలూరిపేట,ఒంగోలు మీదగా కనిగిరి ప్రయాణం రాత్రి పూట కనుక ఏమీ తెలియలేదు.నాతో పెద్దక్కయ్య ,మా చారుమతి పిన్ని వచ్చారు .ఏఅర్ధరాత్రి కో కనిగిరి చేరితే.గృహప్రవేశం అయ్యాక .ఇది ఇక "నేను" ఉండబోయే ఇల్లు .(ప్లీస్ నోట్ దిస్ పాయింట్ .) ("మనం "పోయింది చూసారా?.) అని ఆసక్తిగా మొత్తం హాల్లో కనపడినంత మేర చూస్తే పెద్ద వెడల్పైన హాలు గోడలకు దాదాపు మూడు వైపులా రంగూన్ టేకు అద్దాల బీరువాల నిండా లావులావు పుస్తకాలు. మేడ్ ఇన్ లండన్ అని రాసున్న పెద్ద ఇనపపెట్టె.తలపైకి ఎత్తి చూస్తే నేను అంతవరకూ ఎప్పుడూ చూడని దంతెలు ,పెద్ద దూలాలు ఉన్న కప్పు. సీలింగ్ హైట్ కూడా చాలా ఎత్తుగా ఉంది.హాలు తర్వాత ఒక గది , దాన్లో రెండు అర్ధచంద్రాకారం షేపులు వచ్చే టేకు మంచాలు ఒకపక్క ,ఒకపక్క గోడకి రెండు పెద్ద చెక్క పెట్టెలు వాటిపైన రెండు ట్రంకు పెట్టెలు ఒకపక్క బారుగా టేకు కోట్ స్టాండ్ .దానికి ఇత్తడి హుక్స్,తర్వాత డైనింగ్ ,పక్కన కిచెన్ .వెనక్కి వెళితే విశాలమైన పెరడు ,బావి ,బావిచుట్టూ సిమెంట్ పళ్లెం .పక్కాగా బాత్రూములు.డైనింగ్ రూమ్ గోడని ఆనుకుని పైకి రాతి మెట్లు.ఇది ఆ రాత్రి వెళ్ళగానే గమనించిన ఇంటి చిత్రం. తెల్లారిలేవగానే మాపిన్ని అక్కయ్యా నాదగ్గరికి వచ్చిఆనందంగా చెప్పిన విషయం వింటే ఇప్పటికీ నవ్వొస్తుంది.మా పెద్దక్కయ్యకి కొన్ని స్పెషల్ టేస్టులు ఉన్నాయి.అలా తనకి అక్కడ నచ్చినవి ఏమంటే. బాత్రూమ్ లో నీళ్లకు పెట్టిన పెద్ద ఇత్తడి అండా. అలాగే ముందు వైపు పంపు నీళ్లు పట్టుకోవటానికి పెట్టిన మరీ పెద్ద ఇత్తడి గుండ్రటి అండా .మా అక్కకి ఆ అండా చెవుల రింగులు నచ్చాయట .ఒక్క రింగు ఇచ్చినా చాలే భలే ముద్దుగా ఉన్నాయి అని.బ్రష్ చేసుకోవటాని నోట్లో నీళ్లు పోసుకుంటే ఉప్పగా , బావిలోకి తొంగిచూస్తే కనీసం ముప్పై అడుగుల లోతుకు నీళ్లు.మా బాలయ్యనగర్లో బావిలో నీళ్లు వర్షాకాలం లో చెయ్యి తో ముంచుకునేంత పైకి ఉంటాయి.ఈలోగా వ్రతం అని తలస్నానం చెయ్యాలంటే కుంకుడుకాయలు నురుగు వస్తేనా? సబ్బు రుద్దుకుంటే విరిగి పోయి తెట్టులా వంటికి అతుక్కుపోతూ.సరే సినిమాలో హీరోయిన్ టైపు ఫీలింగ్ లో రాతి మెట్లెక్కి కురులు ఆరబెట్టుకుంటూ చుట్టూ చూస్తే వెనకాల పెద్ద కొండ ,కొండ అంటే ఒట్టి పెద్ద పెద్ద బండల కొండ ఒక్కమొక్క కూడా మొలవటానికి వీలులేని విధంగా.ఇంతలో మా పిన్ని గబగబా పైకి వచ్చి మరో సమాచారం ఇచ్చింది .రాణీ వీళ్ళకి మంచినీళ్లు కూడా లేవే రెండు బిందెల మంచి నీళ్ళకి ఐదు రూపాయలు ఇచ్చి కొనుక్కోవాలిట.నాకు మారెడ్డినగర్ శ్రీనివాస రెడ్డి గుర్తుకు వచ్చాడు .ఇటు నుంచి అటు ఎందుకు వచ్చాడో అప్పుడు అర్ధం అయ్యింది.
అటు నుంచి ఇటు.: - వసుధారాణి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి