సామెత కథ : బిందు మాధవి


  ఒకరు చేస్తే అది రసికత్వం...

మరొకరు చేస్తే అది రంకుతనం!


విజయ, పరిమళ స్నేహితులు. ఇంటర్మీడియెట్ నించి కలిసి చదువు కున్నారు. పెద్ద వాళ్ళయి, పెళ్ళిళ్ళు అయి పిల్లలు పుట్టినా కూడా ఇద్దరూ హైదరాబాద్ లోనే ఉండటం వల్ల కలిసే తిరుగుతూ ఉంటారు. షాపింగ్ లు గట్రా కలిసే చేస్తూ ఉంటారు.

ఒక రోజు, మధ్యాహ్నం అయితే కాస్తరోడ్లు రద్దీ తక్కువగా ఉంటాయని అమీర్‌పేట్‌లో ఏవో బ్లౌజులు, ఇంకా ఇంటి సామగ్రి కొందామని ఇద్దరూ కలిసి షాపింగ్ కి బయలుదేరారు.

రోడ్లు ఖాళీగానే ఉన్నాయి. ముందు మ్యాచింగ్ సెంటర్ కి వెళ్ళి అక్కడ కార్ పార్క్ చేసి లోపలికి వెళ్ళారు. కావలసినవి కొనుక్కుని బయటికి వచ్చేటప్పటికి, విజయ కార్ ముందు టైర్ కి తాళం వేసి ఉన్నది.

చుట్టూ చూసేటప్పటికి ఆ పక్కన ఉన్న ఇంకో హాకర్ (చిరు వ్యాపారి), ‘ట్రాఫిక్ పోలీస్ తాళం వేసి వెళ్ళాడు’, ‘సిగ్నల్ దగ్గర ఉంటాడు వెళ్ళి చలాన్ కడితే వచ్చి తాళంతీస్తాడు’ అని ఏదో సాధారణం గా రోజూ జరిగే విషయం లాగా చెప్పాడు. ‘అదేమిటి పోలీస్ తాళం వేస్తుంటే వచ్చి మమ్మల్ని పిలవచ్చు, లేదా ఆ షాప్ వాళ్ళకి చెప్పచ్చు కానీ అంతా అయిపోయాక ఇప్పుడు చెబుతావేమిటి’ అని విజయ, పరిమళ ఇద్దరూ గట్టిగా మాట్లాడారు.

ఈ హడావుడి అంతా చూస్తున్న ట్రాఫిక్ కాన్ స్టేబుల్ తాపీగా వచ్చి ‘500 రూపాయలు కట్టండి మేడం, ఇక్కడ పార్కింగ్ చెయ్యటానికి లేదు’ అని రూల్స్ మాట్లాడాడు. ‘షాప్ లకి లైసెన్స్ లు ఇచ్చేటప్పుడు, కొనుగోళ్ళకి వచ్చే వాళ్ళ కార్ల కి పార్కింగ్ లేదని మీకు ముందుగా తెలియదా, అలాంటప్పుడు అసలు లైసెన్స్ లు ఎలా ఇస్తారు’ అని విజయ, పరిమళ గట్టిగా వాదించారు. ‘అదంతా మాకు తెలియదు మేడం, రూల్స్ ప్రకారం మీరు చలాన్ కట్టాల్సిందే’ అని పోలీస్ గట్టిగా మాట్లాడి, మళ్ళీ గొణుగుతూ, ‘100 రూపాయలు ఇవ్వండి మేడం తాళం తీస్తాను’ అని కాళ్ళబేరానికి వచ్చి, కట్టిన డబ్బుకి రశీదు ఇవ్వకుండా ఆ డబ్బు జేబులోవేసుకుని తాళం తీసి వెళ్ళిపోయాడు.

ఇంతలో ఒక పోలీస్ వాహనం (టాటా సుమో లాంటి పెద్ద వాహనం) వచ్చి అదే మ్యాచింగ్ సెంటర్ ముందు ఆగింది. అందులో నించి ఒక పోలీస్ బాస్ భార్య ఠీవిగా దిగి లోపలికి వెళ్ళింది. ఇంతకు ముందు విజయ వాళ్ళని దబాయించిన కాన్‌స్టేబుల్ తుపాకీ గుండుకి దొరక కుండా డ్యూటీ చెయ్యటానికి వెళ్ళిపోయాడు.

విజయ ఊరుకుంటుందా, ఫొటో తీసి ఫేస్ బుక్ లో పెట్టి “ప్రజలకి పార్కింగ్ అవకాశం లేని చోట పోలీస్ బాస్ ల కి మాత్రం ఏ అభ్యంతరం లేదు. పోలీస్ బాస్ లకి, వారి భార్యలకి ఏ రూల్స్ ఉండవు, సామాన్య మానవులకే అన్ని రూల్స్” అని కాప్షన్ కూడా రాసింది.

ఈ తతంగమంతా చూసిన పరిమళ తన అనుభవం చెప్పుకొచ్చింది. ఒక సారి తను ఖైరతాబాద్ సెంటర్ లో వస్తూ ఉండగా ‘రెడ్ సిగ్నల్ ఉన్నప్పుడు కారు నడుపుతున్నారంటూ’, తన కార్ ఆపి చలాన్ వేశాడు. అదే సమయం లో "టైంస్" ఆఫీస్ వారి కార్ తన ముందే ఉన్నదని, వారిని ఆపితే ప్రెస్సులో ఏకేస్తారని వారిని ఆపకుండా తనని ఆపి నానా రచ్చ చేసిన పోలీస్ కాన్ స్టేబుల్ గురించి చెప్పి, పరిమళ "ఒకరు చేస్తే అది రసికత్వం..మరొకరు చేస్తే అది రంకుతనం!" అని ఇందుకే అంటారు.

‘వాళ్ళకో రూల్, మిగిలిన జనరల్ పబ్లిక్ కి ఒక రూల్. చేతిలో అధికారం ఉన్నదని పోలీస్ వాళ్ళు చేసే పెత్తందారితనం ఒక్కో సారి చాలా ఇబ్బంది పెడుతుంది’ అనుకున్నారు.