మోక్షగుండం విశ్వేశ్వరయ్య సైన్స్ మ్యూజియం : --డా.. కందేపి రాణీప్రసాద్.


హలో చిన్నారులూ! మీకు ఈ రోజు బెంగుళూరు నగరంలోని మోక్షగుండం విశ్వేశ్వరయ్య సైన్స్ మ్యూజియం గురించి తెలియచేయాలనుకుంటున్నాను. సాధారణంగా ఏ మ్యూజియంనైనా దేనిని తాకాకుండా దూరం నుంచే చూడాలి. కానీ ఇక్కడి ప్రతి వస్తువును పరిశీలించి స్వయంగా విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. పిల్లలకు ఇక్కడ సరదాగాను, విజ్ఞానదాయంకగాను ఉంటుంది. ఆర్కిమెడిస్ సూత్రాలు, న్యూటన్ గమన నియమాలు, వంటి కష్టమైనవి కూడా ఇక్కడ సరదా ఆటలతో తెలుసుకోవచ్చు. ఇక్కడ బాలలు ప్రత్యక్షంగా విజ్ఞానదాయక ఆటలలో పలు పంచుకోవటానికి వీలుగా ఉంటుంది. కాబట్టి పిల్లలు ఏమాత్రం విసుగు పడరు. 

విల్బర్ రైట్, అర్వీల్ రైట్ అనే రైట్ సోదరులు అహర్నిశలూ శ్రమించి మొట్టమొదటగా ఆకాశంలో విహరింపజేసిన విమానం ఈ మ్యూజియంలో ప్రధాన ఆకర్షణ. వేలమైళ్ళ దూరాన్ని గంటలలో చేరుకునే రవాణా సాధనాన్ని కనిపెట్టి మానవ ప్రగతికి దోహదపడిన రైటు సోదరుల తొలి విజయం గురించి వ్రాసిన పత్రికలను ఈ మ్యూజియంలో చూడవచ్చు. కిరోసిన్ ఇంజన్, పెట్రోల్ ఇంజన్, స్టీమ్ ఇంజన్ ఇలా రకరకాల ఇంజన్లు మానవ అవసరాల కనుగుణంగా ఎలా మార్పు చెందాయో తెలుసుకోవచ్చు. సైకిల్ చైన్లు, ప్లగ్ లు, బ్రేక్ లు, టైర్లు మొదలైన మోటారు వాహనాల విడిభాగాలు, కానీ పెట్టబడిన రోజు నుంచి ఈ రోజు వరకు ఎలా పరిణామం చెందాయో, వస్తువుల ప్రక్కనే వివరాలు వ్రాసిపెట్టి ఉండటంతో సందర్శకుల పని సులువు అవుతున్నది. పిల్లలూ! మీరు భౌతిక శాస్త్రంలో చదివే విషయాలన్నీ ఇక్కడ ప్రత్యక్షంగా చూసి తెలుసుకోవచ్చు. భూమి సూర్యుడిచుట్టూ, తన చుట్టూ తాను తిరుగుతుండడంతో రాత్రి పగలు, కాలాలూ ఏర్పడతాయని మీకు తెలుసు కదూ! సూర్యుడు నిశ్చలంగా ఉండటం, దాని చుట్టూ భూమి మెల్లగా తిరుగుతున్నట్లుగా ఒక మోడల్ ఉంటుంది ఇక్కడ. ఇలా చూస్తే మీకు పాఠాలు చక్కగా గుర్తుంటాయి.

‘పిల్లలూ’ మీ బరువు ఎంతో మీకు తెలుసా? ఇలా అడగ్గానే మీరు వెంటనే నా బరువు ఇంత అని ఠక్కున సమాధానం చెప్పేస్తారు. అదే మీరు ఒకవేళ అంగారక గ్రహం మీదకో, చంద్రుడి మీదకో వెళ్ళినట్లైతే అక్కడ మీ బరువు ఎంత? అంటే మీరు చెప్పలేరు కదా! ఇదే ప్రశ్న మ్యూజియంను దర్శించిన తరువాత అడిగితే, దీనికి ఠకిమని సమాధానం చెప్పేస్తారు. మ్యూజియంలో ఒక బరువుతూచే యంత్రం ఉంటుంది. దాని ముందున్న బోర్డుపై అన్నీ గ్రహాల పేర్లు ఉంటాయి. మీరు మిషన్ మీద నిలబడి ఏదన్నా గ్రహం పేరున్న స్విచ్ నొక్కితే. ఆ గ్రహంలో మీ బరువు ఎంతో చెప్పేస్తుంది. భలే బావుంది కదూ!. ‘ఇంకా భూమికీ, సూర్యుడికి మధ్య దూరాన్ని ప్రయనించడానికి, రాకెట్ లోనూ విమానం లోనూ, కారు లోనూ ప్రయాణం చేస్తే ఎంతెంత సమయం పడుతుంది. అన్న విషయాలు కంప్యూటర్ స్విచ్ నొక్కి సచిత్రంగా తెలుసుకోవచ్చు. ఇవన్నీ స్వయంగా మీరే ఆపరేట్ చేయవచ్చు.

పిల్లలూ! మీరు ఎప్పుడైనా మీ గొంతును మీరే విన్నారా? (టేప్ రికార్డ్ లో కాదు) ఇక్కడ మన గొంతును ఒక నిమిషం తర్వాత మనమే వినవచ్చు. ఆశ్చర్యంగా ఉంది కదూ! ఫోన్ కు ఉన్నట్లుగా మౌత్, రిసీవర్ ఉంటాయి. ఈ రెండింటినీ కలుపుతూ చుట్టలు చుట్టబడిన పెద్దట్యూబు ఉంటుంది. మౌత్ పీస్ లో మనం ‘హలో’! అంటే అది ఆ ట్యూబులో ప్రయాణం చేసి ఒక నిమిషం తర్వాత రిసీవర్ లో నుండి మన మాట మనకే వినిపిస్తుంది. ఇవన్నీ వింటుంటే వెంటనే చూడాలనిపిస్తోంది కదూ!

ఇంకా మీరెప్పుడైనా బెలూన్లు ఊదారా? ఊదే ఉంటారు, ఎందుకంటే పిల్లలకు బెలూన్లంటే చాలా ఇష్టం కదా! సరే గాలిని ఎన్ని సేకన్లు ఆపకుండా ఊదారు? ఎంత బలంగా ఊదారు? అంటే చెప్పగలరా? చెప్పలేరు. మ్యూజియంలో మీరు ఈ విషయాలన్నీ తెలుసుకోవచ్చు. ఇంకా చేతులతో ఎంత బలాన్ని అదిమిపట్టగలరు? సైకిల్ తొక్కుతూ, ఆ శక్తితో బంతిని ఎంతపైకి తోయగలరు?ఇలాంటి ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. కుట్టు మిషన్లు, సంగీత వాయిద్యాలు మొదలైన వాటి ఆవిర్భావం, ఆ తర్వాత క్రమ క్రమ పరిణామం ఎలా జరిగిందో చూడవచ్చు. ఇంతెందుకు! అన్నీ రకాల యంత్రాలు, వాటి తయారీ, పనితీరూ చక్కగా మోడల్స్ ను చూసి వివరంగా తెలుసుకోవచ్చు. కాబట్టి పిల్లలూ, మీరు ఎప్పుడైనా బెంగుళూరు వెళ్ళినట్లయితే విశ్వేశ్వరయ్య మ్యూజియము తప్పక దర్శించి విజ్ఞాన ప్రగతిని తెలుసుకుంటారు కాదు! ఆగండాగండి పిల్లలూ! తన భీకరమైన అరుపులతో నోరు తెరిచి పళ్ళన్ని బయటపెట్టి తోక ఊపుతూ కళ్ళు తిప్పుతూ వాకిట్లోనే పలకరించే డైనోసార్ ను చూడడం మరచిపోకండేం