సామెత కథ : - ఎం . బిందు మాధవి


 గేదె చచ్చాక కానీ పాడి బయట పడదు!


‘వాసంతి’ కాలేజ్ లో లెక్చరర్ గా ఉద్యోగం చేస్తున్నది. భర్త ‘వినయ్’ ఒక పెద్ద కంపెనీ లో పని చేస్తున్నాడు. వాసంతి అత్తగారు కూడా వీళ్ళతోనే ఊంటారు. ఆవిడ భర్త కూడా ఒక మంచి కంపెనీ లో పెద్ద ఉద్యోగమే చేసి వినయ్ చదువు కూడా అవకముందే అర్ధంతరం గా చనిపోయారు.

పగలు వంట ఆవిడే చేసేది. పాపం పిల్లలు ‘ఉద్యోగ హడావుడి’, ‘పని ఒత్తిడి’ ఉంటాయి కనుక కాస్త లేట్ గా లేచినా ఇబ్బంది లేకూండా తనే వంట చేసి, బాక్స్ లు సర్ది పెట్టేది. సాయంత్రం ‘వాసంతి’ కాలేజ్ నించి వచ్చి ఏదో ఒక వేపుడు చేసి ‘అన్నమో’, ‘చపాతీనో’ చేసేది. పొద్దుటి ‘సాంబారు’ వేసుకుని తినేసే వారు. ఆ వంట కూడా ఆవిడ దగ్గర ఉండి ‘ఇలా చెయ్యి’, ‘ఈ కూరే చెయ్యి’ అని దగ్గర ఉండి చెప్పేవారు. ‘వాసంతి’ కి అది నచ్చేది కాదు. తనకి ‘నచ్చిన కూర’ ‘నచ్చిన పద్ధతి’లో కాస్త ‘మసాలా’ అదీ వేసి ‘వెరైటీ’ గా చెయ్యలనుకునేది. ఆవిడ అందుకు అవకాశం ఇచ్చే వారు కాదు. పైకి ఏమీ అనలేక వాసంతి తనలో తను గొణుక్కుంటూ ఉండేది.

ఇక సెలవరోజు వస్తే, ఆవిడ తరపు చుట్టాలో, మామగారి తరపు చుట్టాలో వచ్చేవారు. దగ్గర వాళ్ళైతే ఒకటి రెండు రోజులు ఉండి వెళ్ళే వాళ్ళు. ఇల్లు ‘తిరుణాళ్ళు’ లాగా ఉండేది. సెలవు రోజు కూడా కాస్త ప్రశాంతం గా లేకుండా ఇంటి నిండా ‘చుట్టాలు’, వాళ్ళకి వండి పెట్టే ‘హడావుడి’, వాసంతికి కొంచెం విసుగ్గా ఉండేది. ఏమీ అనటానికి ఉండేది కాదు. ఆ వచ్చిన వాళ్ళు కూడా ‘మామగారి అక్కచెల్లెళ్ళో’, ‘అత్తగారి అక్కచెల్లెళ్ళో’ అయి ఉండే వాళ్ళు.

వినయ్ చిన్నప్పుడే తండ్రిని పోగొట్టుకున్నాడు కనుక వచ్చి ఆప్యాయంగా ‘యోగ క్షేమాలు’ కనుక్కుని పెద్ద దిక్కుగా ఉండే వాళ్ళు. వాసంతి తో కూడా ‘సొంత కూతురి’తో ఉన్నట్లు మసులుకునే వారు. అయినా తరాల అంతరాల వల్ల ఇందులో ఉండే ‘ఆప్యాయత’ కోణం చూడ గలిగేది కాదు వాసంతి.

కొంత కాలం గడిచాక, హఠాత్తుగా వినయ్ తల్లి కాలం చేసింది. వినయ్ కి ఎక్కడలేని దిగులు వేసి ఎంతకాలమైనా కోలుకోలేకపోయాడు. అమ్మ ‘ఇలా చేసేది’, ఈ కూర ‘ఇలా వండేది’, ఆ పని ‘అలా చేసేది’ అని తల్చుకుని తల్చుకుని బాధ పడేవాడు. వాసంతికి కూడా అత్తగారు లేని ఇల్లు ఏదో ‘నిశ్శబ్దం’ గా ‘భయంకరం’గా అనిపించటం మొదలుపెట్టింది.

ఆవిడ పోయాక, వీళ్ళిద్దరు ఉద్యోగాలు చేస్తారు కనుక, ఇంట్లో ఎవరూ ఉండరు కనుక బంధువుల రాకపోకలు తగ్గిపోయాయి. ఒక్క సారిగా వాసంతికి, తమని అందరూ ‘వెలేసినట్లు’,తమకి ‘ఎవ్వరూ లేనట్లు’ ఒక ‘ఒంటరితనం’ వెంటాడ సాగింది.

'అత్తయ్యగారు ఉన్నన్నాళ్ళు, ఇల్లు సంత లాగా ఉండేది, కాస్త కూడా రెస్ట్ ఉండేది కాదు, సెలవరోజులు కూడా బజార్ కెళ్ళి వచ్చిన చుట్టాలకోసం ఎక్కువెక్కువ కూరలు, సరుకులు తేవటమే సరిపోయేది అని విసుక్కునేదాన్ని, ఇప్పుడు లేచామా లేవ లేదా అని పలకరించే వాళ్ళే లేరు’ అని ‘వాసంతి’ ఒక న్యూనతా భావం తో బాధపడ సాగింది.

‘ఇంతే కదా, “గేదె చచ్చాక కానీ పాడి బయట పడదు”. పోగొట్టుకున్నాక పాడి విలువ తెలిసినా ప్రయోజనం ఉండదు’ అనుకుంది వాసంతి.

* * *


కామెంట్‌లు