వసంత పంచమి' విశిష్టత!:-----సుజాత.పి.వి.ఎల్

 జ్ఞానము మనిషిని మనీషిగా తీర్చిదిద్దుతుంది. 
జ్ఞానము , విద్య , చదువు పర్యాయపదాలు. 
విద్యకు అధిదేవత , జ్ఞానప్రదాయిని అయిన శ్రీ సరస్వతీదేవి జన్మదినంగా భావించి , స్మరించి , పూజించే రోజే వసంత పంచమి.ఈ వసంత పంచమిని.శ్రీ పంచమి, మదన పంచమి అని కూడా అంటారు. యావద్భారతావనిలో ప్రజలంతా , ఆ తల్లి కటాక్షం కోసం పూజలు జరిపే పర్వదినమే వసంత పంచమి. 
ఈరోజునే క్షీరసాగర మథన సమయంలో మహాలక్ష్మి ఆవిర్భవించిన కారణంగా మదన పంచమిగా కూడా పేర్కొంటారు.
'యాదేవీ సర్వభూతేషు విద్యారూపేణ సంస్థితా' అంటూ సకల విద్యాస్వరూపిణి ఐన సరస్వతిగా ఆవిర్భవించిన పరమపావనమైన తిథి. 
బ్రహ్మవైవర్త పురాణం ఆదిగా ఎన్నో పురాణాలు ఈ రోజు సరస్వతీదేవిని అర్చించాలని శాసిస్తున్నాయి.
చంద్రికా చంద్రవదనా తీవ్రా మహాభద్రా మహాబలా భోగదా భారతీ భామా గోవిందా గోమతీ శివా’’ అని ప్రతిరోజూగాని, పంచమినాడు సప్తమి తిథులలో కాని, సరస్వతీ జన్మనక్షత్రం రోజు గాని పూజించిన వారికి ఆ తల్లి కరుణాకటాక్షాలు పుష్కలంగా లభిస్తాయి.
'వాగేశ్వరీ, మహాసరస్వతి, సిద్ధసరస్వతి, నీలసరస్వతి, ధారణ సరస్వతి, పరాసరస్వతి, బాలాసరస్వతి'' ఇలా అనేక నామాలున్నప్పటికీ ''సామాంపాతు సరస్వతీ.... '' అని పూజించే వారు ఆ తల్లికి ఎక్కువ ప్రేమపాత్రులట.
'వేదాయై వేదరూపాయై వేదాంతాయై నమో నమఃl
గుణదోషవివర్జిన్యై గుణదీప్త్యై నమో నమః ||
సర్వఙ్ఞానే సదానందే సర్వరూపే నమో నమఃll
సంపన్నాయై కుమార్యై చ సర్వఙ్ఞే తే నమో నమః!l'