తలపులలో ఘనాపాటి
సాయంత్రం ఆరుబయట
మంచంపై మేను వాల్చె
నింగిలోని చంద్రుని కని
ఊహల్లో పయనించెను
గొప్ప గొప్ప పోలికలతొ
జాబిల్లిని తలపోసెను
వెన్నముద్ద పోగువోలె
ఉన్నదనుచు అనుకొనెను
పాలరాయి నిలయం వలె
ప్రకాశించె ననుకొనెను
అంతలోనె అటకు వచ్చె
చిట్టి పొట్టి మనుమరాలు
ఊహల్లో ఉన్న తాత
ఆమె నేమొ అడిగెనిట్లు :
" ఆకసాన జాబిల్లిని
చూశావా బుజ్జి పాపా !
ఎలా ఉందో చెప్పగలవా ?
చిన్ని పొన్ని బుజ్జి బాలా !
తాత గారి మాటలు విని
నింగి చూసి మనుమరాలు
పెళ్లి విందు అప్పడంలా
చందమామ ఉన్నదనెను
నింగిలోని జాబిల్లిని
అప్పడంగ పోల్చినట్టి
మనవరాలి ఊహకు
అబ్బుర పడె తాతగారు
వెనువెంటనె తాత గారు
" భల్లారే నీ పోలిక !
నను మించుము మనుమరాల ! "
దీవించెను మనసుదీర !
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి