మహాబలిపురం (బాలరాజు కథ)౼ దార్ల బుజ్జిబాబు
 బాలలూ! పాతవెప్పుడు బంగారమే. పాత సినిమాలలో పాటలు కూడా బంగారమే. అవి సాహిత్యంలోను, సంగీతంలోను వీనులకు విందు చేస్తాయి. ఆ కోవకు చెందిందే ఈ పాట. ఒక ప్రసిద్ధ కట్టడాన్ని చూపించే మధురమైన పాట.  ఇది బాలరాజు కథ చిత్రం లోది.  లక్ష్మీ ఎంట్రప్రయజెస్ బ్యానర్ మీద 1966లో విడుదల అయింది. నిర్మాత నిడమర్తి పద్మావతి. దర్శకత్వం బాబు. పాట రాసింది ఆరుద్ర. పాడింది పి.సుశీల. బాణీ కూర్చింది కె.వి.మహదేవన్. ఇందులో నటించిన బాల నటుడు ప్రభాకర్. 
        సెంటిమెంట్ తో కూడిన మంచి కథా చిత్రం బాలరాజు కథ. బాలరాజు ఓ నిరుపేద బాలుడు. తండ్రి లేడు. తల్లి రోగిష్టి . ఓ చెల్లి ఉంది. మేనమామ పర్యవేక్షణలో వుంటారు. మేనమామ ఒట్టి సోమరి. పైసా సంపాదించడు. కాబట్టి కుటుంబాన్ని పోషించే  బాధ్యత పన్నిండేళ్ల బాలరాజు మీద పడుతుంది. వీరు నివసించేది  చారిత్రక ప్రాసిస్త్యం కలిగిన మహాబలిపురం పట్టణంలో. బాలరాజుకి మహాబలిపురం  చరిత్రకథ  తెలుసు. తన తెలివితేటలు పెట్టుబడిగా పెట్టి తనకు తెలిసిన నాలుగు ముక్కలు యాత్రికులకు చెప్పి  కుటుంబాన్ని పోషిస్తూ ఉంటాడు. ఒకరోజు పిల్లలు లేని ఓ తెలుగు జంట యాత్రికులుగా వచ్చారు. వారికి గైడుగా  వ్యవహరిస్తూ...మహాబలిపురం చారిత్రక కథను వివరించే విధానంలో ఈ  సూపర్ హిట్ పాట పాడతాడు.
      ఈ పాట ద్వారా  మనం మహాబలిపురం పర్యాటక ప్రాంత విశేషాలను కళ్ళకు కట్టినట్టు తెలుసుకోవొచ్చు. ఐదు నిముషాల ఈ పాటలో మహాబలిపురంను దగ్గరగా చూసిన అనుభూతి కలుగుతుంది. ఈ పాట ద్వార ఎన్నో చారిత్రక, పౌరాణిక విశేషాలు నేర్చుకోవొచ్చు.  ఈ ప్రాంతాన్ని పల్లవ రాజులు పాలించారని, వారే ఈ పట్టణాన్ని కట్టించారని, మంచి రేవు పట్టణంగా మార్చారని, మన తెలుగు రాష్ట్రంలో నిపుణులైన శిల్పులు ఉండేవారని, ఇక్కడ శిల్పాలన్ని వారే చెక్కారని తెలుసుకోవొచ్చు. అలాగే ప్రసిద్ధ శిల్పాలైన పాండవుల రధాలను ఏకశిలతో మలిచారని  తెలుసుకోవొచ్చు. కొండ రాళ్లపై పురాణ ఘట్టాలను అద్భుతంగా చెక్కినట్టు తెలుసుకోవొచ్చు. మహిషాసుర మర్ధనం, గోవర్ధనగిరిని శ్రీకృష్ణుడు లేపడం. విష్ణుమూర్తి వరాహ అవతారం ఎత్తడం, అర్జునుడు పాసుపతి అస్త్రం కోరడం, శివుని కోసం తపస్సు చేయటం, సృష్టి యావత్తు వచ్చి చూడటం వంటి పురాణ కథలు ఈ పాఠద్వారా స్పష్టంగా తెలుసుకోవొచ్చు.  పాట విన్న తరువాత ఆ కథలు ఏమిటో పెద్దలను అడిగి తెలుసుకోండి. ఈ పాట నేర్చుకోవడం ద్వారా ఎంతో విజ్ఞానం, అనుభూతి మీ సొంతం అవుతుంది.