బాల్య మిత్రుల కలయిక : జగదీశ్ యామిజాల


 నేనూ, పిల్లలమర్రి శివప్రసాద్, హరి నాగభూషణ శాస్త్రి, మోచర్ల ప్రభాకర్ హైదరాబాదులో కలుసుకున్నాం. ప్రభాకర్ ఇంట సమావేశమయ్యాం. ఈ కలయికకు ఓ ప్రత్యేకత ఉంది. మా పరిచయం వయస్సు యాభై ఏళ్ళు కావడం. మేము మద్రాసులోని టీ. నగర్లో పనగల్ పార్కు ఎదురుగా ఉన్న శ్రీ రామకృష్ణా మిషన్ మెయిన్ స్కూల్లో చదుకున్నాం. నేను ఒకటో తరగతి నుంచి అయిదో తరగతి వరకు గ్రిఫిత్ రోడ్డులో ఉన్న రామకృష్ణా మిషన్ ఎలిమెంటరీ స్కూల్లో చదువుకున్న తర్వాత ఆరో తరగతి నుంచి లెవన్త్ స్టాండర్డ్ వరకు మెయిన్ స్కూల్లో చదివాను. ఇవాళ కలుసుకున్న మాలో శివా, హరి తొమ్మిదో తరగతి నుంచి నా క్లాస్ మేట్స్. ప్రభాకర్ టెన్త్, ఎస్సెల్సీ మా క్లాస్ మేట్. అంతకుముందు వీళ్ళ ముగ్గురూ టీ నగర్ బస్టాండ్ సమీపంలో ఉన్న శారదా స్కూల్లో చదువుకున్నారు. నేనీ రోజు ఎక్కువగా మాట్లాడలేదు. ఎందుకో మౌనంగా ఉండి ప్రభాకర్, శివ, హరి మాట్లాడుకున్న మాటలు వింటూ కూర్చున్నాను. మధ్యలో ఒకటి అరా మాటలు నావి. శారదా స్కూల్లో చదువుకున్న రోజుల గురించి ముగ్గురూ చెప్పుకున్నారు. హరి తన గాత్రం గురించి స్టేజ్ ప్రోగ్రాముల గురించి చెప్పాడు. వాడు పాడిన పాటలు వినిపించాడు. కరోనా నుంచి తను కోలుకున్న విషయాన్ని వివరించాడు హరి. మాటల మధ్యలో శివా మే నెలలో జరగబోయే తన కొడుకు పెళ్ళి విషయం చెప్పాడు. హైదరాబాదులోని నోమా కళ్యాణ మండపంలోనే ఈ పెళ్ళి జరగబోతోంది. ఇక రాజాకీయాల గురించి కొన్ని మాటలు, బ్యాంకింగ్ గురించి కొన్ని విషయాలు మా సమావేశంలో చర్చకు వచ్చాయి. ప్రభాకర్ ఇంటి ఆవరణలో ఉన్న పువ్వులకు, నిమ్మకాయలకు, బొప్పాయిలకు ఎప్పట్లాగే ఫోటోలు తీశాను. రకరకాల పువ్వులు. హైబ్రీడ్ అయితేనేం, నేనిప్పటివరకూ చూడనంత పెద్ద మందార పువ్వు చూశాను. రకరకాల మందారాలు, చామంతులు, బంతిపూలకు ఫోటోలు తీశాను. అలాగే తిరుగు ప్రయాణానికి లేచినప్పుడు ప్రభాకర మామిడి చెట్ల గురించి చెప్తూ వాటిలో ఒకటి రసాలని.  ఓ రెండు వందల పళ్ళు వస్తాయని, చెట్లోనే పండిన తర్వాత కోస్తామని వివరించాడు. చాలా బాగుంటాయి అన్నారు ప్రభాకర్ వాళ్ళావిడ. ఇదిలా ఉంటే ఇక బ్రెక్ ఫాస్ట్ గురించి వేరే చెప్పక్కర్లేదు. రుచికరమైన గారెలు, పొంగలుతోపాటు చట్నీలు, సాంబారూ లాగించేసాం తృప్తిగా. ప్రభాకర్ కి, వాళ్ళావిడకూ థాంక్స్. మళ్ళీ వచ్చే మే నెలలో కలుసుకుందామనుకున్నాం.  ఈసారి ఫ్యామిలీస్ తో గెట్టుగదర్ కావాలనుకున్నాం....