ఓ స్త్రీ రేపురా:- వసుధారాణి.


 ఈ పదం కొన్ని ఏళ్లక్రితం భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్ర,తమిళనాడు రాష్ట్రాల్లో వణుకు పుట్టించిన పదం.


నేను ఎనిమిదో తరగతి చదువుతున్నా ఆ టైం లో, బడికి పోతే ఉదయం ఎవరినోట విన్నా ఇదే కబురు,ఒక ఆడమనిషి నల్లటి ముసుగువేసుకుని అర్ధరాత్రి ఏదో ఒకఇంటి తలుపు తడుతుందిట, తలుపు తెరిచినవాళ్ళు ఆమెని చూడగానే రక్తం కక్కుకొని చనిపోతారట. 


తలుపు మీద కనుక ఓ స్త్రీ రేపురా అని రాస్తే , చిల్లర అంగళ్ల లో అప్పురేపు అని రాసినట్లు. ఆవిడ ఓహో మళ్ళీ రేపొద్దాంలే అనుకుని వెళ్లి పోతుందిట. ఇదీ సారాంశం.


ఇంక చూసుకోండి అక్కడ ఆవూర్లో ఇలా ,ఈవూర్లో అది రాసుకోక పోతే ఆయింట్లో వాళ్ళు తలుపుతెరిచి చచ్చిపోయారుట,అలా ఎవరికి తోచిన కధనాలు వాళ్ళు.పిల్లల్లోని సృజనాత్మకత అంతా బయటికి వచ్చేసింది ఆ కాలంలో.


ఈ విషయం, ప్రజలు ఇలా మూఢనమ్మకాలతో మగ్గిపోవటం సోషల్ రాణి అదే మనకి నచ్చలేదు.నేను మా అక్కయ్య పిల్లలు చిన్నారి,కిషోరూ కలిసి ఒక అద్భుతమైన అవుడియా ఆలోచన చేసాం.


నాచేతి రాత నాకే అర్ధంకాని గొప్పరాత కనుక మా చిన్నారి చేత మా అక్కయ్యా వాళ్ళ ఇంటి తలుపుమీద "ఓ స్త్రీ దమ్ముంటే ఇవాళే రా!" అని రాయించాం.


బోలెడంత దమ్ముతో రాయనైతే ,రాసామ్ కానీ నాయనా ,స్వామి ఆ రాత్రి అంతా మాకు భయంతో జాగారమే.చీమ చిటుక్కుమన్నా ఒరేయి అని ముగ్గురం గట్టిగా ఒకళ్ళని ఒకళ్ళు పట్టుకుని శ్రీ ఆంజనేయం చదువుకోవటమే సరిపోయింది.

 

కట్ చేస్తే మర్నాడు  బడిలో కాకమ్మ కబురు మన ధైర్య సాహసాల గురించి మనమే చెప్పేసుకున్నాం  ఒక్క ఆంజనేయ దండకం తప్పించి.


ఆ దెబ్బతో మా బడిలో ఓ స్త్రీ రేపురా ! సోది వదిలిపోయింది.

నెనుమాత్రం మళ్ళి రేపువస్తా.. సెలవా మరి