సామెత కథ : ఎం. బిందు మాధవి


 ఎద్దు పుండు కాకికి ముద్దా!


‘విజయలక్ష్మి’, ‘సత్యం’ గారు భార్యా భర్తలు.

సత్యంగారికి ముఖ్య వృత్తి వ్యవసాయం. పొలం మీద ఆదాయం తోనే పిల్లల్ని చదివించుకుని,పెళ్ళిళ్ళు కూడా చేశాడు. విజయలక్ష్మి బస్తీలో పుట్టి పెరిగినా, ఏ సమస్యా లేకుండా వ్యవసాయదారుడితో సంతోషం గా కలిసి బ్రతికింది.

తన పరిధిలో తను, ఈ ఆధునిక కాలానికి చెందిన అన్ని హంగులతో పిల్లల్ని పెంచి పెద్ద చేసింది. ‘విజయలక్ష్మి’ పెళ్ళి నాటికి పెద్దగా చదువుకోక పోయినా, ప్రపంచం లో జరిగే విషయాలని ఎప్పటికప్పుడు వార్తా పత్రికల ద్వారా, టీవీ కార్యక్రమాల ద్వారా తెలుసుకుని తన జ్ఞానాన్ని వృద్ధి చేసుకుంటున్నది.

తల్లి మార్గదర్శకత్వంలో, తండ్రి కనుసన్నల్లో పిల్లలు ఇంజనీరింగ్, మెడిసిన్ చదివారు. అందరి పిల్లల లాగే వారు కూడా అమెరికా పై చదువులకి వెళ్ళారు.

విజయలక్ష్మి, సత్యం గారు పెద్ద వాళ్ళయ్యారు. సత్యం గారిని, వయసుతో వచ్చే చిన్న చిన్న అనారోగ్యాలు అప్పుడప్పుడు పలకరిస్తున్నాయి. పిల్లలు దగ్గర లేకపోయినా విజయలక్ష్మి, ఆత్మస్థైర్యంతో, ధైర్యం గా ఆయన్ని హాస్పిటల్ కి తీసుకెళ్ళి తగిన వైద్యం చేయిస్తున్నది.

ఒకసారి సత్యం గారు తీవ్రంగా అస్వస్థులవటం తో, దగ్గర ఉన్న ఓ డాక్టర్‌కి చూపించింది. అక్కడ వాళ్ళ తీరు, పోకడ ఆవిడకి తృప్తిగా లేక, తెలిసిన వాళ్ళ సలహాతో పట్నానికి తీసుకెళ్ళింది. రోగాల విషయం లో తనకున్నది పరిమిత ఙ్ఞానమే అయినా, తనకి సహజంగా ఉన్న ఊహ పోహలతో సత్యం గారిని చేర్పించిన హాస్పిటల్ లో డాక్టర్ కి మొదటి నించీ జరిగిందంతా పూస గుచ్చినట్లు చెప్పి, సమస్య ఏమై ఉంటుంది అని తను భావిస్తున్నదో కూడా చెప్పింది.

డాక్టర్ విసుగ్గా మొహం పెట్టి, ‘మీరన్నీ చెప్పక్కర లేదు, హాస్పిటల్లో చేర్పించారు కదా మేము చూసుకుంటాము’ అని నిర్లక్ష్యంగా వెళ్ళిపోయాడు.

ఇక వైద్యం మొదలయ్యింది. విషయం ఏమిటో చెప్పరు. ఆ టెస్ట్ లు అంటారు, ఈ టెస్ట్ లంటారు, రిపోర్ట్ చూపించరు. అడిగితే ‘మేమా డాక్టర్లు, మీరా’ అని విసుక్కుంటారు. ‘ప్రతిది మీకు చెప్పాలంటే కుదరదు, చెప్పినా మీకు అర్ధం కాదు, మా డ్యూటీ మమ్మల్ని చెయ్యనివ్వండి’ అని వినిపించుకోకుండా వెళ్ళిపోతారు.

మధ్య మధ్య లో వచ్చి ‘ఆ మందు పట్రండి, ఈ టానిక్ పట్రండి’ అని ఓ స్లిప్ ఇవ్వటం చూస్తే ఏం జరుగుతున్నదో అని ఆందోళన మొదలయ్యింది విజయలక్ష్మి కి. అప్పటి వరకు సత్యం గారు రూం లోనే ఉన్నారు. రాత్రి పన్నెండు గంటల వేళ సత్యం గారికి ఊపిరాడక ఉక్కిరి బిక్కిరి అవుతుంటే, విజయలక్ష్మి వెళ్ళి డ్యూటీ నర్స్ ని పిలిస్తే వాళ్ళు గంట సేపు తర్జన భర్జన పడి వెంటిలేటర్ పెట్టి, ఇంకో రెండు మూడు గంటలయ్యాక ICU కి షిఫ్ట్ చేశారు ఆయన్ని.

ఇక అక్కడి నించి ఇంకో హింస- ‘లోపలికి ఎవ్వరిని రానివ్వరు, జరిగేది చెప్పరు’. ఈ పోకడ అంతా చూశాక ‘ఈ వైద్యం ఎన్ని లక్షలకి దేకిస్తారో’ అనే కంగారు పట్టుకున్నది, విజయలక్ష్మికి. పిల్లలా దగ్గర లేరు. పై ఎత్తున తోడు ఉండే వాళ్ళే కానీ, వివరంగా మెడికల్ భాష, పరిఙ్ఞానం ఉన్న వాళ్ళెవ్వరూ తోడు లేకపోవటం గమనించి డాక్టర్లు వాళ్ళు ఆడే నాటకాలు వాళ్ళు ఆడుతున్నారు. ఇలా రెండు రోజులు ‘ఈ సమస్య’, ‘ఆ వైద్యం’ అని డబ్బు ఖర్చు పెట్టించి, చివరికి ఆయన శవాన్ని చేతికిచ్చారు. శవం తో పాటు నాలుగు లక్షలు బిల్ ఇచ్చారు.

విజయలక్ష్మి కోపం కట్టలు తెంచుకున్నది. ‘ఎన్ని సార్లు అడిగినా చెప్పరు, ఇప్పుడు మాకుజరిగిన నష్టానికి ఎవరు జవాబు దారి’ అని డ్యూటీ డాక్టర్ మీద అరిచేసింది.

‘మీదేం పోయిందండి ఇన్ని లక్షల బిల్ అయ్యేవరకు మీరేం వైద్యం చేశారో తెలియదు. అది అవసరమో కాదో తెలియదు. హాస్పిటల్లో చేర్చేటప్పటికి ఆయనకున్న జబ్బేమిటో తెలియదు. ఆ ఇచ్చిన ట్రీట్మెంట్ దానికి సంబంధింది అవునో కాదో తెలియదు’. "ఎద్దు పుండు కాకికి ముద్దా" అన్నట్లు ‘ఏ విధమైన స్పందన లేకుండా, ఏ మాటకి సమాధానం చెప్పకుండా మేము కట్టవలసిన చార్జ్‌లు మాత్రం ఇంత పొడుగు బిల్ ఇచ్చారు’ అని అక్కడున్న సిబ్బందిని చడమడా కడిగేసింది.

డబ్బూ పోయింది, మనిషీ దక్కలేదు. కానీ ఆవిడ ‘అరణ్య రోదన’ ఎవరు వింటారు! ‘ఇంకా గట్టిగా మాట్లాడితే, శవాన్ని తీసుకెళ్ళే లోపు ‘అనాధ ప్రేతం’ లాగా ఎక్కడైనా మూట కట్టి పడేస్తారేమో కూడా తెలియదు’ అని తెలిసిన వాళ్ళు వారించేటప్పటికి నోరు మూసుకోవటం తప్ప ఏమీ చెయ్యలేక శూన్యంలోకి చూస్తూ ఉండిపోయింది.

* * *