చిన్ని గజ్జెలు ఘల్లు ఘల్లు మనలోలకుల సొగసులు
తళుకు తళుకు మని
మెరియగ నట్టింట నడిచే
అమ్మాయి అందం
చందమామ చందం !
గడపకు పసుపై గుమ్మానికి తోరణమై తులసి చెట్టుకు ప్రమీదై వెలిగే ఇంటి దీపం
అమ్మ నాన్నల కంటి రూపం
వేళ్ళ సందుల్లోంచి
ముగ్గుల వెన్నెల కురిపించే
గొబ్బెమ్మ
వాకిట్లో కదిలే సంక్రాంతి ముద్దుగుమ్మ
పండగకు పావడ గట్టి గదవకు గంధం బెట్టి
పసుపు కుoకుమకు పిలువ చెప్పి
వాయనం అందిపుచ్చుకున్న ఇంతి
బంధాలు పదిలం చేసుకునే పూబంతి
గాజుల గాజుల గల గలలు
నవ్వుల నజరానాలు
చదువుల కార్ఖానాలు
సంధ్య వెలుగై
ప్రకాశించే ఆశల సహస్రార కాంతులు
హిమాలయం పై ధ్వజo
ఎత్తిన సాహస సమరాంగణలు
లెక్కలకు లెక్కలు నేర్పిన తెలివరులు
రాకెట్లను సంధించిన జ్ఞాన వరిష్టలు
గొంతు విప్పి ప్రశంసల వర్షం కురిపించే కృత్రిమ మేఘాల వాఖ్యానాలు
మొగ్గలను కత్తిరించే
ఆడతనo హక్కు భుక్తాలను
పొందిన అత్తల
పెత్తందార్లు జాతి మూతికి వంకర్లు
పూవుల్ని నలిపేసే కోరికల
పురుషత్వo ఆలోచనలు దహించి నిరసన కణాలు ఎగిసిపడి
నిలదీస్తేనే కొత్త సాలు
నిలబడే చైతన్యపు ఆనవాలు
వేదికపై
వల్లింపులు
వేడుకల సారె చెల్లింపులు
కాదు వేదనల దూరం చేసే
ఎదకదలిక చాలు
బాలిక ఈ దేశపు
జీవితాన్ని వెలిగించే దీప కళిక
రేపటి ఏలిక ఆనంద పాలిక
రేపటి ఏలిక :-కె ఎస్ అనంతాచార్య
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి