భూమాత వరం:-(రెండవ భాగం): --ఎం బిందుమాధవి


 ఆ రోజు క్లాసులోకి వస్తూనే పద్మజ టీచర్ "ఇవ్వాళ్ళ మీకు లైబ్రరీ డే అనుకుంటాను. ఇప్పుడు తెచ్చుకోకపోతే మళ్ళీ వారం వరకు వీలవదు. పుస్తకాలు తెచ్చుకున్నారా..లేదా" అనడిగారు. "ఇంకా లేదు టీచర్. మీరొచ్చాక మిమ్మల్నడిగి తెచ్చుకుందామని ఆగాము. పోయిన వారం క్లాసులో అనంత్ చాలా ఆసక్తికరమైన "వేడి నీటి బుగ్గలు" "వేడి నీటి ఆవిరి" గురించి చెప్పాక, అందులో ఇంకొంచెం లోతుగా తెలుసుకోవాలనిపించింది. అందుకే మిమ్మల్నడిగి తెచ్చుకోవాలనుకున్నాం టీచర్" అన్నాడు రవి. "నేను..హవిష్ భూగర్భ శాస్త్రం మీద పుస్తకం తీసుకుని చదివి, వచ్చేవారం మేము తెలుసుకున్న కొత్త విషయాల మీద ఒక వ్యాసం తయారు చేద్దామనుకుంటున్నాం టీచర్" అన్నాడు.
రవి తెలివైన వాడేకానీ, అప్పటివరకు క్లాసులో అల్లరి వాడిగా పేరు పడ్డాడు. అసైన్ మెంట్ ఇస్తే సరిగా టైం కి చేసుకురాకపోవటం, వెనక బెంచ్ లో కూర్చుని ఇతర పిల్లలని ఆట పట్టించటం చేస్తూ ఉండేవాడు. పిల్లలకి అర్ధమయ్యేలా కొత్త విషయాలేమైనా చెప్పి, వారిని భాగస్వాములని చేసే ప్రాజెక్ట్స్ ప్లాన్ చేస్తే,  చదువు అనేది వారిలో భయాన్ని కాకుండా ఆసక్తిని పెంచుతుంది అనుకున్నారు పద్మజ టీచర్.
                                    @ @ @ @ @
వారం గడిచింది. బుధవారం నాడు క్లాసులోకి వస్తూనే, పద్మజ "రవీ మీరు మీ వ్యాసంతో  రెడీగా ఉన్నారా? మీరు నేర్చుకున్న విషయాలు, ఇలా నా టేబుల్ దగ్గరకి వచ్చి బోర్డ్ మీద వ్రాసి బొమ్మలతో వివరించి చెప్పగలరా? నేను ఇవ్వాళ్ళ నీ సీట్ లో కూర్చుని విద్యార్ధి లాగా నువ్వు చెప్పేవన్నీ వ్రాసుకుంటాను. సరేనా" అన్నారు.
"రెడీగా ఉన్నాం టీచర్. నేను కొంత సేపు, హవిష్ కొంత సేపు పద్మజ టీచర్ అయిపోతాం" అని చెప్పటం మొదలు పెట్టాడు.
"మనం పోయినసారి అనంత్ చెప్పగా తెలుసుకున్న "వేడి నీటి బుగ్గల" వల్ల ఇంకొక ఉపయోగం కూడా ఉన్నదని తెలిసింది టీచర్. అదేమిటంటే... ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న "కోవిడ్ 19", మహమ్మారి నిర్మూలనకి వ్యాక్సిన్లని అనేక దేశాలు తయారు చేస్తున్నాయి కదా!"
"ఆ వ్యాక్సిన్ల పరీక్షలకి ఉపయోగించే PCR  టెస్ట్ కిట్స్ తయారీకి, అలాగే నిర్మూలనకి కూడా అవసరమైన వ్యాక్సిన్ ల తయారీకి ఒక ముఖ్యమైన బ్యాక్టీరియాని ఉపయోగిస్తారు. ఆ బ్యాక్టీరియా అత్యధిక ఉష్ణొగ్రతని తట్టుకుని బ్రతకగలిగినదై ఉండాలి. అది మనకి ఈ వేడి నీటి బుగ్గలలో లభ్యమవుతుంది. ఎందుకంటే ఆ నీటి బుగ్గల ఉష్ణోగ్రత షుమారుగా 100-110 సెంటిగ్రేడ్ ఉంటుంది" అన్నాడు రవి.
"హాయ్ భలే విచిత్రంగా ఉంది. అంత వేడిలో బ్రతికే జీవులు కూడా ఉంటాయా? అదెలాగో ఇంకొంచెం వివరంగా చెప్పగలవా?" అన్నారు పిల్లలంతా ముక్త కంఠంతో.
"మనుషులకి అంటువ్యాధులు రాకుండా ఆపేవి, వచ్చినప్పుడు తగ్గించేవి ఈ వ్యాక్సిన్లు. ఆ వ్యాక్సిన్లు మన శరీరంలో ఉండే రోగ నిరోధక శక్తి (immunity)  మీద పని చేసి, రోగ కారక క్రిములని నాశనం చేస్తాయి. మానవ మనుగడకి మందులు కనిపెట్టటమనేది నిర్విరామంగా జరగవలసిన కృషి."
"మనిషి జన్యు క్రమాన్ని తెలియచేసేది DNA. ఈ DNA అనేది గట్టిగా పేనబడిన రెండు మాలిక్యూల్ తాళ్ళు ఒక దానితో ఒకటి మెలిక పడినట్లుఉంటుంది కదా టీచర్! దానికి నాణేనికి ఉన్నట్టు రెండు వైపులు ఉంటుంది. ఒక  నాణేన్ని ఎలా రెండుగా విడదియ్యలేమో, అలాగే  మానవ శరీరం లోని ఈ DNA ని కూడా రెండుగా విడదియ్యలేము. కానీ అలా రెండుగా విడదీసే ప్రయోగం కొరకు ఆ మాలిక్యూల్స్ లోని ఎంజైంస్ ని అత్యధిక ఉష్ణోగ్రత దగ్గర వేడి చెయ్యవలసి ఉన్నది. కానీ మానవ ఎంజైంస్ 25-30 డిగ్రీల సెంటిగ్రేడ్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతని తట్టుకోలేవు. అందువల్ల మానవ శరీరం బయట అత్యధిక ఉష్ణోగ్రత తట్టుకుని నిలబడగల ఎంజైంస్ తో కృత్రిమంగా మాలిక్యూల్స్ తయారు చెయ్యాలనే ప్రయత్నం జరిగింది."
"ఈ ప్రయోగాలు అమెరికా లోని "స్టాన్ ఫోర్డ్" విశ్వవిద్యాలయంలోని ప్రొఫెసర్ Kary B Mullis నిర్వహిస్తూ ఉండగా, ఆయనకి హఠాత్తుగా తమ దేశంలోని "ఎల్లో స్టోన్ నేషనల్ పార్క్" లోని వేడి నీటి బుగ్గలు, అందులోని  అత్యధిక ఉష్ణోగ్రత లో బ్రతుకుతున్న బ్యాక్టీరియా గురించిన విషయం తెలిసింది. వాటిలోని ఎంజైంస్ తన ప్రయోగాలకి ఉపయోగపడతాయని నిర్ధారించుకునారు. అలాంటి బ్యాక్టీరియాని "thermo philic bacteria" అంటారు. అంటే అత్యధిక ఉష్ణోగ్రతని ఇష్టపడే జీవి అన్నమాట. ఆ బ్యాక్టీరియాని PCR process ద్వారా క్లోనింగ్ చేసి కృత్రిమ బ్యాక్టీరియా తయారు చేసి, తక్కువ ఉష్ణోగ్రతలో(అంటే మైనస్ డిగ్రీల్లో)  నిలవ చెయ్యటం ద్వారా వాటిని వాడుకుని వ్యాక్సిన్ తయారుచేయవచ్చని నిరూపించారు."
"అలా కొన్ని బిలియన్ సంవత్సరాలుగా ఉన్న ఆ వేడి నీటి బుగ్గలలోని బ్యాక్టీరియాని ప్రయోగ శాలల్లో నిలవ చేసి ఇప్పుడు మానవ వినాశనం కలిగిస్తున్న అనేక అంటు వ్యాధులకి టెస్ట్ లు చెయ్యగలుగుతున్నారు! వ్యాక్సిన్లు తయారు చెయ్యగలుగుతున్నారు."
"ఆ ప్రొఫెసర్ కి ఈ ప్రయోగానికే 1984 లో నోబుల్ ప్రైజ్ కూడా వచ్చింది.
"ఈ ప్రయోగాలన్నీ 1980 ప్రాంతాల్లో పూర్తయ్యాయి. అందువల్లనే వంద సంవత్సరాల క్రితం, అంటే 1920 లో వచ్చిన "స్పానిష్ ఫ్లూ" కి ఇలాంటి వ్యాక్సిన్ అందుబాటులో లేదు. అప్పుడు జన నష్టం వ్యాక్సిన్ లేక జరిగింది. ఇప్పుడు రవాణా సౌకర్యాలు పెరిగి వస్తు రవాణా ద్వారా, మనుషులు ఒక చోటి నించి ఒక చోటికి ఎక్కువగా ప్రయాణించటం ద్వారా  అంటు వ్యాధిని విపరీతంగా వ్యాపింప చేస్తున్నారు. అందువల్ల ఇప్పుడు జన నష్టం జరుగుతున్నది.
అంటే మానవ తప్పిదం వల్ల కలుగుతున్న అనేక వినాశనాలకి పరిష్కారాలు ప్రకృతిలోలభ్యమవుతున్నాయి. అందుకే భారతీయ సనాతన ధర్మం లో ప్రకృతిని మనం మాతృదేవతగా కొలుస్తాం!
                @ @ @ @ @
"హవిష్ నువ్వేం చెప్పదలచుకున్నావ్" అనడిగారు.
"పోయిన వారం అనంత్ భూమిలో నించి తన్నుకుని పైకి ఉబికి వచ్చే వేడి నీటి బుగ్గల గురించి వాటి ఉపయోగాల గురించి చెప్పాడు కద టీచర్! ఇప్పుడు నేను భూమి లోపలి పొరల్లోంచి పైకి ఎగదన్నుకు వచ్చే లావా గురించి చెబుతాను టీచర్" అన్నాడు.
"ఇండోనేషియా, న్యూజిలాండ్, హవాయ్ ద్వీపాలలో అక్కడక్కడా కరిగిన వేడి ద్రవాలు భూమి మీద, ఆ  ద్రవాల నించి లేచిన బూడిద వాతావరణంలోను వ్యాపించి ఉండటం చూడగలం! భూమి లోపల బాగా కరిగిన ఆ ద్రవాలని "శిలా ద్రవాలు" అంటారు. భూమి పైకి అలా ప్రవహించిన  ద్రవాలని లావా అంటారు. అవి భూవాతావరణానికి చల్లబడి గడ్డకట్టి గట్టి నల్లటి రాయిగా మారుతుంది."
"ఈ అగ్ని పర్వతాలు అన్ని భూ ఖండాలలోను వ్యాపించి ఉన్నాయి. మన భారత దేశంలో బంగాళా ఖాతంలో, అండమాన్ దీవులకి తూర్పుగా ఉన్నాయి. ఈ అగ్ని పర్వతాలని Barren island vulcanos అంటారు."
"అసలు ఈ శిలా ద్రవాలు భూమిలోపల ఎలా ఏర్పడతాయంటే, మనం ఇంతకు ముందు తెలుసుకున్నట్లు భూమి నించి క్రమంగా లోతుల్లోకి వెళుతుంటే ప్రతి కిలోమీటర్ కి 30 డిగ్రీ సెంటిగ్రేడ్ చొప్పున ఉష్ణోగ్రత పెరుగుతూ పోతుంది. అలా భుమి అట్టడుగుపొరల్లోని మధ్య భాగంలో, అంటే భూమి నించి షుమారు 5000 కిలోమీటర్ల లోతులో అన్నమాట,  ఉష్ణోగ్రత దాదాపు 6000 డిగ్రీ సెంటిగ్రేడ్ లో ఉంటుంది. ఆ వేడికి అక్కడున్న రాయి కరిగి ద్రవంగా మారుతుంది. ద్రవం అనేది ఒక చోటి నించి మరొక చోటికి ప్రవహించే నైజం కలిగి ఉంటుంది కాబట్టి, అక్కడ ద్రవరూపంలోకి మారిన రాయి (శిలా ద్రవం ...magma) ఆ అత్యధిక ఉష్ణోగ్రత, దాని వల్ల కలిగిన పీడనం వల్ల  క్రమేణా పై పైకి ఉబుకుతూ ఒక్కసారిగా భూమిపైకి లావా లాగా ఎగజిమ్ముతుంది. అలా వచ్చే ప్రక్రియలో రాతి ద్రవం అవటం వల్ల, కొంత బూడిద ని కూడా పైకి ఎగజిమ్ముతుంది. అలా పైకి చిమ్మబడ్డ బూడిద వాతావరణంలోకి కమ్ముకుని చుట్టూ వ్యాపిస్తుంది. అలా వ్యాపించిన బూడిద భూమి మీద పడే సూర్య రశ్మిని అడ్డుకుంటుంది. ఆ బూడిదలో ఉండే బొగ్గు పులుసు వాయువు (అంటే కార్బన్ డయాక్సైడ్ అన్నమాట), సల్ఫర్ వాయువు (అంటే సల్ఫర్ డయాక్సైడ్ అన్నమాట), సూర్య కిరణాల తీవ్రత (ultra violet radiation) నించి భూమి మీద నివశించే జీవజాలాన్ని కాపాడుతుంది."
"భూమి లోపలి పొరలని, అందులో ఉష్ణోగ్రత స్థాయిలని ఈ క్రింది బొమ్మ ద్వారా ఇంకా తేలికగా అర్ధం చేసుకోవచ్చు."
"భూమి ఏర్పడిన ఇన్ని కోట్ల సంవత్సరాల్లో ఇలా అగ్ని పర్వతాలు బ్రద్దలవటం, లావా పైకి ఎగ జిమ్మటం, బూడిద చుట్టూ వ్యాపించటం అనే ప్రక్రియ ఎక్కడో ఒక చోట నిరంతరం జరుగుతూనే ఉంటుంది. అలా జరగటం జీవరాశి మనుగడకి చాలా అవసరం." అని ముగించాడు.
"వెరీ గుడ్ రవి, హవిష్. మంచి సమాచారాన్ని సేకరించారు. అందరికీ అర్ధమయ్యేట్లు సులువైన పద్ధతిలో చక్కగా చెప్పారు. I am proud of you boys. వచ్చే వారం మీలో ఇంకో ఇద్దరు మరొక విషయం మీద  క్లాస్ చెప్పాలి.సిద్ధంగా ఉండండి" అని చెప్పి పద్మజ టీచర్ సంతోషంగా వారందరికీ ఫైవ్ స్టార్ చాక్లెట్స్ పంచారు.