ముత్యాల హారం( బాలల కథ)-పండుగాయల సుమలత. గొట్లూరు.కర్నూలుజిల్లా.


 అనగనగా  ఒక  రాజు. అతని  భార్య  రాణి సువర్చలా దేవి. వీరి  సంతానం  ప్రభావతి. రాజుగారికి  కోపం  చాలా  ఎక్కువ.  మంచి పాలనను  అందించాలంటే  చిన్న  నేరం చేసిన  వారిని  సైతం కఠినంగా శిక్షించాలనే మనస్తత్వం అతనిది.

ఒక రోజు రాజుగారి ముద్దుల కుమార్తె ప్రభావతి స్నానానికి వెళ్లేముందు నగలన్నింటిని తీసి అలంకరణ మందిరంలో పెట్టింది. తర్వాత నగలు అలంకరించుకుందామని  చుాస్తే వాటిలో ముత్యాల  హారం కనిపించలేదు. అది ఆమె తండ్రి  ప్రేమతో ఇచ్చిన ముత్యాల హారం.అది అంటే ప్రభావతికి ఎంతో ప్రీతి. అయినా దాన్ని తీసే ధైర్యం ఎవరికి ఉంది?అంతఃపురంలో పనిచేసే లక్ష్మమ్మ మీద అనుమానం కలిగింది. ఈ విషయాన్ని ప్రభావతి ఆమె తల్లిదండ్రులకు చెప్పలేదు. మంత్రిగారితో జరిగింది చెప్పి,ఈ విషయం మహారాజుకు  తెలియకుండా హారం ఆచూకి కనిపెట్టాలని కోరింది.

మంత్రికి కూడా లక్ష్మమ్మ  మీదే అనుమానం కలిగింది.

లక్ష్మమ్మ, ఆమెభర్త రాణిభవంతికి కొద్దిదూరంలో ఉన్న చిన్న ఇంట్లో ఉంటున్నారు.లక్ష్మమ్మలేని సమయంలో ఆమె ఇంటికి వెళ్లి ఆమెభర్త అయిన శివయ్యతో  " నేను లక్ష్మమ్మకు  ముత్యాల హారం ఇచ్చి రహస్యంగా దాచిపెట్టమన్నాను. అలా చేస్తే  పది బంగారు నాణేలు ఇస్తానని చెప్పాను. ఇప్పుడు ఆ హారం తో పని ఉంది.లక్ష్మమ్మను పిలవండి" అన్నాడు.

"నా భార్య ఇంట్లో లేదు. హారం నాకిచ్చి దాచమని చెప్పింది. మీరిచ్చారని చెప్ప లేదు" అన్నాడు శివయ్య.

మంత్రిగారి అనుమానం నిజమైంది.

హారాన్ని తీసుకొని వెళ్లిపోయాడు మంత్రి. మరుసటి రోజు లక్షుమ్మను పిలిపించి దండించాడు మంత్రి, పనిలో నుండి తొలగించాడు."నిజానికి నీకు పెద్ద శిక్ష విధించాలి. యువరాణి ప్రభావతి మంచిమనసుతో ఈ విషయం ఎవరికీ తెలియవద్దని కోరింది, అందుకు నీకు శిక్ష తప్పింది" అని అన్నాడు.

" నన్ను క్షమించండి  ప్రభూ! "అంటూ తలొంచుకునివెళ్ళిపోయింది.ఎప్పుడూ ఎక్కడా దొంగతనం చేయకూడదని నిర్ణయించుకుంది.